అక్రమార్కులపై టాస్క్‌ఫోర్స్‌

ABN , First Publish Date - 2020-11-20T00:19:26+05:30 IST

రెకమండేషన్లు పనిచేయవు..ఫిర్యాదు ఎవరి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా బయటికి పొక్కదు.. అయితే ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందం మాత్రం తనంతట తాను పనిచేసుకుంటూపోతుంది. అక్రమార్కులను వెంటాడుతోంది.

అక్రమార్కులపై టాస్క్‌ఫోర్స్‌
తాండూరు ఎన్టీఆర్‌.కాలనీ రహస్య ప్రదేశంలో తయారు చేస్తున్న కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టును పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం(ఫైల్‌)

డీజీపీ ఆదేశాలతో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు

కర్ణాటకను ఆనుకుని ఉన్న తాండూరుపైనే ఫోకస్‌ 

20 రోజుల్లో 20 కేసుల నమోదు


రెకమండేషన్లు పనిచేయవు..ఫిర్యాదు ఎవరి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా బయటికి పొక్కదు.. అయితే ఈ టాస్క్‌ఫోర్స్‌ బృందం మాత్రం తనంతట తాను పనిచేసుకుంటూపోతుంది. అక్రమార్కులను  వెంటాడుతోంది. అంతగోప్యంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌ కొత్త తరహాలో, గతానికి భిన్నంగా ఏర్పాటు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఎస్పీ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. 


తాండూరు :  టాస్క్‌ఫోర్స్‌....అక్రమాలకు అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా ఈ బృందం చురుకుగా పనిచేస్తోంది. నిత్యం టాస్క్‌ఫోర్స్‌ బృందం వికారాబాద్‌ జిల్లాలో ఎక్కడో ఒక చోట దాడులు నిర్వహిస్తూనే ఉంది. అక్రమార్కులతో చేతులు కలిపే పోలీసు అధికారుల బాగోతాలను కూడా ఈ బృందం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కర్ణాటకకు ఆనుకుని ఉన్న తాండూరు ప్రాంతంపైనే టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఎక్కువ కేసులు కూడా ఇక్కడే నమోదయ్యాయి. 


 బృందం ఇలా..

జిల్లా స్థాయిలో అక్టోబర్‌ 28న సీఐ వెంకటగిరి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని జిల్లా ఎస్పీ నారాయణ ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లను నియమించారు. జిల్లా వ్యాప్తంగా వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ సర్కిళ్లలో అక్రమాలపై సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులకు కూడా తెలియకుండా గోప్యంగా ఈ బృందం వెళ్లి దాడులు నిర్వహిస్తోంది. దాడుల అనంతరం కేసుల నమోదు బాధ్యతను స్థానిక పోలీసులకు అప్పగిస్తోంది.


20 రోజుల్లోనే 20 కేసులు

టాస్క్‌ఫోర్స్‌ బృందం అక్రమాలపై సీరియస్‌గా వర్క్‌ చేస్తుంది. ఏర్పడిన 20 రోజుల్లోనే 20 కేసులు నమోదయ్యాయి. అందులో వ్యాపార, వాణిజ్య కేంద్రమైన తాండూరులోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్‌ దాడులతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది.  


టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో కొన్ని ఇలా

  • తాండూరులో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడిన మొదటి రోజునే ఇసుక అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి ట్రాక్టర్లను సీజ్‌ చేయించి సంబంఽధం ఉన్న సర్పంచ్‌పై కేసు నమోదైంది. 
  • తాండూరు శివారులోని ఎన్టీఆర్‌.కాలనీ వద్ద కల్తీ, అల్లం, ఉల్లిపాయ పేస్ట్‌ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి నాలుగు క్వింటాళ్ల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకుని రూ.2లక్షల విలువైన సరుకుతోపాటు ఆటోను సీజ్‌ చేశారు.  కల్తీ ఆహార పదార్థాల తయారీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయించారు. ఇది రికార్డుగా పేర్కొనవచ్చు.
  • పెద్దేముల్‌, కొడంగల్‌, వికారాబాద్‌ ప్రాంతాల్లో వేర్వేరుగా దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ(పీడీఎస్‌) బియ్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేయించారు.
  • కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కాను తాండూరులో పట్టుకున్నారు. 
  • దీపావళి పండుగ సందర్భంగా తాండూరులో గంజ్‌, పటేల్‌ గార్డెన్‌లో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి రూ.96వేల 500 నగదు, 16సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో పోలీసు స్టేషన్‌లోనే జరిమానా విధించి పేకాట రాయుళ్లను పంపేవారు. టాస్క్‌ఫోర్స్‌ కేసుతో పేకాట రాయుళ్లను నేరుగా రిమాండ్‌ చేశారు. తాజాగా బుధవారం రాత్రి తాండూరు సిండికేట్‌ కార్యాలయంలో పేకాట ఆడుతున్న సిబ్బందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. తాండూరులో అక్రమంగా రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని వదిలేయగా, వెంటనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఆ ట్రాక్టర్లను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. 

రెకమండేషన్లు ఉండవు.....

అక్రమార్కులను వదిలేది లేదు. రెకమండేషన్లు పనిచేయవు. టాస్క్‌ఫోర్స్‌ టీం సమాచారం అందిన వెంటనే రంగంలో దిగుతుంది. ముఖ్యంగా అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. దాడుల తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం అందించి కేసులు నమోదు చేయిస్తాం. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈ టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తోంది. 

-వెంకటగిరి, సీఐ, టాస్క్‌ఫోర్స్‌, వికారాబాద్‌ జిల్లా



Updated Date - 2020-11-20T00:19:26+05:30 IST