పన్నునొప్పి

ABN , First Publish Date - 2021-06-19T05:42:48+05:30 IST

పన్నునొప్పి

పన్నునొప్పి

కొత్త ఇళ్లపై భారీగా వడ్డన  

ఖాళీ స్థలాలపై 0.5 శాతం

15 శాతమే పెంచుతామంటూ మంత్రి బొత్స బుకాయింపు

చట్టంలో ఎక్కడా అది లేదంటున్న విపక్షాలు

ఏటా పెరిగే రిజిస్ట్రేషన్‌ విలువలతో మరింత భారం

నగరవాసుల గుండెల్లో భయం

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు సాంబశివరావుకు పటమటలంకలోని కొమ్మా పూర్ణచంద్రరావు వీధిలో 532 గజాల్లో 3వేల చదరపు అడుగుల విశాలమైన భవనం ఉంది. ఆయన తండ్రి కట్టించిన ఆ భవనంలోనే సాంబశివరావు కుటుంబం ఉంటోంది. ఆయన తన ఇంటిని ఎవరికీ అద్దెకు ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతం రూ.5,800 మాత్రమే ఏడాదికి ఇంటి పన్ను రూపేణా చెల్లిస్తున్నారు. తాజాగా మారనున్న ఇంటి పన్ను విధానంలో తనపై ఎంత భారం పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆయన ఉన్న ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ విలువ గజం రూ.42,000 ఉండగా, భవన నిర్మాణ విలువ అడుగు రూ.1,100. అంటే ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.2,56,44,000. తాజా విధానంలో రెసిడెన్షియల్‌ భవనాలపై ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధిస్తారు. మొత్తం ఆస్తి విలువపైన 0.15 శాతం పన్ను వేస్తారు అంటే.. ఈ ఇంటిపై పన్ను ఏడాదికి రూ.38,466 చెల్లించాల్సి ఉంటుందని ఆయన లెక్కలేసుకున్నారు. అయితే, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ప్రస్తుత ఇంటి పన్నుపై కేవలం 15 శాతమే పెంపు ఉంటుందని చెప్పడంతో సాంబశివరావు కాస్త ఊరట చెందారు. ఈ లెక్కన తాను ప్రస్తుతం కడుతున్న పన్నుకు అదనంగా రూ.870 (15 శాతం పెంపు) కలిపి రూ.6,670 కడితే సరిపోతుందనుకున్నారు. కానీ, 15 శాతమే పెంపు ఉంటుందని ఇటీవల విజయవాడ నగరపాలక సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఎక్కడా పేర్కొనకపోవడంతో సాంబశివరావు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీ ప్రభుత్వం పన్ను బాదుడుకు సిద్ధమైపోయింది. దీంతో విజయవాడ నగరపాలక సంస్థ ఈనెల 4న పన్ను పెంపునకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వాస్తవానికి రిజిస్ట్రేషన్‌ విలువల ఆధారంగా పన్ను వేయాలన్న నిర్ణయం గత ఏడాది నవంబరులోనే జరిగిపోయింది. ఈ మేరకు జీవో 198ను ప్రభుత్వం జారీ చేసింది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా దాన్ని ఎక్కడా అమలు చేసేందుకు సాహసించలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో పన్ను కొరడా ఝళిపించేందుకు వైసీపీ సర్కార్‌ సిద్ధమైంది. 

కొత్త ఇల్లు కడితే బాదుడే..!

విజయవాడ నగరపాలక సంస్థ జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం నివాస గృహాల ఆస్తి విలువలో 0.15 శాతం పన్ను విధిస్తారు. నివాసేతర గృహాల ఆస్తి విలువలో 0.3 శాతం, ఖాళీ స్థలాలపై 0.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో నివాసాలపై 0.5 శాతం వరకు పన్ను పెంచవచ్చని చట్టంలో స్పష్టం చేశారు. మరోవైపు భూముల విలువలు ఏటా పెంచుతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తడంతో మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఉన్న పన్నుపై 15 శాతం మించి పెంపు ఉండబోదన్నారు.  15 శాతం పెంచుకుంటూ పోయే వెసులుబాటు చట్టంలో కల్పించారు. ఈ లెక్కన ప్రస్తుతానికి పెంపు 15 శాతమే ఉన్నా ఐదేళ్లలో ప్రస్తుతం కట్టే ఇంటి పన్ను రెండు నుంచి మూడు రెట్లు అయ్యే అవకాశముంది. ఏటా భూముల విలువల పెంపునూ పరిగణనలోకి తీసుకుంటే ఈ పెరుగుదల ఐదు, పది రెట్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కొత్తగా కట్టుకునే ఇంటిపై పన్ను బాదుడు అధికంగా ఉండనుంది. కొత్త ఇంటిపై మొత్తం ఆస్తి విలువలో 0.15 శాతాన్ని పన్నుగా వేస్తారు. ఉదాహరణకు బెంజిసర్కిల్‌ ప్రాంతంలో ఇప్పటికే 200 గజాలు కొన్న వ్యక్తి అక్కడ 2,000 చదరపు అడుగుల ఇంటిని కట్టుకుంటే, సుమారు రూ.48,420 ఇంటి పన్ను కట్టాల్సి ఉంటుంది. అదెలాగంటే, బెంజిసర్కిల్‌ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం గజం రూ.96,400 ఉండగా, భవన నిర్మాణ విలువ చదరపు అడుగు రూ.6,500. ఈ లెక్కన ఈ ఆస్తి విలువను రూ.3,22,80,000గా లెక్కిస్తారు. దీనిపై 0.15 శాతం అంటే రూ.48,420 ఇంటి పన్నుగా నిర్ణయిస్తారు. 

ఖాళీ జాగా ఉంటే జేబు ఖాళీనే..

చాలామంది తాము పొదుపు చేసిన డబ్బును ఇంటి స్థలాల కొనుగోలుపై పెట్టుబడిగా పెడతారు. భవిష్యత్తులో అది భారీగా పెరిగి ఆపద సమయంలో తమను ఆదుకుంటుందన్న ఆశ చాలామంది మధ్యతరగతి వారిలో ఉంటుంది. ఆ ఆశలపై వైసీపీ సర్కార్‌ నీళ్లు చల్లింది. ఖాళీ స్థలాల రిజిస్ర్టేషన్‌ విలువపై 0.5 శాతం పన్ను వసూలు చేస్తారు. ఉదాహరణకు.. ఎవరికైనా సత్యనారాయణపురంలోని శారదా కాలేజీ ప్రాంతంలో 200 గజాల స్థలం ఉందనుకుంటే ఆయన రూ.37,500 పన్నుగా చెల్లించాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ విలువ గజం రూ.37,500 ఉంది. అంటే.. మొత్తం ఆస్తి విలువ రూ.75,00,000. దీనిపై 0.5 శాతం అంటే రూ.37,500 పన్ను కట్టాలి. 

పెట్రో ధరల మాదిరి పెంచేస్తున్నారు

మంత్రి బొత్స చెబుతున్నట్లు ఇంటి పన్ను పెంపు 15 శాతమే అనేది నమ్మశక్యంగా లేదు. అలాగని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు. దీన్నిబట్టే పన్ను బాదుడు ఎలా ఉండబోతోందో స్పష్టమవుతుంది. అసలే కరోనా కారణంగా జీవితాలను భారంగా లాక్కొస్తున్న సామాన్యులపై ఇంటిపన్ను భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసం. పెట్రో ధరలు రోజూ పెరుగుతున్నట్టే.. ఇంటి పన్ను కూడా ఏటా పెరగడం ఖాయం. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే ప్రజా పోరాటాలు ఒక్కటే శరణ్యం. 

- చిగురుపాటి బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు




Updated Date - 2021-06-19T05:42:48+05:30 IST