ములకలమ్మ చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

ABN , First Publish Date - 2022-05-16T06:29:03+05:30 IST

మట్టిని యథేచ్ఛగా మింగేస్తున్నారు. వైసీపీ నేతలు అధికారం అడ్డం పెట్టుకుని ఎక్కడపడితే అక్కడ చెరువులో గోతులు పెట్టేస్తున్నారు.

ములకలమ్మ చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

మెరక పేరుతో అనుమతులు.. ఇటుక బట్టీలకు తరలింపులు

పోటీలు పడి మట్టిని మింగేస్తున్న వైసీపీ నేతలు 

అసలేం పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

గన్నవరం, మే 15 : మట్టిని యథేచ్ఛగా మింగేస్తున్నారు. వైసీపీ నేతలు అధికారం అడ్డం పెట్టుకుని ఎక్కడపడితే అక్కడ చెరువులో గోతులు పెట్టేస్తున్నారు. వైసీపీ గ్రామ కన్వీనర్‌ కనుసన్నల్లో ఈ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. మండలంలోని వీరపనేనిగూడెం ములకలమ్మ చెరువు అక్రమ తవ్వకందారులకు అడ్డాగా మారింది. మేం రైతులం. పొలాలు మెరక చేసుకోవడానికి మట్టి కావాలంటూ తవ్వకందారులు రైతుల ముసుగులో విజయవాడలోని ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయంకు వెళ్లి పర్మిషన్‌లు తెస్తున్నారు. అధికారులు వీరికి సునాయాసంగా పర్మిషన్‌లు ఇచ్చేస్తున్నారు. నిజంగా మట్టి అవసరం ఉన్న వాళ్లు పర్మిషన్‌ కోసం వచ్చారా లేక పర్మిషన్‌ను అడ్డం పెట్టుకుని అక్రమంగా మట్టి తవ్వకాల ద్వారా లక్షలు పోగుజేసుకునేందుకు వస్తున్నారా అనేది కనీసం ఆలోచన చేయకుండా క్షేత్ర స్థాయిలో తవ్వకం, ఎన్ని క్యూబిక్‌ మీటర్లు, ఎక్కడ తవ్వాలో కనీసం చెప్పకుండా పర్మిషన్‌లు ఇవ్వడంలోని అంతరార్థం ఇరిగేషన్‌ అధికారులకే తెలియాలి. ఈ వేసవిలో ములకలమ్మ చెరువును అడ్డదిడ్డంగా తవ్వేందుకు పర్మిషన్‌లు ఇచ్చేశారు. దీంతో అక్రమ తవ్వకాలకు అధికారులే ఊతం ఇచ్చినట్టయ్యింది. అనుమతులు పొందిన వారిని సాకుగా చూపించి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. వీరపనేనిగూడెంలో రైతుల అవసరాలకు కాకుండా నేరుగా ఇటుక బట్టీల వ్యాపారులకు మట్టిని యథేచ్ఛగా తవ్వి గడచిన కొన్ని నెలల నుంచి తరలిస్తున్నారు. అధికార వైసీపీలో మట్టి డబ్బు రుచి మరిగిన నేత ఒకరు నేనున్నానంటూ అక్రమ తవ్వకాలకు అండగా నిలుస్తున్నాడని ఆ గ్రామంలో బహిరంగంగా చెబుతున్నారు. గ్రామ కన్వీనర్‌గా, పంచాయతీలో సైతం ఉపసర్పంచ్‌గా చక్రం తిప్పుతూ మట్టి తవ్వకాలను ప్రోత్సహిస్తూ లక్షలు పోగుజేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి ఇరిగేషన్‌ అధికారులు వత్తాసు పలుకుతూ గ్రామస్థుల ఫిర్యాదును పట్టించుకోకుండా ఫిర్యాదుదారుల పేర్లు, ఫోన్‌ నెంబర్‌లు వైసీపీ నేతకు ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ములకలమ్మ చెరువును ఒక క్రమ పద్ధతిలో తవ్వాలని ఇరిగేషన్‌ శాఖ నిబంధనలు సూచిస్తుంటే తవ్వకందారులు ఎక్కడ మంచి మట్టి వస్తుంటే అక్కడ గోతులు పెట్టేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో చెరువుకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టి తవ్వకాలపై ఇప్పటికే పలుసార్లు గ్రామంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో బహిరంగంగా వైసీపీ నేతలు, తవ్వకందారులు మధ్య పంచాయతీలు జరిగాయి. బాహాటంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుని అప్పట్లో ఇటుక బట్టీలకు మట్టి తరలించకుండా ఆపారు. మరలా బేరం కుదరటంతో బట్టీలకు మట్టిని తరలించేస్తున్నారు. ఇప్పటికైన అక్రమ తవ్వకాలు ఆపాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు. పర్మిషన్‌లు తెచ్చుకున్న 2900 క్యూబిక్‌ మీటర్లు ఎప్పుడో తవ్వి తరలించేశారు. అయినా యథేచ్ఛగా ఇంకా మట్టిని తరలిస్తూ అక్రమార్జనకు తెగబడ్డారు. ఉన్నతాధికారులు, కలెక్టర్‌ స్పందించాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు. ఇటుక బట్టీల వ్యాపారులకు తరలించే మట్టిని తెలివిగా రైతుల నుంచి పొలం లీజుకు తీసుకుని అందులో మట్టి నింపుకుని భవిష్యత్‌ అవసరాలకు నిల్వ చేసుకుంటున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఇరిగేషన్‌ అధికారులు కళ్లు తెరచి ములకలమ్మ చెరువు గర్భాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు, తవ్వకాలు, తరలింపుపై విచారణ చేసి మట్టి తరలింపును నిలుపుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇటుక బట్టీల కోసమే తవ్వకాలు

ఎ. కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు 

ఇటుక బట్టీల నిర్వాహకుల కోసమే ములకలమ్మ చెరువులో తవ్వకాలు చేస్తున్నారు. అనుమతులు ఒకరి పేరున మట్టి తరలింపు మరొకరికీ చేస్తున్నారు. యథే చ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులు కన్నెత్తి చూడటంలేదు. వైసీపీ అధికార ముసుగులో చెరువును ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. అక్రమార్కుల భారి నుంచి చెరువును కాపాడాలి. 

Updated Date - 2022-05-16T06:29:03+05:30 IST