tatagroup iphone: టాటా గ్రూప్ కీలక అడుగులు.. భారత్‌లో ఐఫోన్...

ABN , First Publish Date - 2022-09-09T23:34:38+05:30 IST

దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్(Tata Group) భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి(iphone production)లో భాగస్వామి కావాలనుకుంటుందా?.

tatagroup iphone: టాటా గ్రూప్ కీలక అడుగులు.. భారత్‌లో ఐఫోన్...

న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్(Tata Group) భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి(iphone production)పై కన్నేసిందా?. తయారీలో భాగస్వామి కావాలనుకుంటుందా?. ఈ దిశగా ఇప్పటికే రంగంలోకి దిగిందా ?.. అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇండియాలో ఐఫోన్ ఉత్పత్తి లక్ష్యంగా యాపిల్ కంపెనీ(apple)కి తైవాన్ సప్లయర్‌గా ఉన్న విస్ట్రోన్ కార్ప్‌తో(Wistron corp) టాటా గ్రూపు(tata group) చర్చలు జరుపుతోంది. విస్ట్రోన్ కార్ప్‌తో జాయింట్ వెంచర్‌తో భారత్‌లో విడిభాగాల అమరికను చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అపార అనుభవం ఉన్న విస్ట్రోన్ కార్ప్ సహకారం తీసుకోవాలని కంపెనీ యోచిస్తోంది.


ప్రొడక్షన్ డెవలప్‌మెంట్, సప్లయ్ చెయిన్, అమరికల్లో విస్ట్రోన్ కార్ప్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోందని ఈ వ్యవహారంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి. టాటా గ్రూప్ యోచిస్తున్నట్టు విస్ట్రోన్‌తో ఒప్పందం కుదిరితే భారత్‌లో ఐఫోన్ తయారీ చేపట్టనున్న తొలి దేశీయ కంపెనీగా టాటా నిలవనుంది. ప్రస్తుతం తైవాన్ దిగ్గజ కంపెనీలైన విస్ట్రోన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూపు భారత్‌లోని చెన్నైలో ఐఫోన్లను తయారుచేస్తోన్న విషయం తెలిసిందే.


కాగా భారతీయ కంపెనీ ఐఫోన్లు తయారు చేస్తే చైనా సవాళ్లను ఎదుర్కోవడంలో  దేశీయ సెల్‌ఫోన్ రంగానికి ఊతమిచ్చినట్టవుతుంది. ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రానిక్ రంగంలో చైనా హవానే కొనసాగుతోంది. కొవిడ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల కారణంగా దేశీయంగా సెల్‌ఫోన్ల ఉత్పత్తి కొంతమేర పెరిగిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-09-09T23:34:38+05:30 IST