తర్జన భర్జన

ABN , First Publish Date - 2022-08-06T07:00:31+05:30 IST

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు వీఆర్‌ఎస్‌ (వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌)పై తర్జన భర్జన పడుతున్నారు. ఉద్యోగులను తగ్గించుకుందామనే ఆలోచనలో భాగంగా సంస్థ వీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. ఆసక్తిగలవారు జూలై 31వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తర్జన భర్జన

ఆర్టీసీలో వీఆర్‌ఎస్‌కు స్పందన కరువు

43 మంది మాత్రమే దరఖాస్తు

బెనిఫిట్స్‌ ఆశాజనకంగా లేవని ఉద్యోగులు, కార్మికుల విముఖత

సుభాష్‌నగర్‌, ఆగస్టు 5: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు వీఆర్‌ఎస్‌ (వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌)పై తర్జన భర్జన పడుతున్నారు. ఉద్యోగులను తగ్గించుకుందామనే ఆలోచనలో భాగంగా సంస్థ వీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. ఆసక్తిగలవారు జూలై 31వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిజామాబాద్‌ రీజియన్‌ వ్యాప్తంగా వీఆర్‌ఎస్‌పై కార్మికులు, ఉద్యోగులు ఆసక్తి చూపడంలేదు. కేవలం 43మంది ఉద్యోగులు మాత్రమే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. నిజామాబాద్‌ రీజియన్‌ వ్యాప్తంగా నిజామాబాద్‌-1, నిజామాబాద్‌ -2, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆరు డిపోలు ఉన్నాయి. వీటిలో సుమారు 2800 పైగా కార్మికులు పని చేస్తున్నారు. వీరు తమ హక్కుల కొసం 102రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరవధికంగా సమ్మె చేపట్టారు. దీంతో సీఎం కేసీఆర్‌ యూనియన్లను తొలగించి వెల్పేర్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. సాధారణ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు సైతం పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెంచారు. అయితే చాల మంది డ్రైవర్లకు ఉద్యోగం చేయడం ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు సంస్థలో వెట్టిచాకిరి పెరిగిందని ఓటీల పేరుతో వేధిస్తున్నారని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం, ఆర్టీసీ కూడా వీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండడంతో కొంత కాలంగా వీఆర్‌ఎస్‌కు సంబంధించిన జీవోను విడుదల చేశారు. వీఆర్‌ఎస్‌కు సంబంధించిన జీవో కార్మికులకు ఏ మాత్రం సరిపోదని చాల మంది కార్మికులు వీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి విముఖ చూపుతున్నట్లు సమాచారం. ఐదేళ్లు సర్వీస్‌ ఉన్న ఉద్యోగికి సుమారు రూ.5నుంచి 6లక్షల వరకు మాత్రమే బెనిఫిట్స్‌ వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. పింఛన్‌ సౌకర్యం కూడా లేకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్‌ సదుపాయం లేక పోవడం రూ.25వేలు చెల్లిస్తేనే మెడికల్‌ సదుపాయం కల్పించడం వంటి నిర్ణయాల పట్ల కార్మికులు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిసింది. నాలుగేళ్లకు రావలసిన పీఆర్‌సీలు సైతం రెండు పీఆర్‌సీల ప్రస్తావన ఈ వీఆర్‌సీలో లేకపోవడంతో కార్మికులు వీఆర్‌ఎస్‌కు విముఖత చూపుతున్నారు. ఆరు డీఏలు సైతం వీటిలో ప్రస్తావించలేదని కార్మికులు వాపోతున్నారు.

43 మంది మాత్రమే దరఖాస్తు

నిజామాబాద్‌ రీజియన్‌ వ్యాప్తంగా కేవలం 43మంది మాత్రమే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కూడా కొందరు అనారోగ్య రీత్యా వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. రీజియన్‌ వ్యాప్తంగా సుమారు 2800 పైగా ఉద్యోగులకు కేవలం 43మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తులు చేసుకోవడం పట్ల వీఆర్‌ఎస్‌పై ఎంత అనాసక్తి ఉందో కార్మికుల్లో చర్చ జరుగుతోంది. అయితే కార్మికులకు సంస్థ మరికొన్ని వరాలు ప్రకటిస్తే వీఆర్‌ ఎస్‌పై ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వీఆర్‌ఎస్‌పై ఉద్యోగుల్లో ఆసక్తి కరువు

ఫ సాయిలు, ఆర్టీసీ కార్మికుడు

ఉద్యోగులకు అవసరమైన బెనిఫిట్స్‌ లేకపోవడం వల్లే వీఆర్‌ఎస్‌పై అనాసక్తి నెలకొంది. పెన్షన్‌ ఆరోగ్య విషయంలో వీఆర్‌ఎస్‌ల స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేరు. దీంతో పాటు ఎస్‌ఆర్‌బీఎస్‌ పెన్షన్‌, పీఆర్‌సీల, డీఎఏలపై స్పష్టత లేకపోవడంతో వీఆర్‌ఎస్‌ తీసుకోవడంలో ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారు. 

Updated Date - 2022-08-06T07:00:31+05:30 IST