Abn logo
Oct 17 2020 @ 11:56AM

టార్గెట్ అచ్చెన్న... ఢీ కొంటారో.. డీలా పడతారో..!

Kaakateeya

ఆ నియోజకవర్గంలో పనిచేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పరేషాన్‌ అవుతున్నారు? కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా వారి పరిస్థితి ఎందుకు మారింది? నిన్న మొన్నటిదాకా ఆయా మండలాల్లో పనిచేయటానికి ఉత్సాహం చూపించిన ఉద్యోగులు... ఇపుడు అక్కడి నుంచి బదిలీ చేయించుకోవాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు ఉద్యోగులు దినదిన గండంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితికి అసలు కారణాలేంటి? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఈ విషయాలు తెలియాలంటే అసలు కథనంలోకి వెళ్లాల్సిందే...


అభిమానం ముందు వ్యూహాలు చిత్తు...

2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా కొనసాగినా శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్ఛాపురంలో మాత్రం టీడీపీ గాలి వీచింది. జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్ధానాల్లో ఎనిమిది చోట్ల అధికార వైసీపీ సత్తా చాటగా.. టెక్కలి, ఇచ్చాపురంలో టిడిపి విజయం సాధించింది. టెక్కలి నుంచి పోటీ చేసి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గెలుపొందారు. రాష్ట్రంలో వైసీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన నియోజకవర్గాల్లో టెక్కలి కూడా ఒకటిగా చెప్పవచ్చు. అచ్చెన్నాయుడును ఎలాగైనా ఓడించాలని అప్పట్లో వైసీపీ వ్యూహం రచించిందట. అయితే కింజారపు కుటుంబానికి ప్రజల్లో ఉన్న అభిమానం ముందు ఫ్యాన్‌ పార్టీ వ్యూహాలు ఫలించలేదట. టెక్కలిలో అచ్చెన్నాయుడు హవాను తగ్గించేందుకు అధికార పార్టీ వ్యూహాలకు పదునుపెట్టింది.


ఆయన లేనిదే ఏ పనీ జరగడం లేదట..

శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధిష్టాన పెద్దలు. అంతేకాదు స్థానికంగా ఏది జరగాలన్నా దువ్వాడ శ్రీనివాస్‌కు తెలియాలని అధికారులకు మౌకిక ఆదేశాలు వెళ్లిపోయాయట. దీంతో అధికార, అనధికార కార్యక్రమాలు ఏవైనా దువ్వాడ శ్రీనివాస్ లేనిదే నియోజకవర్గంలో ఏ పనీ జరగటం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. అచ్చెన్న దగ్గరికి వెళ్తున్న అధికారులు ఎవరు? ఎందుకు ఆయనను కలుస్తున్నారు? వారు జరిపిన సంబాషణలు ఏంటి? ఇలాంటి సమాచారం సేకరించటానికి దువ్వాడకు చెందిన ఓ టీమ్‌ వర్క్‌ చేస్తుందట.

ఇంటికి పిలిచి క్లాస్ పీకారట...

ఇటీవల వ్యవసాయ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న శాఖాపరమైన అంశాలపై ఎమ్మెల్యే వారితో చర్చించారు. అయితే ఈ విషయం సాయంత్రానికే వైసీపీ ఇంఛార్జ్‌ దువ్వాడ చెవిన పడిందట. అంతే ఆ ఇద్దరు అధికారులనూ ఇంటికి పిలిపించి క్లాస్ తీసుకున్నట్లు వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దువ్వాడ ఆగ్రహానికి గురైన సదరు అధికారులు చేతులు ముడుచుకుని సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇంకోసారి అచ్చన్న స్వగ్రామం నిమ్మాడలో కనిపిస్తే వేరే ఆప్షన్ చూసుకోవాల్సి ఉంటుందని గట్టిగానే మందలించారట. దీంతో ఇపుడు ఇతర అధికారులు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో మాట్లాడాలంటేనే భయంతో వణికిపోతున్నారట.


ఢీ కొంటారో.. డీలా పడతారో...

మరోవైపు టెక్కలిలో అధికారిక కార్యక్రమాలతో పాటు సమీక్షలు సైతం దువ్వాడ సమక్షంలోనే జరుగుతున్నట్లు మరో టాక్‌ వినిపిస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తే దువ్వాడ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి వైసీపీ ఇంఛార్జ్‌ వ్యవహారంతో టెక్కలిలో పనిచేసే అధికారుల పరిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా తయారయ్యిందట. మరి దువ్వాడ శ్రీనివాస్‌..టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడును ఢీ కొంటారో లేక డీలా పడుతారో అన్నది వేచిచూడాలి.

Advertisement
Advertisement
Advertisement