New Year వేడుకలే Targetగా భారీ స్థాయిలో డ్రగ్స్‌ సరఫరాకు స్మగ్లర్లు సన్నాహాలు..

ABN , First Publish Date - 2021-11-11T14:54:50+05:30 IST

న్యూ ఇయర్‌ వేడుకలే టార్గెట్‌గా భారీ స్థాయిలో డ్రగ్స్‌ సరఫరాకు స్మగ్లర్లు సన్నాహాలు...

New Year వేడుకలే Targetగా భారీ స్థాయిలో డ్రగ్స్‌ సరఫరాకు స్మగ్లర్లు సన్నాహాలు..

  • భాగ్యనగర శివారు ప్రాంతాలపై.. ఎన్డీపీఎస్‌ ఫోకస్‌
  • డ్రగ్స్‌ తయారీ, సరఫరాను.. అరికట్టేందుకు కార్యాచరణ
  • ఇప్పటికే పలువురి అరెస్ట్‌
  • మాదక ద్రవ్యాల సరఫరాకు స్మగ్లర్ల సన్నాహాలు

న్యూ ఇయర్‌ వేడుకలే టార్గెట్‌గా భారీ స్థాయిలో డ్రగ్స్‌ సరఫరాకు స్మగ్లర్లు సన్నాహాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నయా జోష్‌లో యువతను ఉర్రూతలు ఊగించడానికి ఇప్పటి నుంచే మాదక ద్రవ్యాల దిగుమతి, తయారీ, సరఫరాకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో స్మగ్లర్‌ల ఆట కట్టించేందుకు  పోలీసులు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి స్మగ్లర్స్‌ గంజాయి, డ్రగ్స్‌ వంటివి నగరంలోకి తీసుకురాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు నగరంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ : డ్రగ్స్‌ దందాను కట్టడి చేసేందుకు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేకంగా ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ సైకోట్రాఫిక్‌ సబ్‌స్టాన్సిస్‌) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. డీసీపీ క్రైమ్స్‌ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రత్యేక ఎన్డీపీఎస్‌ పోలీస్‌ టీమ్‌ ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు విస్తృతంగా దాడులు చేస్తూ. స్మగ్లర్‌ల ఆటకట్టిస్తున్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే సైబరాబాద్‌లో 79 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. 54 ఎన్డీపీఎస్‌ కేసులు నమోదు చేశారు. 404 ‘ఈ పెట్టి’ కేసులు నమోదు చేశారు.


మాదక ద్రవ్యాల ఫార్ములా తెలిసిన కెమిస్ట్‌లు, డ్రగ్గిస్టులు, ఫార్మాసిస్టులతో స్మగ్లర్స్‌ ఈ మాదక ద్రవ్యాలను తయారు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. నగరంలోని పలు పబ్‌లు, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే రేవ్‌పార్టీల నిర్వాహకులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లోని మూతబడిన పరిశ్రమలు, కంపెనీలు, గోదాములపై పోలీసులు నజర్‌ పెంచారు. పాత అనుభవాలను, గంజాయి, డ్రగ్స్‌ హాట్‌ స్పాట్‌లను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక ఎన్డీపీఎస్‌ టీమ్‌ 2022 న్యూఇయర్‌ వేడుకల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తోంది. గంజాయి, డ్రగ్స్‌ స్మగ్లర్స్‌ ఆటకట్టించడానికి ఎన్డీపీఎస్‌ ప్రత్యేక టీమ్‌తో పాటు.. మాదాపూర్‌, శంషాబాద్‌, బాలానగర్‌ జోన్‌లలో ఎస్‌వోటీ టీమ్‌లు సైతం రంగంలోకి దిగాయి.


నేరస్థులపై ‘పీడీ’కిలి..

గంజాయి, డ్రగ్స్‌, ఇతర మాదక ద్రవ్యాలు ఏవైనా తయారు చేసినా, స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ నిందితులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. నేరస్థులను కటకటాల్లోకి నెట్టిన వెంటనే వారిపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని డీసీపీ, ఏసీపీలను సీపీ ఆదేశించారు. ఇప్పటికే 8 మంది స్మగ్లర్‌లపై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పీడీయాక్ట్‌ నమోదు చేశారు.


కట్టడికి చర్యలు..

కొంతమంది స్మగ్లర్‌లు ఎఫిడ్రిన్‌, మెఫిడ్రిన్‌, అల్ర్పాజోలం వంటి కొన్ని రకాల మాదక ద్రవ్యాలను నగర శివారు ప్రాంతాల్లో తయారు చేస్తున్నట్లు గతంలో  వెలుగులోకి వచ్చాయి. ముంబై నుంచి నగరానికి వచ్చిన పోలీసులతో పాటు.. డీఆర్‌ఐ అధికారులు దాడులు చేసి కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అఽధికారులు కూకట్‌పల్లి, బాలానగర్‌ పరిధిలో రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రిన్‌ మాదక ద్రవ్యాలను పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2021-11-11T14:54:50+05:30 IST