Abn logo
Jun 11 2021 @ 04:09AM

పొత్తు ఉండదు.. ఫైటింగే

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టండి..

సర్కారు వైఫల్యాలపై ఉద్యమాలు చేయండి.. 

బీజేపీ నేతలకు తరుణ్‌ ఛుగ్‌ నిర్దేశం

టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండబోదని స్పష్టం

హుజూరాబాద్‌ పోరుకు సిద్ధమవ్వాలని పిలుపు

త్వరలో కమలం గూటికి కీలక నేతలు

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

14న కాషాయ కండువా వేసుకోనున్న ఈటల


హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్‌ పార్టీ నేతలకు నిర్దేశించారు. ఒకవైపు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడారు. రైతులు, నిరుద్యోగుల సమస్య తదితర అంశాల్లో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో గుర్తించాలని అన్నారు. జిల్లా, మండల, బూత్‌ స్థాయి కమిటీలు.. పన్నా ప్రముఖ్‌ కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం, సంస్థాగతంగా కమిటీల నియామకం రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వీటిని ఆధారంగా చేసుకుని 2023 ఎన్నికలను రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటి కాదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీఆర్‌ఎ్‌సతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సమాయత్తం కావాలని నేతలకు పిలుపునిచ్చారు. త్వరలోనే కొంత మంది కీలక నేతలు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్‌ వెల్లడించారు.


కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఆయ న్ను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరినీ టార్గెట్‌ చేస్తున్నారన్నారు. నిన్నటిదాకా కేబినెట్‌లో కీలక మంత్రిగా పనిచేసిన ఈటలకు భద్రత లేని పరిస్థితులు సృష్టించారని అన్నారు. డబ్బా కొడితే మంచోళ్లు, లేకుంటే అవినీతిపరులుగా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు ఉండబోదని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తేల్చిచెప్పారు. ఆ ప్రచారం కేసీఆర్‌ సృష్టే అని స్పష్టం చేశారు. తమ తదుపరి లక్ష్యం హుజూరాబాద్‌ ఉప ఎన్నికే అని చెప్పారు. గురువారం ఆమె ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఈటలకు సరితూగే వ్యక్తి టీఆర్‌ఎ్‌సలో లేరని అన్నారు.

ప్రభుత్వ భూముల అమ్మకంపై బీజేపీ కమిటీ

ప్రభుత్వ భూములు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై సమీక్షించేందుకు పార్టీ తరఫున బండి సంజయ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. మేధావులు, రెవెన్యూ, ఆర్థిక రంగ నిపుణులు ఈ కమిటీలో ఉంటారని సంజయ్‌ తెలిపారు. 


14న బీజేపీలోకి ఈటల 

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో 14న చేరతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా వేసుకోనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మరికొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా బీజేపీలో చేరతారని సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా చార్టర్డ్‌ విమానాన్ని సిద్ధం చేశారని ఈటల సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, తరుణ్‌ఛుగ్‌ శుక్రవారం ఈటల నివాసానికి వెళ్లనున్నారు. బండి సంజయ్‌ గన్‌మన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయం తెలియగానే ఆయన పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశం నుంచి వెళ్లిపోయారు. కాగా, హుజూరాబాద్‌ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి సంజయ్‌ ఒక నివేదికను తరుణ్‌ఛుగ్‌కు అందించినట్లు తెలిసింది.