సీఎన్‌జీ విభాగంలోకి టాటా మోటార్స్‌

ABN , First Publish Date - 2022-01-20T06:13:21+05:30 IST

టాటా మోటార్స్‌ సీఎన్‌జీ విభాగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా బుధవారం టియాగో, టిగోర్‌ మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్లను విడుదల చేసింది.

సీఎన్‌జీ విభాగంలోకి టాటా మోటార్స్‌

టియాగో, టిగోర్‌ మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్ల విడుదల 


న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ సీఎన్‌జీ విభాగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా బుధవారం టియాగో, టిగోర్‌ మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్లను విడుదల చేసింది. టియాగో ఐసీఎన్‌జీ శ్రేణి ధర రూ.6.09 లక్షలు-రూ.7.64 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) మధ్య ఉండగా.. టిగోర్‌ ఐసీఎన్‌జీ మూడు వేరియంట్ల ధర వరుసగా రూ.7.69 లక్షలు, రూ.8.29 లక్షలు, రూ.8.41 లక్షలుగా ఉంది. దేశీయంగా సీఎన్‌జీ మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని టాటా మోటార్స్‌ యోచిస్తోంది. రానున్న కొన్నేళ్లలో సీఎన్‌జీ సెగ్మెంట్‌ బాగా వృద్ధి చెందుతుందని, ఈ డిమాండ్‌ పెరుగుదలకు అనుగుణంగా తాము రెండు మోడళ్లను ఎంచుకున్నామని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేశ్‌ చంద్ర తెలిపారు. గత కొన్నేళ్లలో సీఎన్‌జీ కార్లకు డిమాండ్‌ బాగా పెరిగిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ కార్ల అమ్మకాలు అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 60 శాతం పెరిగినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 97 శాతం పెరిగాయని తెలిపారు. 


బీఎస్‌6 ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్‌తో నడిచే హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్‌ సెడాన్‌లకు డిమాండ్‌ పూర్తిగా తగ్గిపోయిందని, సీఎన్‌జీ సెగ్మెంట్‌ మాత్రం బలమైన వృద్ధిని సాధించిందని ఆయన చెప్పారు. గత కొన్నేళ్లలో సీఎన్‌జీ కార్ల అమ్మకాలు పెరిగేందుకు దోహదపడిన అంశాల గురించి వివరిస్తూ.. గత కొన్నేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కస్టమర్లు సీఎన్‌జీ ఆప్షన్లపై దృష్టిపెట్టేలా చేసిందన్నారు.

Updated Date - 2022-01-20T06:13:21+05:30 IST