Abn logo
Aug 3 2021 @ 01:14AM

అభివృద్ధి రుచి చూపిస్తా

సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ, నాయకులు

నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు 

కొత్తగా గుర్రంపోడుకు లిఫ్ట్‌ సర్వేకు ఆదేశం

మరోసారి సాగర్‌లో సమీక్ష

15లిఫ్ట్‌ల పనులు ఏడాదిన్నరలోపు పూర్తి

నందికొండలో నెలలో హక్కు పత్రాలు

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రగతి సమీక్షలో సీఎం కేసీఆర్‌

సాగర్‌పై వరాల జల్లు


నల్లగొండ, ఆగ స్టు 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) హాలియా: హైదరాబాద్‌లో అనుకున్నంతగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా..నందికొం డ మునిసిపాలిటీకి రూ.15 కోట్లు,హాలియాకురూ.15 కోట్లు, మరో రూ.120కోట్లను నియోజకవర్గంలో రోడ్లతోపాటు ఇతర అభివృద్ధి పనులకు ఇస్తున్నా.. అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపిస్తా అని సీఎం కేసీఆర్‌ అన్నారు. హాలియాలో సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రగతి సమీక్షలో సీఎం మాట్లాడుతూ, సీఎంవరాల జల్లు కురిపించారు. తన మాట మేరకు సాగర్‌ ఉప ఎన్నికలో నోముల భగత్‌కు అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు ప్రజలకు సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజుల క్రితమే ఈ ప్రాంతానికి రావాల్సి ఉందని, అయితే కరోనా కారణంగా రాలేకపోయారన్నారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి వెళ్లాక కరోనా బారిన పడిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. సాగర్‌ నియోజకవర్గంలో వెనకబాటుతనం బాగా ఉందన్నారు. ఉప ఎన్నిక సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి, చాలామం ది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ పనిచేశారని, ఈ సందర్భంగా వారు గుర్తించి న సమస్యలను తన దృష్టికి తెచ్చారన్నారు. ఇక్కడి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే డొంకదారులే ఉన్నాయని, ఈ దారులను బాగుచేయడంతోపాటు కాజ్‌వేల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖకు ఆదేశాలు జారీచేశామన్నారు. హెలీకాఫ్టర్‌లో గాలిలో వచ్చి గాలిలోపోతే లాభం లేదని భావించి ఊరికి దూరంగా హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి హాలియాకు వాహనంలో వస్తూ పట్టణాన్ని చూశానన్నారు. హాలి యా ఏమాత్రం బాగాలేదని, దీన్ని మనం బాగుచేసి చూపించాలన్నారు. అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపిస్తానని, మరోసారి నాగార్జునసాగర్‌కు వచ్చి సమీక్ష నిర్వహిస్తానన్నారు. గతంలో హాలియా పం చాయతీగా ఉందని, దీంతో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగాలేదన్నారు. నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్ల మరమతు, నిర్మాణం, గ్రామాల్లోని డొంకదారుల్లో సీసీ కల్వర్టుల నిర్మాణం వం టి అన్ని పనులకు కలిపి రూ.120కోట్లు మంజూరు చేస్తున్నానన్నారు. వచ్చే నాలుగు, ఐదు రోజుల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంత్రి జగదీ్‌షరెడ్డి చర్చించి ఈ నిధులతో ఎక్కడెక్కడ పనులు చేయాలో నిర్ణయించాలని ఆదేశించారు.


నందికొండవాసులకు నెలరోజుల్లో పట్టాలు

నందికొండ మునిసిపాలిటీలో ఇరిగేషన్‌, ప్రభుత్వ జాగలతోపాటు ఎన్నెస్పీ క్వార్టర్స్‌లో నివసించే వారికి పట్టాలు ఇస్తామని గతంలో చెప్పానని సీఎం కేసీఆర్‌ అన్నారు. క్వార్టర్స్‌లో ఉన్న వారితో పాటు ఇరిగేషన్‌ జాగలో ఇల్లు నిర్మించుకున్న వారికి నెల రోజుల్లోనే హక్కు పత్రాలు ఇస్తామన్నారు. అందుకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. గుర్రంపోడు లిఫ్ట్‌కు వెంటనే సర్వే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నెల్లికల్లు లిఫ్ట్‌తో పాటు గుర్రంపోడు లిఫ్ట్‌ను కూడా పూర్తి చేస్తామన్నారు. దేవరకొండ ప్రాంతంలోని పొగిళ్ల, నంబాపూర్‌, పెద్దమునిగల్‌, అంబాభవాని, మిర్యాలగూడ ప్రాంతంలోని దున్నపోతులగండి, కేశవాపురం, వీర్లపాలెం, నకిరేకల్‌లోని అయిటిపాముల, హుజూర్‌నగర్‌ ప్రాంతంలో 15లిఫ్ట్‌లను వచ్చే ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తామని తెలిపారు. హాలియా పీహెచ్‌సీని అప్‌గ్రేడ్‌ చేయిస్తానన్నారు. సాగర్‌లో డిగ్రీ కళాశాల లేదని, దీన్ని మంజూరు చేయడమేగాక సిబ్బందిని సైతం కేటాయించి నిధులను వెంటనే ఇస్తామన్నారు. హాలియాకు మినీ స్టేడియం మంజూరు చేస్తామన్నారు. మూడు, నాలుగు రోజుల్లో అభివృద్ధి పనులపై సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. 


సాగర్‌లో రెడ్డి కల్యాణ మండపం

సాగర్‌లో రెడ్డి కల్యాణ మండపానికి రెండున్నర ఎకరాలను కేటాయిస్తామని, షాదీఖానా ను కూడా మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గంలో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉందని, వారి సౌకర్యార్థం మంచి బంజారా భవన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. నియోజకవర్గానికి కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులను చేపట్టాలని నందికొండ, హాలియా మునిసిపాటీల అభివృద్ధి కోసం మునిసిపల్‌ శాఖ మంత్రితో పాటు అధికారులను రప్పించి మంత్రి జగదీ్‌షరెడ్డి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని 25 గ్రామాలకు చెందిన కొంత మంది ప్రజలు రోడ్లవెంట ఇళ్లను నిర్మించుకున్నారని, వారికి విద్యుత్‌ సౌకర్యంతో పాటు మిషన్‌ భగీరథ ద్వారా నీటిని అందించాలన్నారు. జిల్లాలోని దామరచర్లలో రూ.30వేల కోట్లతో అద్భుతమైన పవర్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని లక్ష మందితో ఉండే పట్టణంగా దామరచర్ల కానుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. తండాలు, ఆదివాస ప్రాంతాలు, బంజారా ప్రాం తాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్‌ను మంజూరు చేశామని, గ్రా మాల్లో ప్రస్తుతం డెంగీ, మలేరియా వంటి జ్వరాలు లేవన్నా రు. గతంలో చెట్లను నరకడమే పనిగా ఉందని, ప్రస్తుతం హరితహారం ద్వారా పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచుతున్నామని తెలిపారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు చంద్రబాబునాయుడు నీరు నిలిపివేస్తే తాను సాగర్‌ కట్టపై 50వేల మందితో దండోరా మోగించి నీటిని విడుదల చేయించానన్నారు. నోముల భగత్‌ మీ బిడ్డ ఎవరైనా రండి, కలవండి, సమస్యలపై దరఖాస్తులు ఇవ్వండి అని సీఎం కేసీఆర్‌ కోరారు.


ఎమ్మెల్యే భగత్‌ నివాసంలో సీఎం భోజనం

సీఎం కేసీఆర్‌ ప్రగతి సమీక్షా సమావేశం అనంతరం నేరుగా ఎమ్మెల్యే నోముల భగత్‌ నివాసానికి వెళ్లి ముఖ్య నాయకులతో కలిసి భోజనం చేశారు. అక్కడ నాన్‌వెజ్‌ వంటకాలతో పాటు ఉలవచారు, ఉసిరికాయ పచ్చడి బాగుందని ప్రశంసించారు. సుమారు గంట సమయం కేటాయించి భగత్‌ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు భగత్‌ దంపతులు, నోముల లక్ష్మి, సంపత్‌ జ్ఞాపికను అందజేశారు.


 పటిష్ట బందోబస్తు

హాలియా ప్రగతి సమీక్షా సమావేశానికి ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ ఆధ్వర్యంలో పటిష్టబందోబస్తు నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను అరెస్టు చేసి సీఎం పర్యటన ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. సీఎం కాన్వాయ్‌ హాలియా నుంచి వెళ్లగా అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. 2100 మంది పోలీస్‌ సిబ్బంది, ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు నాన్‌క్యాడర్‌ ఎస్పీలు, 8మంది అదనపు ఎస్పీలు, 12మంది డీఎస్పీలు, 52మంది సీఐలు, 170ఎస్‌ఐలు, 1850 మంది కానిస్టేబుళ్లు హోంగార్స్‌ బందోబస్తు నిర్వహించారు.సాగర్‌కు సీఎం వరాలు ఇవే...

సాగర్‌ నియోజకవర్గానికి రూ.150కోట్లు, అందులో నందికొండ మునిసిపాలిటీకి రూ.15కోట్లు, హాలియాకు రూ.15కోట్లు, నియోజకవర్గంలో రోడ్లతోపాటు ఇతర అభివృద్ధి పనులకు మరో రూ.120కోట్లు.

సాగర్‌లో రెడ్డి కల్యాణ మండపానికి రెండున్నర ఎకరాలు, షాదీఖానా, బంజారా భవన్‌.

నందికొండ మునిసిపాలిటీలో ఇరిగేషన్‌, ప్రభుత్వ జాగలతోపాటు ఎన్నెస్పీ క్వార్టర్స్‌లో నివసించే వారికి నెలరోజుల్లో పట్టాలు.

గుర్రంపోడు లిఫ్ట్‌కు వెంటనే సర్వే.

హాలియా పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌, మినిస్టేడియం.

సాగర్‌కు డిగ్రీ కళాశాల.


రూ.60వేల కోట్లతో జిల్లాను అభివృద్ధి చేశాం

తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించిన నాయకులకు చెంపపెట్టుగా జిల్లాను రూ.60 వేల కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. హాలియాలో నిర్వహించిన ప్రగతి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకులు 60 ఏళ్లు పాలించి వెనకబాటుకు కారణ మై నీటికి బదులు విషం చిమ్మారన్నారు. ఉద్యమ నాయకుడిగా జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‌ ఫ్లోరోసి్‌సను గుర్తించి శాశ్వతంగా పారదోలారన్నారు. నల్లగొండ జిల్లా 35లక్షల టన్నుల వ్యవసాయ దిగుబడులు సాధిస్తూ భారతదేశంలో ముందంజలో ఉందన్నారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలోనే జిల్లా సస్యశ్యామలం గా మారిందన్నారు. ఇప్పటికే సీఎం 27సార్లు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేశారన్నారు.


సీఎంకు  కృతజ్ఞతలు

సాగర్‌ ఉప ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్‌ ప్రగతి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గానికి రూ.150కోట్లు నిధులు కేటాయించారని, అందుకు సీఎంకు కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. ప్రగతి సమీక్షా సమావేశం విజయవంతం చేసేందుకు కృషి చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.