చైనాపై సుంకాల సమరం

ABN , First Publish Date - 2020-06-09T06:01:40+05:30 IST

ఇదీ ఇప్పుడు మన ముందున్న ప్రశ్న: మన ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నది. మన వృద్ధిరేటు పడిపోతున్నది. మన మూల ధనం విదేశాలకు వెళ్ళిపోతున్నది. మన పరిశ్రమలు మూతపడుతున్నాయి...

చైనాపై సుంకాల సమరం

ఇదీ ఇప్పుడు మన ముందున్న ప్రశ్న: మన ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నది. మన వృద్ధిరేటు పడిపోతున్నది. మన మూల ధనం విదేశాలకు వెళ్ళిపోతున్నది. మన పరిశ్రమలు మూతపడుతున్నాయి. మన యువజనులు నిరుద్యోగ శ్రేణుల్లో చేరుతున్నారు. మరి దిగుమతి సుంకాలను మనం ఎందుకు పెంచడం లేదు? సుంకాలను పెంచకుండా చైనా నుంచి దిగుమతి అవుతున్న సరుకులను కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పాలకులను ఏమనుకోవాలి?


చైనీస్ సరుకులను బహిష్కరించాలని దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అదే సమయంలో చైనా నుంచి దిగుమతులను అనుమతిస్తోంది! ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) సభ్య దేశంగా సగటున 48.5 శాతానికి మించి దిగుమతి సుంకాన్ని విధించకుండా వుండేందుకు మన దేశం నిబద్ధమయింది. వాస్తవంగా మనం ఇప్పుడు విధిస్తున్న దిగుమతి సుంకం కేవలం 13.8 శాతమే! డబ్ల్యుటిఓ నిబంధనల పరిధిలోనే మూడు రెట్లు అధికంగా దిగుమతి సుంకాలు విధించే వెసులుబాటు మనకు ఉన్నది. అయితే మనం అలా చేయడం లేదు. ఎందుకని? దేశ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే మధ్య తరగతి ఓటర్లకు చౌక సరుకులు అందుబాటులో ఉంచా లనే కాదూ? మరి దేశ ఆర్థిక వ్యవస్థ ఏమయ్యేట్టు?


ఒక వేళ చైనాకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకున్నా అది మన ప్రయోజనాలను మనకు మనమే దెబ్బ తీసుకునేదే అవుతుంది. అవే చైనీస్ సరుకులు వేరే దేశాల ద్వారా మన దేశంలోకి దిగుమతి అవుతాయి మరి. చైనా నుంచి దిగుమతులను నిరోధించడానికి ఏకైక మార్గం అన్ని దిగుమతులపైన సుంకాలను మరింత అధికంగా విధించడమే. అంతకన్నా అగత్యం లేదు. ఈ వ్యవహారం విదేశీ మదుపులతో ముడి వడి వున్నది. ఎందుకంటే వాణిజ్యం, మదుపులు అనేవి ప్రపంచీకరణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. 2019--–-20 ఆర్థిక సంవత్సరంలో మనకు 4900కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) వచ్చినట్టు అధికారిక సమాచారం.


ఇందులో అధిక భాగం మన మూల ధనమే! మనవారే ఆ ధనాన్ని విదేశాలకు పంపి, ఎఫ్డిఐ రూపేణా మళ్ళీ వెనక్కు తీసుకు వచ్చారు. మన మూలధనం విదేశాలకు తరలిపోతున్న రెండో మార్గం బహుళజాతి సంస్థల ‘మళ్ళింపు ధర’ విధానం (ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్-: ఒక సంస్థలోని ఒక విభాగం మరొక విభాగానికి తన వస్తుసేవలను బదిలీ చేసేటప్పుడు నిర్ణయించే ధర. ఈ ధర సంస్థ విధానంపై ఆధారపడి వుంటుంది. అది మార్కెట్ ధర కావచ్చు లేదా ఉపాంత వ్యయం కావచ్చు లేదా పూర్తి వ్యయమైనా కావచ్చు). లండన్ లోని ఒక బహుళజాతి సంస్థ విభాగం తన సరుకులను ముంబైలోని తమ సంస్థ విభాగానికి విక్రయించిందనుకోండి. ఆ సరుకు మార్కెట్ ధర రూ.10 అయినప్పటికీ ముంబై విభాగం రూ.12 చొప్పున లండన్ విభాగానికి చెల్లిస్తుంది. ఈ విధంగా రూ.2 ‘చట్టబద్ధంగా’ భారత్ నుంచి బ్రిటన్‌కు బదిలీఅవుతున్నది. ఈ మార్గం లో భారత్ నుంచి ఏటా 9.8 బిలియన్ డాలర్ల ధనం విదేశాలకు బదిలీ అవుతున్నట్టు ‘గ్లోబల్ పైనాన్షియల్ ఇంటెగ్రిటీ’ అనే అంతర్జాతీయ సంస్థ అంచనా. 


మన మూల ధనం విదేశాలకు వెళ్ళి పోతున్న మూడో మార్గం మన సొంత ఎఫ్‌డిఐ. విదేశాలలో మదుపు చేసేలా మన పారిశ్రామికవేత్తలను మన ప్రభుత్వం అనుమతించడమేకాదు, ప్రోత్సహిస్తోంది కూడా. 2019–-20 ఆర్థిక సంవత్సరంలో 11.3 బిలియన్ డాలర్ల విలువైన మన మూలధనం ఎఫ్‌డిఐ రూపేణా విదేశాలకు వెళ్ళిపోయింది. ఇలా బయటకు వెళ్ళిపోతున్న మన ధనాన్ని పరిగణనలోకి తీసుకుంటే మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వాస్తవంగా చాలా తక్కువగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేట్లు తక్కువగా ఉండడమే గాక ఏటి కేడాది పతనమవుతున్నాయి. ఇదీ ఇప్పుడు మన ముందున్న ప్రశ్న: మన ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నది. మన వృద్ధిరేటు పడిపోతున్నది. మన మూల ధనం విదేశాలకు వెళ్ళిపోతున్నది. మన పరిశ్రమలు మూతపడుతున్నాయి. మన యువజనులు నిరుద్యోగ శ్రేణుల్లో చేరుతున్నారు. మరి దిగుమతి సుంకాలను మనం ఎందుకు పెంచడం లేదు? 1991కి పూర్వంలా మన మూల ధనం విదేశాలకు తరలిపోకుండా ఎందుకు నిరోధించడం లేదు?


ఇందుకు రెండు కారణాలు ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. మొదటి కారణం- పెట్టుబడులు ఒక చోట నుంచి మరో చోటకి నిర్నిబంధంగా వెళ్ళిపోగలగాలని మన పారిశ్రామికవేత్తలు ప్రగాఢంగా కోరుకొంటున్నారు. అటువంటి స్వేచ్ఛతోనే మన టాటాలు జాగ్వార్ కంపెనీని, మిట్టల్‌లు ఆర్సెలర్ కంపెనీలని స్వాయత్తం చేసుకోగలిగారు. ఈ వ్యాపార వేత్తలు ప్రభుత్వ నిర్ణయాలను విశేషంగా ప్రభావితం చేయగలరు. మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయనే తప్పుడు వార్తలను బలంగా ప్రచారంలో పెడుతున్నది కూడా ఈ ధనాఢ్యులే. మన దేశం నుంచి మన సొంత పెట్టుబడులు పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్ళిపోతున్నాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకే వారు సదరు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారు. రెండో కారణం మన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగ విరమణ అనంతరం బహుళజాతి సంస్థలలో ఉద్యోగాలను ఆశిస్తున్నారు. తమ సంతానానికి సైతం అటువంటి ఉద్యోగాలను ఇప్పించుకోవడానికై ఆ సంస్థలకు అనుకూల నిర్ణయాలు తీసుకొంటున్నారు. విద్యుత్ శాఖ మాజీ కార్యదర్శి ఒకరు తాను ఇప్పుడు గంటకు రూ.40వేల ఫీజులో ప్రపంచ బ్యాంకుకు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నానని సగర్వంగా చెప్పుకుంటున్నాడు! తమ భావి ప్రయోజనాల కోసమే వారు దేశ ప్రయోజనాలను విస్మరిస్తున్నారు. బహుళజాతి సంస్థలకు లబ్ధినిచ్చే విధానాలను అనుమతిస్తున్నారు.

 

మన ఆర్థిక వ్యవస్థను చౌక దిగుమతులకు తెరవాలని, మన మూలధనం విదేశాలకు స్వేచ్ఛగా వెళ్ళేందుకు అనుమతించాలని ప్రభుత్వం గంభీరంగా చెబుతోంది. మరి ఇదే ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయిన సరుకులను కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది! ఇది ద్వంద్వ నీతి కాదా? ఒక పక్క దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తూ మరో పక్క దాన్ని పటిష్ఠపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పాలకులను ఏమనుకోవాలి? 


చైనీస్ దిగుమతుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే భిన్న ఆర్థిక విధానాలను అనుసరించి తీరాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో తెగతెంపులు చేసుకోనిదే చైనా బారి నుంచి మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం సాధ్యం కాదు. అయితే మన వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు స్వార్థ ప్రయోజనాలే ప్రధానం గనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరుపడడం అసాధ్యం. కనుక రాబోయే కాలంలో చైనీస్ దిగుమతుల వెల్లువ మన ఆర్థిక వ్యవస్థకు ఊపిరి సలపనివ్వని విధంగా ఉంటుందనడంలో సందేహం లేదు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త,బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)


Updated Date - 2020-06-09T06:01:40+05:30 IST