‘టార్గెట్‌’ కోసమేనా..

ABN , First Publish Date - 2020-02-22T08:39:24+05:30 IST

చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఉన్నతస్థాయిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇదివరకే నియమించారు. కేబినెట్‌లో నంబర్‌ 2లాంటి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పార్టీలో నంబర్‌ 2గా భావించే విజయసాయి రెడ్డి

‘టార్గెట్‌’ కోసమేనా..

అమరావతి: చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఉన్నతస్థాయిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇదివరకే నియమించారు. కేబినెట్‌లో నంబర్‌ 2లాంటి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పార్టీలో నంబర్‌ 2గా భావించే విజయసాయి రెడ్డి, అధికారుల స్థాయిలో ద్వితీయస్థానంలోని అప్పటి ప్రత్యేక సీఎస్‌ (రెవెన్యూ) మన్మోహన్‌ సింగ్‌ ఇందులో సభ్యులు. వీరు గుర్తించిన అవకతవకలపై ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటే... మరింత ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలి. అలా కాకుండా... డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ వేశారు. అందులోనూ... ‘సిట్‌ ఏ వ్యక్తినైనా/అధికారినైనా పిలిపించవచ్చు’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో కొన్నాళ్లు సీఎస్‌గా పనిచేసిన, ఇప్పుడు కేబినెట్‌ ర్యాంకులో సలహాదారుగా ఉన్న అజేయ కల్లం లాంటి వారిని డీఐజీ ర్యాంకు అధికారి పిలిపించడం సాధ్యం కాదని... తాము టార్గెట్‌గా పెట్టుకున్న ‘కొందరు’ వ్యక్తులను విచారణ ముందు నిలబెట్టి, ఇరుకున పెట్టేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సిట్‌ ఏర్పాటు ఉత్తర్వును శుక్రవారం సాయంత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినప్పటికీ రాత్రి 9 గంటల వరకు దాన్ని రహస్య జీఓగా ఉంచారు. ఆ తర్వాతే విషయాన్ని బయటపెట్టారు. ఏ అంశంపై నియమించిన సిట్‌ అయినా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. అంతటితో దాని బాధ్యత పూర్తవుతుంది. నివేదికపై తదుపరి చర్యలు ప్రభుత్వమే తీసుకుంటుంది. కానీ... ఈ సిట్‌కు ప్రత్యేకంగా ‘పోలీసు స్టేషన్‌’ హోదా కల్పించడం గమనార్హం. దీని ఉద్దేశం ఏమిటనే అంశంపైనా చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-02-22T08:39:24+05:30 IST