Chennai: టార్గెట్ ఈపీఎస్...

ABN , First Publish Date - 2022-09-10T13:33:44+05:30 IST

అన్నాడీఎంకే బహిష్కృత నేతలంతా ఒక్కటయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి

Chennai: టార్గెట్ ఈపీఎస్...

- శశికళతో వైద్యలింగం భేటీ

- అన్నాడీఎంకే కార్యాలయంలోకి ఓపీఎస్‏కు ‘నో ఎంట్రీ’


చెన్నై, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే బహిష్కృత నేతలంతా ఒక్కటయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami)ను ఎదుర్కోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే నుంచి బహిష్కృతులైన ఆయన ప్రత్యర్థులంతా చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఇప్పటికే పలుమార్లు రహస్య మంతనాలు జరిపిన నేతలు ఇక బహిరంగ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తాజా బహిష్కృతనేత ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam) నమ్మినబంటు, ఎమ్మెల్యే వైద్యలింగం శుక్రవారం తంజావూరు జిల్లా కావ రైపట్టు గ్రామంలో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళతో భేటీ అయ్యారు. శుక్రవారం జన్మదినోత్సవం జరుపుకుంటున్న శశికళకు వైద్యలింగం శుభాకాంక్షలు చెప్పి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆమె వైద్యలింగానికి సీట్లు అందజేశారు. అనంతరం నేతలిద్దరూ సుమారు గంటపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇన్నాళ్లూ ఓపీఎస్‌, శశికళ(Shashikala) వర్గాల మధ్య ఆహ్వానాలు, మద్దతు ప్రకటనలు వెలువడ్డాయి. అయితే ఇరువర్గాల నేతలు బహిరంగంగా భేటీ కావడం ఇదే ప్రథమం. దీంతో ఓపీఎస్‌, శశికళ ఒకే వేదికపైకి వచ్చేందుకు మరెంతో సమయం పట్టదని ఇరువర్గాలు చెబుతున్నాయి. 


చేతులు కలుపుతున్న అన్నాడీఎంకే బహిష్కృతులు 

స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆ పార్టీ బహిష్కృతనేత ఓపీఎస్‏కు పోలీస్‏శాఖ అనుమతి నిరాకరించింది. న్యాయస్థానాల్లో పలు వివాదాల అనంతరం ఎట్టకేలకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈపీఎస్‏కు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 72 రోజుల అనంతరం ఆయన తొలిసారిగా గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో తమ నేత కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారని, ఇందుకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఓపీఎస్‌ మద్దతుదారులు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. దానిని పోలీస్‏శాఖ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జూలై 11న పార్టీ కార్యాలయంలో జరిగిన విధ్వంసం కేసుకు సంబంధించి సీబీసీఐడీ(CBCID) విచారణ జరుపుతోందని, ఆ పార్టీ కార్యాలయ తాళాలు కూడా ఈపీఎస్‏కు అప్పగించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలనే తాము పాటించామని స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పు మేరకు ఈపీఎస్‌ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఓపీఎస్‌ ఆ కార్యాలయానికి వెళ్తే ఘర్షణలు తలెత్తే అవకాశమున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపీఎస్‏ను అన్నాడీఎంకే కార్యాలయంలోకి అనుమతించబోమని, ఆ మేరకు తాము భద్రత కల్పించలేమని తేల్చి చెప్పింది. అవసరమైతే ఓపీఎస్‌ న్యాయస్థానానికి వెళ్లి అనుమతి పొందవచ్చని సూచించింది. ఇదిలా ఉండగా ఓపీఎస్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 




Updated Date - 2022-09-10T13:33:44+05:30 IST