ఇక తత్కాల్‌ రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2022-06-02T13:48:31+05:30 IST

పత్రాల రిజిస్ట్రేషన్‌లో ఏర్పడుతున్న జాప్యం, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో వినూత్నంగా

ఇక తత్కాల్‌ రిజిస్ట్రేషన్‌

- రూ.5 వేలు కడితే చాలు

- ముందుగా వంద కార్యాలయాల్లో అమలు


చెన్నై, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): పత్రాల రిజిస్ట్రేషన్‌లో ఏర్పడుతున్న జాప్యం, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో వినూత్నంగా ‘తత్కాల్‌’ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆ మేరకు రూ.5వేలు చెల్లిస్తే కొన్ని గంటల వ్యవధిలో పత్రాల రిజిస్టేషన్‌ చేయనుంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శి జ్యోతినిర్మలా సామి బుధవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ... ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించి వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను, మూలపత్రాలను అప్‌లోడ్‌ చేసి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. ఆ వెబ్‌సైట్‌ ద్వారానే ప్రజలు తమ పత్రాలను ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏ రోజు, ఏ సమయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న వివరాలను టోకెన్‌ ద్వారా పొందే సదుపాయం కూడా ఉందని తెలిపారు. అయితే ఈ పద్ధతిలో పత్రాలను రిజిస్ట్రేషన్‌ చేయడానికి ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు వంద టోకెన్లు మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. అయితే అత్యవసరంగా పత్రాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకున్నవారు ఈ పద్ధతిలో గంటల తరబడి వేచి ఉండలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో ‘తత్కాల్‌’ పద్ధతిలో పత్రాల రిజిస్ట్రేషన్‌ను వంద సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయాల్లో అమలు చేయనున్నామని ఆమె వివరించారు. ఈ పద్ధతి ద్వారా రూ.5వేలు ఫీజు చెల్లిస్తే ప్రజలు తమకు నచ్చిన సమయంలో పనిదినాల్లో ఏ రోజైనా టోకెన్లు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రతిరోజూ ఇస్తున్న వంద టోకెన్లకు ఆరు రకాల సమయాలను కేటాయిస్తున్నారు. ఈ సాధారణ టోకెన్లకు సంబంధించి విడతల వారీగా పత్రాల రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. ఈ విధంగా ప్రతి విడత పత్రాల రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యే సమయంలో రూ.5వేల తత్కాల్‌ టోకెన్లు పొందిన ఇద్దరి పత్రాల రిజిస్ట్రేషన్‌ను అధికారులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు. ఈ తత్కాల్‌ విధానంలో రోజుకు పది టోకెన్లను మాత్రమే ఇస్తారు. రెండు నెలలకు ముందే ఈ తత్కాల్‌ టోకెన్లు పొందటానికి వీలుంది. ఈ పద్ధతిలో ప్రజలు సులువుగా తమ పత్రాలను తమకు నచ్చిన రోజు, నచ్చిన సమయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోగలుగుతారని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-06-02T13:48:31+05:30 IST