టార్గెట్‌ సీఎం

ABN , First Publish Date - 2021-06-20T08:15:12+05:30 IST

టార్గెట్‌ సీఎం అంటున్నారు కొందరు నటీనటులు. అయితే వీరు ముఖ్యమంత్రి కావాలనుకునేది రియల్‌ లైఫ్‌లో కాదు... రీల్‌లైఫ్‌లో!

టార్గెట్‌ సీఎం

టార్గెట్‌ సీఎం అంటున్నారు కొందరు నటీనటులు. 

అయితే వీరు ముఖ్యమంత్రి కావాలనుకునేది రియల్‌ లైఫ్‌లో కాదు... రీల్‌లైఫ్‌లో!

విశేష ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల పాత్రలకు తెరపై ప్రాణం పోస్తున్నారు కొందరు నటీనటులు. ఓటీటీతో పాటు వెండితెరపైనా ముఖ్యమంత్రి పాత్రల్లో ఒదిగిపోతూ ఆకట్టుకుంటున్న సినీతారలు వీరే. 



చాలామంది సినీ నటులు రాజకీయాల్లో కూడా రాణించారు. కొందరు ముఖ్యమంత్రులుగా  కూడా ఎదిగారు. రాజకీయాల్లో రాణించడం సినీనటులకు ఎంత కష్టమో.. రాజకీయంగా విశేష ప్రజాదరణ పొందిన నాయకుల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించడం కూడా అంత కష్టం అని చెప్పాలి.  కూర్చున్నా, నిల్చున్నా, నడిచినా వారి స్టైల్‌ కొట్టొచ్చినట్టు కనిపించాలి. ఆహార్యం  కుదరాలి, ముఖంలో హావభావాలు పలికించాలి, మేనరిజమ్స్‌ను అనుకరించాలి.  పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే తప్ప ఇవన్నీ  అసాధ్యం. అయినా ప్రయత్నిస్తామంటున్నారు కొంతమంది తారలు.


నిరక్షరాస్య ముఖ్యమంత్రి

రొటీన్‌ హీరోయిజానికి భిన్నంగా తనలోని నటుణ్ణి వెలికితెచ్చే పాత్రలను ఎంచుకుంటున్నారు అభిషేక్‌ బచ్చన్‌. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘ద బిగ్‌ బుల్‌’ చిత్రంలో స్టాక్‌మార్కెట్‌ బ్రోకర్‌ హర్షద్‌ మెహతా పాత్రలో ఆయన ఆకట్టుకున్నారు. ఈ సారి రూటు మార్చి రాజకీయనాయకుడిగా సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాత్మకంగా రూపొందుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘దశ్వీ’లో అభిషేక్‌ బచ్చన్‌ నిరక్షరాస్యుడైన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌ పై ఉంది. 


ఫమరోసారి ముఖ్యమంత్రిగా 

జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘క్వీన్‌’ వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఈసారి వెండితెరపై పవర్‌ ఫుల్‌ సీఎం పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. సాయి ధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా దేవ్‌కట్టా దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో ‘రిపబ్లిక్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆమె ముఖ్యమంత్రి పాత్రలోనే కనిపించనున్నారని సమాచారం. 


సీఎం, పీఎం పాత్రల్లో

సినీనటుల్లో ముఖ్యమంత్రి అనగానే ఈ తరానికి కూడా వెంటనే గుర్తుకువచ్చే పేరు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత. ఆమె జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకుడు. ఇందులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో కంగన సీఎం జయలలితను తలపించారు. ముఖ్యమంత్రి పాత్రలో అత్యంత శక్తిమంతంగా కనిపించారు. జయలలిత సినిమా హీరోయిన్‌గా ఉన్నప్పటి పాత్రకు తగ్గట్టు కనిపించేందుకు కంగన తీవ్రంగా శ్రమించారు. థియేటర్‌లు తెరుచుకున్న వెంటనే ‘తలైవి’ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.


ప్రధాని ఇందిరాగాంధీగా...

భారతదేశ చరిత్రలో అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా గుర్తింపు పొందారు ఇందిరాగాంధీ. ఆపరేషన్‌ బ్లూస్టార్‌, ఎమర్జెన్సీ నాటి సంఘటనల నేపథ్యంలో సాయి కబీర్‌ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న  ఓ చిత్రంలో కంగనా రనౌత్‌ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.


యంజీఆర్‌ పాత్రలో...

భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన తొలి సినీనటుడుగా చరిత్ర సృష్టించారు యంజీ రామచంద్రన్‌. జయలలిత జీవిత కథతో తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో యంజీ రామచంద్రన్‌ పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు అరవిందస్వామి. సినీనటుడిగా కెరీర్‌ ఆరంభించిన తొలినాళ్లలో... అలాగే ముఖ్యమంత్రి అయ్యాక... ఇలా యంజీఆర్‌ రెండు పాత్రల్లోనూ అరవిందస్వామి చక్కగా ఒదిగిపోయారు. 


నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రిగా 

మలయాళంలో అగ్రహీరో అయినా స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి వైవిధ్యమైన పాత్రలను పోషించడంలో ముందుంటారు మోహన్‌లాల్‌. ఇటీవల ఓటీటీలో విడుదలైన మలయాళ చిత్రం ‘వన్‌’లో ఆయన కేరళ ముఖ్యమంత్రి కడక్కల్‌ చంద్రన్‌ పాత్రతో  ఆకట్టుకున్నారు. తెల్లచొక్కా, లుంగీతో  ఠీవీగా కనిపించి సీఎంగా తనదైన మార్క్‌ చూపించారు. 


రిచాచద్దా

ఈ ఏడాది ముఖ్యమంత్రి పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో కథానాయిక రిచాచద్దా. ‘మాడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ చిత్రంలో ముఖ్యమంత్రి తారా రూప్‌రామ్‌ ఖాన్‌ పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. కట్రినా కైఫ్‌ ఈ పాత్రలో నటించాల్సి ఉంది. ఆమె బిజీ షెడ్యూల్‌ వల్ల ఆ అవకాశం రిచాచద్దాకు దక్కింది. ఈ సినిమా ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి జీవితం ఆధారంగా తెరకెక్కింది. ముఖ్యమంత్రిగా ఎదిగిన దళిత మహిళ పాత్రను రిచా పోషించారు. ఈ సినిమా ప్రచార చిత్రాల్లో ఆమె చీపురు పట్టుకొని కనిపించడం వివాదంగా మారింది. దళితులను వీధులు ఊడ్చేవాళ్లుగా చూపుతున్నారంటూ భీమ్‌సేన్‌ అనే సంస్థ అభ్యంతరం తెలిపింది. సినిమా విడుదల చేస్తే రిచాను చంపుతామని బెదిరించారు. వివాదాలు ఎలా ఉన్నా ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్‌ కూడా రానుందనే ప్రచారం జరుగుతోంది.


ఓటీటీలో సీయం పాత్రల్లో

హ్యూమా ఖురేషి

గతనెలలో ఓటీటీలో విడుదలైన ‘మహారాణి’ వెబ్‌సిరీస్‌లో  ముఖ్యమంత్రి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలీవుడ్‌ కథానాయిక హ్యూమా ఖురేషి. 1990వ దశకంలో ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిగా చేసిన సంఘటనల నేపథ్యంలో దర్శకుడు కరణ్‌ శర్మ ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. ఇంటి బాధ్యతలకు మాత్రమే పరిమితమైన సాధారణ గృహిణి రాణీ భారతిగా హ్యూమా ఖురేషి ఆకట్టుకున్నారు. భర్త జైలుకెళ్లడంతో అనూహ్యంగా ఆయన స్థానంలో ఆమె ముఖ్యమంత్రి అవుతారు. సీఎంగా ఓ వైపు పరిపాలన వ్యవహారాలను,  నాయకురాలిగా పార్టీ రాజకీయాలను ఎలా చక్కబెట్టారనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. 


ఈషా తల్వార్‌

విశేష ప్రేక్షకాధరణ పొందిన ‘మీర్జాపూర్‌ 2’ వెబ్‌సిరీస్‌లో శక్తిమంతమైన మహిళా సీఎం పాత్రలో ఆకట్టుకున్నారు ఈషా తల్వార్‌. ఆమె తెలుగులో ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ‘మీర్జాపూర్‌ 2’ సిరీస్‌లో ఆమె ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించారు. ఇంటికే పరిమితమైన మహిళ తన తండ్రి మరణంతో ఆయన స్థానంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఓ వైపు అరాచక శక్తులను అదుపులో పెడుతూ, ప్రత్యర్థులను కట్టడి చేసే ముఖ్యమంత్రి మాధురి యాదవ్‌ త్రిపాఠి పాత్రలో ఈషా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మీర్జాపూర్‌ 3’లోనూ ముఖ్యమంత్రిగా ఆమె పాత్ర మరింత కీలకం కానుంది.

Updated Date - 2021-06-20T08:15:12+05:30 IST