‘టాటా ఆస్పత్రి’ లీజు గడువు కుదింపు

ABN , First Publish Date - 2020-06-05T09:32:18+05:30 IST

తిరుపతిలో ప్రతిష్ఠాత్మక టాటా కేన్సర్‌ ఆస్పత్రికి కేటాయించిన భూముల లీజు గడువును తగ్గిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో కేన్సర్‌ ఆస్పత్రి నిర్మించేందుకు టాటా ట్రస్టు 2017లో

‘టాటా ఆస్పత్రి’ లీజు గడువు కుదింపు

  • 33 ఏళ్లకు డీల్‌.. ఇప్పుడది 30 ఏళ్లకు
  • కేన్సర్‌ ఆస్పత్రికి 2018లో అలిపిరిలో శ్రీకారం


తిరుపతిలో ప్రతిష్ఠాత్మక టాటా కేన్సర్‌ ఆస్పత్రికి కేటాయించిన భూముల లీజు గడువును తగ్గిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో కేన్సర్‌ ఆస్పత్రి నిర్మించేందుకు టాటా ట్రస్టు 2017లో ముందుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని నాటి ప్రభుత్వం స్వాగతించింది. రతన్‌ టాటాతో చర్చించి టాటా ట్రస్టు ఒక్కటే కాకుండా టీటీడీతో కలసి ఆస్పత్రి నిర్మిస్తే బాగుంటుందని అప్పటి సీఎం చంద్రబాబు సూచించారు. దానికి అంగీకరించిన రతన్‌ టాటా.. అలమేలు చారిటబుల్‌ ఫౌండేషన్‌ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి టీటీడీతో కలసి రూ. 600 కోట్ల భారీ పెట్టుబడితో శ్రీవారి పేరిట 300 పడకల కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో అలిపిరి వద్ద సర్వే నంబరు 588-ఏలోని పాతిక ఎకరాల భూమిని టీటీడీ కేటాయించింది. 33 ఏళ్లపాటు లీజుపై భూమిని కేటాయించారు. చంద్రబాబు, రతన్‌ టాటా ఆస్పత్రి నిర్మాణానికి 2018 ఆగస్టు 31న శంకుస్థాపన చేశారు. అయితే 33 ఏళ్ల గడువుతో లీజు ఒప్పందం రిజిస్టర్‌ చేసుకోవడంలో కొన్ని సంక్లిష్టతలున్నాయంటూ టాటా ట్రస్టు లీజు గడువును 33 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు తగ్గించాలని టీటీడీని కోరినట్టు అధికారులు చెబుతున్నారు. దానికనుగుణంగా గతేడాది డిసెంబరు 28న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో (187వ నంబరు తీర్మానం) పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 22న లీజు ఒప్పందం కూడా రిజిస్టర్‌ అయింది. దీనిపై మార్చి 6వ తేదీన టీటీడీ ఈవో తమ చర్యను ఆమోదించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Updated Date - 2020-06-05T09:32:18+05:30 IST