టాస్క్‌‘ఫోర్స్‌’ దూకుడు

ABN , First Publish Date - 2020-10-20T06:02:17+05:30 IST

టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి, అక్రమ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిఘాను తీవ్రతరం చేసి చీకటి వ్యాపారాలకు చెక్‌ పెడుతున్నారు.

టాస్క్‌‘ఫోర్స్‌’ దూకుడు

అక్రమాలకు చెక్‌పెడుతున్న పోలీసులు

గత తొమ్మిది నెలల్లో 540 కేసుల నమోదు

రూ.5.3 కోట్ల విలువగల వస్తువుల సీజ్‌

రేషన్‌, ఇసుక, గుట్కా రవాణాపై ఉక్కుపాదం


ఖమ్మం, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి, అక్రమ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిఘాను తీవ్రతరం చేసి చీకటి వ్యాపారాలకు చెక్‌ పెడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపెట్టే వ్యక్తులను కటకటాల్లోకి పంపుతున్నారు. గుట్కా, రేషన్‌, ఇసుక, పేకాట, బెట్టింగ్‌ దందాపై ఊపిరి సలపని దాడులు నిర్వహిస్తున్నారు. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందంలోని మెరికల్లాంటి పోలీసులు పక్కా ప్రణాళికతో అక్రమాలకు అంతం పలుకుతున్నారు. అంతేకాదు జిల్లాలో సంచలనాలు రేకెత్తించిన కేసుల్లో టాస్క్‌ఫోర్స్‌దే కీలక పాత్రం కావడం విశేషం

 

తొమ్మిది నెలల్లో 540 కేసులు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్రమాలు జరుగుతున్నా గతంలో కొన్ని వెలుగులోకి రాలేదు. కాగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన తర్వాత అలాంటివాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. అందులో భాగంగా జరిగిన దాడుల్లో గ్యాంబ్లింగ్‌ నుంచి మొదలుకుని నకిలీ నోట్ల ముఠా వరకు పలు రకాల కొత్త అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా అక్రమాలు గతంలో జరుగుతూ ఉన్నా వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొద్ది గొప్ప మాత్రమే. అక్కడక్కడా చిన్న చిన్న కేసులు మాత్రమే నమోదయ్యేవి. కాగా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అన్ని శాఖలకు సంబంధించి జరుగుతున్న అక్రమాలను వెలికితీయడంతో తమదైన పాత్ర పోషించి ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 540 కేసులు నమోదుచేశారు. రూ. 5.3కోట్ల విలువ గల వస్తువులను సీజ్‌ చేశారు. దానితోపాటుగా 158 వాహనాలను, 89 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 


అత్యధిక భాగం రేషన్‌, ఇసుక, గుట్కాలదే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా సాగే అక్రమాల్లో రేషన్‌, ఇసుక, గుట్కా వ్యాపారులదే ప్రధానమైనవి. కాగా ఆయా అక్రమాలపై దృష్టిసారించిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఈ ఏడాది జరిపిన దాడుల్లో భారీగానే స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 153 గుట్కా కేసులు నమోదు చేసి 23 వాహనాలు సీజ్‌ చేసిన అధికారులు రూ. 1.37 కోట్లు విలువైన నిషేధిత గుట్కాలను పట్టుకున్నారు. గతంలో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు అందరికీ తెలిసినప్పటకీ కూడా అంతపెద్ద మొత్తంలో ఉంటుందన్న విషయంపై ఎవరూ దృష్టిసారించలేదు. అయితే దాన్ని సీరియస్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మాత్రం ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనల్లో మొత్తం 67 కేసులు నమోదు చేశారు. రూ. 1.13 కోట్ల విలువైన ఇసుకను, 13 లారీలు, 90 ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్‌ చేశారు. 900 ఇసుక డంప్‌లను కనుగొన్నారు. రూ. 23.12 లక్షల ఫైన్‌లు విధించేలా చర్యలు తీసుకున్నారు.  ఇక రేషన్‌ బియ్యం దందాలో 54 కేసులు నమోదు చేసిన అధికారులు రూ. 69.77 లక్షల విలువ గల 2791 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని, రూ. 15 వాహనాలను సీజ్‌ చేశారు. దానితోపాటుగా నకిలీ కాలం, నకిలీ విత్తనాలును కూడా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. నిషేధిత మందులు, ఎరువుల అక్రమ నిల్వలను పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి సీజ్‌ చేశారు. 

 

నమోదు చేసిన కేసులు ఇవే

ఐదుగురు సుడో మవోయిస్టులను అరెస్టు చేసి వారి నుంచి రెండు బొమ్మ తుపాకీలు, నాలుగు వాహనాలు, రూ. 3.50 లక్షల నగదును, అనధికారిక పేలుడు పదార్థాలకు సంబంధించి 520 డిటోనేటర్స్‌, 133 జిలెటిన్‌ స్టిక్స్‌, 40 కిలోల పేలుడు పౌడర్‌ను సీజ్‌ చేశారు. గంజాయిలో ఎనిమిది మందిని అరెస్టు చేసి రూ. 46 లక్షల విలువ గల 458 కిలోలను సీజ్‌ చేశారు. గ్యాంబ్లింగ్‌లో 13 కేసులు నమోదు చేసిన అధికారులు 67 మందిని అరెస్టు చేసి రూ. 3.81 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌లో పదుల సంఖ్యలో నిర్వాహాకులను, వ్యభిచార కేసుల్లో 20 మందిని అరెస్టు చేశారు. అనధికారికంగా సిగరెట్లు విక్రయిస్తున్న వారిపై 8 కేసులు నమోదు చేసి రూ. 24.44 లక్షల స్టాకును సీజ్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వెలుగులోకి తెచ్చిన వాటిల్లో అడవి పసుపు అమ్మకం ఒకటి. జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న రెండు కిలోల అడవి పసుపును పట్టుకున్నారు. 


అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..గంటా వెంకట్రావు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ, ఖమ్మం

జిల్లాలో జరిగే అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి అరెస్టులు చేయడంతోపాటు వారికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్టు తెలిస్తే మాకు సమాచారం అందించండి. 

Updated Date - 2020-10-20T06:02:17+05:30 IST