ఆదా..రా.. బాదరా..

ABN , First Publish Date - 2022-05-10T06:41:17+05:30 IST

ఆదా..రా.. బాదరా..

ఆదా..రా.. బాదరా..

ఆదా పేరు చెప్పి డ్రైవర్లకు ఆర్టీసీ అధికారుల టార్గెట్లు

కేఎంపీఎల్‌ తగ్గడానికి వీల్లేదని హుకుం

తగ్గితే డ్రైవర్లను పిలిచి కౌన్సెలింగ్‌, వార్నింగ్‌

డొక్కు బస్సులతో సాధ్యం కాదంటున్న డ్రైవర్లు


ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో ఇంధన వ్యయం తగ్గించటం కోసం కిలోమీటర్స్‌ పర్‌ లీటర్‌ (కేఎంపీఎల్‌) పేరుతో ఆర్టీసీ డ్రైవర్లపై అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆపరేషన్‌ కేఎంపీఎల్‌ పేరుతో లీటర్‌ డీజిల్‌ ఐదు కిలోమీటర్లు రావాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పెరిగితే డిపోలవారీగా డ్రైవర్లను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తూ బెదిరిస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రెండు ఆర్టీసీ రీజియన్లలో కొద్దిరోజుల కిందట ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా అత్యధిక కిలోమీటర్స్‌ పర్‌ లీటర్‌ (కేఎంపీఎల్‌) తెచ్చిన డ్రైవర్లకు నగదు బహుమతులు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. కేఎంపీఎల్‌ తక్కువ రావటం వల్ల సంస్థ నష్టపోతోందన్న వాదనను తెరపైకి తెచ్చారు. ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు సర్వీసులు మార్చటం, ఇప్పుడున్న షెడ్యూళ్లను సమీక్షించుకుని ఆదరణ పెంచుకోవటానికి అనుసరించాల్సిన మార్గాలను అన్వేషించటం, కొత్త రూట్లను గుర్తించి బస్సులు నడపటం వంటివి ఆర్టీసీకి ఆదాయాన్ని తెస్తాయి. ఇలాంటి పనులు చేయకుండా ఆర్టీసీ అధికారులు కేఎంపీఎల్‌పైనే దృష్టి పెడుతున్నారు. లీటర్‌ డీజిల్‌ను ఐదు కిలోమీటర్లు తగ్గకుండా వాడాలని టార్గెట్లు నిర్ణయిస్తున్నారు. దీంతో కొంతమంది డ్రైవర్లు ఐదు కిలోమీటర్లు, 5.10 కిలోమీటర్లు కూడా తీసుకొస్తున్నారు. ఒకటి, అర కిలోమీటర్ల తేడాను కూడా అధికారులు ఉపేక్షించట్లేదు.  

డొక్కు బస్సులతో ఎలా?

రెండు రీజియన్లలో 70 శాతం బస్సులు డొక్కువే. కొత్త వాహనాల మాదిరిగా వీటికి కూడా కేఎంపీఎల్‌ రావాలంటే అసాధ్యం. కొత్త బస్సుల్లోనే కేఎంపీఎల్‌ 5.20-5.30 వస్తుంటే డొక్కు బస్సులు, కాలం తీరిన బస్సుల పరిస్థితి ఏమిటో అధికారులే అర్థం చేసుకోవాలి. రెండు రీజియన్లలో ఆర్టీసీకి 1,300 బస్సులు ఉన్నాయి. వీటి మెయింటినెన్స్‌ రోజూ చూడాలి. గ్యారేజీల్లో ఓవర్‌ హాలింగ్‌ చేయాలి. లోపాలుంటే సరిచేయాలి. బస్సుల మెయింటినెన్స్‌ లేకపోతే ఆ బస్సు ఎలా కేఎంపీఎల్‌ తెస్తుందో అధికారులకే తెలియాలి.

ట్రాఫిక్‌ సంగతేంటి?

విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువ. ఉదయం, సాయంత్రం వేళల్లో పతాక స్థాయిలో ఉంటుంది. ట్రాఫిక్‌లో ఎక్కువసేపు ఉండటం వల్ల ఆయిల్‌ ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేఎంపీఎల్‌ ఎలా సాధ్యమవుతుంది. ఇదే సందర్భంలో డ్రైవర్లకు సౌకర్యాలు కూడా అరకొరగానే కల్పిస్తున్నారు. 

Read more