‘పన్ను’పోటు తగ్గించండి

ABN , First Publish Date - 2022-01-31T07:43:39+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్న 2022-23 బడ్జెట్‌పై వేతన జీవులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు...

‘పన్ను’పోటు   తగ్గించండి

ఆదాయపన్ను స్లాబులను సవరించండి

 డెలాయిట్‌ సర్వేలో పన్నుచెల్లింపుదారుల అభిప్రాయం


న్యూఢిల్లీ, జనవరి 30: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్న 2022-23 బడ్జెట్‌పై వేతన జీవులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘పన్ను’పోటును తట్టకోలేకపోతున్నామని, నిజాయితీగా ఐటీఆర్‌ ఫైల్‌చేసే తమకు మరిన్ని మినహాయింపులు కావాలని కోరుతున్నారు. డెలాయిట్‌ ఇండియా నిర్వహించిన ఈ ఆన్‌లైన్‌ సర్వేలోని ముఖ్యాంశాలు..


పాత ట్యాక్స్‌ పద్ధతే బెస్ట్‌

సర్వేలో పాల్గొన్న 62.8% మంది పాత ట్యాక్స్‌ పద్ధతికే జైకొట్టారు. 24.3ు మంది కొత్త పద్ధతి వైపు చూస్తున్నట్లు చెప్పగా.. 12.9ు మంది కొత్త పద్ధతి బాగుందని పేర్కొన్నారు. కొత్త ట్యాక్స్‌ పద్ధతిని ఎంచుకుంటే.. ఇంటి కిరాయి(రూ. 64వేల వరకు), ఎల్‌టీఏ, విపత్తుల వల్ల ఇంట్లో ఫర్నిచర్‌ నష్టం(రూ. 2లక్షల వరకు), సెక్షన్‌ 80సీ(రూ. 1.5లక్షల వరకు), సెక్షన్‌ 80డీ(రూ. 25వేల వరకు) వంటి మినహాయింపులను వదులుకోవాల్సి వస్తుంది. అందుకే.. రూ. 5 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్నవారంతా పాత పద్ధతే బెటర్‌ అని సర్వేలో వెల్లడించారు.


స్లాబులను సవరించండి

ఆదాయపన్ను స్లాబులను సవరించాలని 77.7ు మంది కోరుకున్నారు. ప్రస్తుతం రూ. 10 లక్షల వార్షికాదాయం దాటిన వారంతా 30ు పన్ను(పాత విధానంలో) పరిధిలోకి వస్తున్నారని, ఈ కేటగిరీని రూ. 20లక్షలకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 30ు పన్ను పరిధిలో ఉన్నవారంతా ట్యాక్స్‌ సేవింగ్‌లను చూపుతూ పాత ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌(ఐటీఆర్‌)ను ఎంచుకుంటున్నారని, కొత్త విధానానికి మారడం లేదని చెప్పారు.

మినహాయింపులను పెంచాలి

80సీ, 80డీ, గృహ రుణాలపై వడ్డీ వంటివాటిపై ప్రస్తుతం ఉన్న మినహాయింపులను పెంచాలని సింహభాగం ట్యాక్స్‌ పేయర్స్‌ కోరుకుంటున్నారు. బీమా సంస్థలు ప్రీమియంను విపరీతంగా పెంచిన నేపథ్యంలో.. ఆరోగ్య బీమా(80డీ) మినహాయింపులను రూ. 50 వేలకు పెంచాలని, సర్‌చార్జీ రేట్లను తగ్గించాలని ఆకాంక్షిస్తున్నారు. 80సీ కింద ప్రస్తుతం రూ.1.5 లక్షల వరకు ఉన్న మినహాయింపును ఇంకా పెంచితే.. పౌరులకు సేవింగ్స్‌ పట్ల ప్రోత్సాహం ఉంటుందని వివరిస్తున్నారు. గృహ రుణాల వడ్డీపై మినహాయింపులను ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది కోరారు. ఆదాయపన్ను విషయంలో తమకు అదనపు మినహాయింపులు ఇవ్వాలని 47.7ు మంది మహిళలు, 73.5ు మంది సీనియర్‌ సిటిజన్లు కోరారు.

Updated Date - 2022-01-31T07:43:39+05:30 IST