Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 30 Jun 2022 04:37:20 IST

టార్గెట్‌ తెలంగాణ!

twitter-iconwatsapp-iconfb-icon
టార్గెట్‌ తెలంగాణ!

రేపటి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు

రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ, షా రాక

3న సాయంత్రం పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగ సభ

అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం సమరశంఖం పూరించబోతోంది. మరో ఏడాదిన్నర వ్యవధిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించడం, టీఆర్‌ఎస్‌ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా తెలంగాణను బీజేపీ ఎంపిక చేసుకుంది. ఇందుకోసం హైదరాబాద్‌ వేదికగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపు కాబోతున్నాయన్న ధీమాతో కమలనాథులు ఉన్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయికి దూసుకుపోవాలని భావిస్తున్నారు. అధికార టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఓటువేసే వారికి తక్షణ ప్రత్యామ్నాయంగా తామే గుర్తుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో తాము అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీ ప్రభుత్వ విజయాలను తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఐదేళ్ల తర్వాత దేశ రాజధాని వెలుపల, అందునా ప్రత్యక్ష పద్ధతిలో జరగబోతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఇటు తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నామన్న వాతావరణం కల్పించడంతోపాటు అటు పార్టీ క్యాడర్‌కు నూతనోత్సాహాన్నిచ్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు.

అసెంబ్లీ సెగ్మెంట్లకు జాతీయ నేతలు.. 

ఏ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ లేనివిధంగా ఈసారి కేంద్రమంత్రులు, జాతీయ నేతలతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యులు రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సమావేశాలకు రెండు రోజుల ముందుగానే వారంతా నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ వివిధ వర్గాలకు అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై ప్రచారం చేయడంతోపాటు స్థానికంగా వివిధ సామాజికవర్గాలతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ఆత్మవిశ్వాసాన్ని పార్టీ క్యాడర్‌లో పెంచేందుకు నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1న హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 360 మంది జాతీయ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. సమావేశాల సందర్భంగా రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సమావేశాల కోసం జేపీ నడ్డా 1వ తేదీనే హైదరాబాద్‌ చేరుకోనుండగా, మోదీ, అమిత్‌షా 2న రానున్నారని పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జూలై 3న సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగసభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

18 ఏళ్ల తర్వాత మళ్లీ..

జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ 18 ఏళ్ల తర్వాత మళ్లీ వేదిక అవుతోంది. 2004 జనవరిలో ఉమ్మడి ఏపీలో వైస్రాయ్‌ హోటల్‌ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అప్పుడు కూడా పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించగా, అప్పటి ప్రధాని, దివంగత నేత అటల్‌ బిహారీ వాజపేయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఇతర రాష్ట్రాల ప్రజలతో భేటీలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణలో నివాసం ఉంటున్న వివిధ రాష్ట్రాల కమ్యూనిటీలతో ఆ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. హరియాణాకు చెందిన వారితో ఆ రాష్ట్ర సీఎం ఖట్టర్‌, తమిళ కమ్యూనిటీ సమావేశానికి నటి ఖుష్బూ, అన్నామలై, మురుగన్‌ హాజరవుతారు. గుజరాతీల సమావేశానికి ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌, విజయ్‌ రూపానీ, మధ్యప్రదేశ్‌ వారితో భేటీకి సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరు కానున్నారు. వీరితోపాటు రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, ఇతర ఈశాన్య రాష్ర్టాల సీఎంలు ఆయా రాష్ట్రాల ప్రజలతో సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.