టార్గెట్‌ దళిత్‌

ABN , First Publish Date - 2020-09-07T08:58:44+05:30 IST

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులే లక్ష్యంగా హింసకు పాల్పడుతున్నారు. దళిత ఉద్యోగులు, అధికారులు, అడ్వొకేట్లు, నేతలపై అధికార పార్టీ శ్రేణుల దాడులు పెరిగిపోయాయి.

టార్గెట్‌ దళిత్‌

  • దళితులపై పెరిగిన దాడులు..
  • వందలాదిగా కేసులు నమోదు
  • బాధ్యులపై చర్యలు తీసుకోని పోలీసులు..
  • అట్రాసిటీ కేసులకు అతీగతీ లేదు 
  • పోలీసు స్టేషన్లకు పిలిపించి బెదిరింపులు..
  • ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులపై వివక్ష 
  • ‘స్థానిక’ంలో పోటీ చేసినవారికి బెదిరింపులు..
  • గ్రామ బహిష్కారాలు, ఆస్తుల ధ్వంసం 
  • వైసీపీకి ఓట్లేయలేదంటూ పింఛన్లకు బ్రేక్‌ 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులే లక్ష్యంగా హింసకు పాల్పడుతున్నారు. దళిత ఉద్యోగులు, అధికారులు, అడ్వొకేట్లు, నేతలపై అధికార పార్టీ శ్రేణుల దాడులు పెరిగిపోయాయి. ‘‘మేం అధికారంలో ఉన్నాం... కుక్కిన పేనుల్లా పడుండండి’’ అంటూ వైసీపీ నేతలు వారిపై హూంకరిస్తున్నారు. దీనికితోడు పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులకు సంబంధించి అట్రాసిటీకి బదులుగా మామూలు కేసులు నమోదు చేస్తున్నారు. కొన్నిచోట్ల దళితులపైనే అక్రమంగా కేసులు బనాయించి పోలీసుస్టేషన్లకు పిలిపించి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులకు సంబంధించి 150కి పైగా కేసులు నమోదైనా ప్రభుత్వం, పోలీసులు కంటితుడుపు చర్యలకే పరిమితమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. ఇతర పార్టీల దళిత నాయకులెవరూ బహిరంగంగా పత్రికా ప్రకటనలైనా ఇచ్చే పరిస్థితి లేదు.


గ్రామాల్లో దళితుల అసైన్డ్‌ భూములను పేదల ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు పలు గ్రామాల్లో రంగం సిద్ధం చేశారు. అదేమని ప్రశ్నించి వారిపై కేసులు పెడుతున్నారు. వైసీపీకి ఓట్లు వేయలేదని గ్రామాల్లో పెన్షన్లు నిలిపేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఉన్నఫళంగా తొలగించారు. ఇదే పథకంలో అటెండర్‌గా, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి యానిమేటర్లుగా పనిచేస్తున్న వారికి, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు, అంగన్‌వాడీ ఆయాలు నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రత్యర్థి పార్టీల తరఫున బరిలో నిలిచిన దళితులకు గ్రామాల్లో సహాయ నిరాకరణ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో తాగునీటిని వాడుకోనీయడం లేదు. మరికొన్ని గ్రామాల్లో పోటీ చేసినవారిపై బెదిరింపులు కొనసాగుతున్నాయి. చివరకు ఉపాధి హామీ పథకంలో కూలీలుగా కూడా ప్రత్యర్థి పార్టీలకు చెందినవారంటూ వివక్ష చూపించడం సర్వసాధారణమైంది. 


దళితులపై జరిగిన దాడుల్లో కొన్ని.... 

  1. కడప జిల్లా గోపవరం మండలం మడకలలో కొందరు ఎస్సీలు గత ప్రభుత్వంలో ఇచ్చిన నివేశన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటే  మండల వైసీపీ నేతలు జేసీబీతో ఆ ఇళ్లను ధ్వంసం చేశారు. 
  2. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామ వలంటీర్‌పై వైసీపీ నేత దాడిచేసి కులం పేరుతో దూషించినా చర్యలు తీసుకోలేదు. కనగానిపల్లి మండలం భానుకోటలోని ఎస్సీ కాలనీలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుడు దాడిచేసి జేసీబీ, బైక్‌లను ధ్వంసం చేశారు. 
  3. చిత్తూరు జిల్లా కామిరెడ్డివారిపల్లి మండలం బండకాడకు చెందిన ఓంప్రతాప్‌ మద్యం ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడటంతో ఆత్మహత్య చేసుకున్నారు.
  4. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.అగ్రహారంలో గతేడాది మేలో ఎస్సీలను గ్రామ బహిష్కారం చేసిన కేసులో చార్జీషీట్‌ దాఖలైంది. బాధిత దళితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉన్నా వారికి అందలేదు. ఇదే జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో చెల్లె జోషిబాబు ఇంటినుంచి బయటకు రాకుండా జూలై 16న ఆయన ఇంటిచుట్టూ ఇనుప కంచె వేశారు. 
  5. సీఎం జగన్‌ను విమర్శించారని ఆరోపిస్తూ కృష్ణాజిల్లా ఘంటశాల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దొత్తముడి వెంకటేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. 
  6. గుంటూరు జిల్లా గురజాలలో మండలం మాచవరం, పిన్నెల్లి గ్రామాలకు చెందిన 50 కుటుంబాలను టీడీపీ ఓటేశారని గ్రామ బహిష్కరణ చేశారు. 
  7. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటేశ్వరరావు, బాలజీని సీఐ స్టేషన్‌కు తీసుకొచ్చి కొడుతూ ఎమ్మెల్యేకు లైవ్‌ వీడియో చూపించారని ఆరోపణలున్నాయి. 
  8. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండేపల్లి లో వైసీపీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఏర్పాటుచేసిన విందులో టీడీపీ ఎస్సీ నాయకుడు సురేష్‌పై దాడిచేశారు. సంతనూతలపాడు మండలం బి.మాచవరం మూడో వార్డుకు చెందిన సద్దు కొండలరావుపై వైసీపీ నేతలు దాడి చేసినా కేసు పెట్టారే తప్ప వారిపై చర్యలు తీసుకోలేదు. 
  9. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో వాదనాల వెంకటయ్య స్థల వివాదంలో వైసీపీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. 
  10. విశాఖపట్నం పెందుర్తిలో వైసీపీ నాయకుడు నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేస్తున్న పర్రి శ్రీకాంత్‌ను ఇనుప చువ్వలతో హింసించి, కర్రలతో కొట్టి శిరోముండనం చేశారు. 
  11. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కళ్లపరిలో కులవివక్షతను వ్యతిరేకించారంటూ దళితులపై అగ్రవర్ణాల వారు దాడులు చేశారు.


కరోనా బాధితులకు చికిత్స చేయడానికి మాస్క్‌లు ఇవ్వలేదన్నందుకు విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడు సుధాకర్‌ను ప్రభుత్వమే వేధింపులకు గురిచేసింది. ఆయన కేసు రాష్ట్ర పోలీసులను దాటి హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి చేరింది. 

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వైసీపీ నేత ఆదేశాలతో వరప్రసాద్‌ అనే దళితుడిని పోలీసులే కొట్టి, శిరోముండనం చేశారు. దీనిపై స్వయంగా రాష్ట్రపతి జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించారు. 

న్యాయమూర్తిగా పనిచేసి వేరే కారణాలతో సస్పెన్షన్‌లో ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రామకృష్ణ ప్రభుత్వ పెద్దల కన్నెర్రకు గురికావడంతో రోజుకో తప్పుడు కేసు, పోలీసుల బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. 

Updated Date - 2020-09-07T08:58:44+05:30 IST