మళ్లీ టార్గెట్‌ కీవ్‌!

ABN , First Publish Date - 2022-04-16T08:31:40+05:30 IST

ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తామంటూ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మళ్లీ టార్గెట్‌ కీవ్‌!

క్షిపణి దాడులు ఇక ఉధృతం


లక్ష్యంగా చేసుకుంటామని రష్యా ప్రకటన

ఇది మూడో ప్రపంచ యుద్ధమే..!

రష్యా అధికారిక వార్తా చానల్‌ ప్రకటన

కీవ్‌ పరిసరాల్లో.. మొత్తం 900 మృతదేహాలు


కీవ్‌/మాస్కో/తైపీ, ఏప్రిల్‌ 15: ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తామంటూ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నల్ల సముద్రంలోని రష్యా యుద్ధ నౌక మాస్క్వా విధ్వంసం ఉదంతం తర్వాత కీవ్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నట్లు ప్రకటన రావడం గమనార్హం. నిజానికి గత నెలాఖరులో జరిగిన చర్చల్లో భాగంగా కీవ్‌, చెర్నిహీవ్‌ నుంచి సేనలను ఉపసంహరించుకుంటామని రష్యా వాగ్దానం చేసింది. ఆ మేరకు క్రమంగా భారీ కాన్వాయ్‌ని ఉక్రెయిన్‌ ఉత్తరానికి తరలించింది. ఆ తర్వాత దురాక్రమణను దక్షిణ, తూర్పు ప్రాంతాలకే పరిమితం చేసింది. మాస్క్వా ఘటన తర్వాత.. తాజాగా శుక్రవారం క్యాలిబర్‌ మి సైల్స్‌తో.. కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తామంటూ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రి యాన్స్క్‌ రీజియన్‌లోని తమ భూభాగంపై ఉక్రెయిన్‌ దాడి చేసిందని పేర్కొంది. దీనికి ప్రతీకారం తప్పదని స్పష్టం చేసిం ది. అన్నట్లుగానే శుక్రవారం నల్ల సముద్రం నుంచి కీవ్‌ శివార్లలోని ఓ రక్షణ పరిశ్రమపై క్షిపణులతో దాడిచేసింది. ఈ పరిశ్రమలో యాంటీ-ట్యాంక్‌, యాంటీ-షిప్‌ క్షిపణులు తయారవుతా యి. ఈ ఘటనలో భారీగానే ఆయుధ నష్టం సంభవించినట్లు రష్యా వెల్లడించింది. తమ దేశంపై ఉగ్రదాడులు/ప్రత్యక్ష దా డులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. కాగా.. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్నది మూడో ప్రపంచయుద్ధమేనంటూ రష్యా అధికారిక వార్తా చానల్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘రష్యా-1’ చానల్‌ యాంకర్‌ ఓల్గా స్కాబెయెవా ఓ చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పాశ్చాత్య, నాటో దేశాల అండతో ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందుతున్నాయి. రష్యా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇక మేం(రష్యా) నాటోపై నేరుగా యుద్ధం చేయకున్నా.. ఆ కూటమి అందిస్తున్న వనరులపై, మౌలిక సదుపాయాలపై పోరాటం చేస్తున్నట్లే. ప్రస్తుత పరిస్థితులను మూడో ప్రపంచ యుద్ధంగా పేర్కొనొచ్చు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ చర్చకు సంబంధించిన వీడియో ఒకటి శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. నెటిజన్లు రష్యా తీరుపై దుమ్మెత్తి పోశారు. నాటోను రెచ్చగొట్టొద్దంటూ హితవు పలికారు. రష్యా ప్రభుత్వం నడిపే మరో వార్తా సంస్థ ‘చానల్‌-1’ కూడా ఉక్రెయిన్‌ తీరుపై మండిపడింది. ‘‘రష్యాకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల ఆకాంక్షలను ఉక్రెయిన్‌ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. అనాలోచిత చర్యలతో రక్తపాతాన్ని, భీతావహ పరిస్థితులను సృష్టిస్తోంది’’ అని ఆ చానల్‌ యాంకర్‌ ఒలెస్యా లోసెవా వ్యాఖ్యానించారు. నిజానికి రష్యా యుద్ధనౌక మాస్క్వా విధ్వంసానికి తాము ప్రయోగించిన రెండు నెప్ట్యూన్‌ క్షిపణులే కారణమని ఉక్రెయిన్‌ పేర్కొంటుండగా.. అగ్ని ప్రమాదం వల్లే ఈ ఘటన జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యాకు చెందిన ఇతర అధికారిక వార్తా సంస్థలు మాత్రం.. ప్రతికూల వాతావరణం వల్లే మాస్క్వా నౌకకు మంటలంటుకున్నాయని పేర్కొన్నాయి.


కొనసాగుతున్న దాడులు

ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాలైన సివెర్‌స్కీ, స్లోబోజెన్‌స్కీ, డోనెట్స్క్‌, లుహాన్స్క్‌, టవ్రిస్కీ నగరాల్లో పోరు ఉధృతంగా సాగుతోంది. ఇంతకాలం ఖెర్సోన్‌లో దాడులను నిలిపివేసిన రష్యా.. శుక్రవారం ఆ నగరంపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. నల్లసముద్ర తీర నగరాలు మైకొలైవ్‌, మారియుపోల్‌పైనా క్షిపణి దాడులు జరిగాయి. కాగా, ఐదు రోజుల్లో ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తామంటూ మొదట్లో ప్రకటన చేసిన రష్యా.. 50 రోజులైనా ముందుకు సాగలేకపోయిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. గురువారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. కాగా, రష్యా అధినేత పుతిన్‌కు సహకరిస్తున్న చైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని అమెరికా హెచ్చరించింది. అమెరికా చట్టసభ్యుడు లిండ్సే గ్రాహం శుక్రవారం తైవాన్‌ రాజధాని తైపీలో పర్యటించారు. తైవాన్‌ ప్రధాని సాయ్‌ ఇంగ్‌-వెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తైవాన్‌పై చైనా దురాక్రమణకు యత్నిస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 


900 మృతదేహాలు లభ్యం

రష్యా సేనలు వైదొలగినప్పటి నుంచి కీవ్‌ శివారు నగరాలు, గ్రామాల్లో మొత్తం 900 మంది పౌరుల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు ప్రకటించారు. బుచాలో 350 మృతదేహాలకు సామూహిక ఖననాలు జరిగినట్లు గుర్తుచేశారు. రష్యా సేనలు పౌరులందరినీ ఒకే విధంగా చేతులు వెనక్కి కట్టి.. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చారని చెప్పారు.


రష్యా రక్షణ మంత్రికి గుండెపోటు!

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు గుండెపోటు బారిన పడ్డట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన కనిపించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మిత్రుడు.. రష్యన్‌-ఇజ్రాయెల్‌ వ్యాపారవేత్త లియోనిద్‌ నెవ్‌జ్లిన్‌ ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘‘ఇది సాధారణంగా వచ్చిన గుండెపోటు కాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై పోరులో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతుండడంతో.. ఆయన వైఫల్యం చెందారని, పుతిన్‌ ఆగ్రహంతోనే ఆయన గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది.


Updated Date - 2022-04-16T08:31:40+05:30 IST