టార్గెట్‌ 3500 కోట్లు!

ABN , First Publish Date - 2022-01-21T07:46:02+05:30 IST

టార్గెట్‌ 3500 కోట్లు!

టార్గెట్‌ 3500 కోట్లు!

ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తానన్న జగన్‌

తీరా దరఖాస్తు చేశాక పరిధి కుదించిన వైనం

జీవో 225 పరిధిలోకి 37,800 దరఖాస్తులు

వాటిలో ఉచితం కిందకు వచ్చేవి కేవలం 4620

మిగిలిన దరఖాస్తుల్లో దండుకోవడమే..

రూ. లక్షలు చెల్లించాలని డిమాండ్‌ నోటీసులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వరాల మాటున చావుదెబ్బలు మొదలయ్యాయి. లక్షల రూపాయలు చెల్లించి భూములు క్రమబద్ధీకరించుకోవాలన్న డిమాండ్‌ నోటీసులు పేదల ఇళ్లకు చేరుతున్నాయి. సింగిల్‌ టేక్‌లో డబ్బు కడతారా? చట్టప్రకారం చర్య తీసుకోవాలా? అంటూ రెవెన్యూ అధికారులు తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదంతా ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ పేరిట పేదల నుంచి కనీసం 3,500 కోట్లమేర వసూలు చేసి ఖజానా నింపేందుకు జరుగుతున్న తంతు అనేది ఇప్పుడిప్పుడే పేదవర్గాలకు తేటతెల్లమవుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకొంటే రెగ్యులరైజేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు 23న జీవో 225 జారీ చేసింది. పేరుకే ఆ జీవో ఇచ్చినా అందులో ఏముందో బయటపెట్టలేదు. జీవో కాపీని ప్రజలకు  అందుబాటులోకి తీసుకురాలేదు. సర్కారు షరతులు తెలియని సామాన్యులు జగనన్న వరాలు కురిపిస్తాడని, 100 గజాల మేరకు ఉచితంగానే క్రమబద్ధీకరిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆశపడ్డారు. క్రమబద్ధీకరణను కోరుతూ గత సెప్టెంబరు నుంచి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఉచిత క్రమబద్ధీకరణ పరిధిని ప్రభుత్వం 75గజాలకు కుదించినట్టు... దానికోసమే జీవో 225 తెచ్చినట్టు వారికి తెలియలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 43వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో 37వేల దరఖాస్తులు క్రమబద్ధీకరణకు అర్హత సాధించినట్లు తేలింది. ఇందులో 21,500 మంది పట్టణ శివారు ప్రాంతాలు, మురికివాడలు, సుదూరప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారున్నట్టు గుర్తించారు. మిగిలిన దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవిగా క్రోడీకరించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో కలిపి జీవో 225 ప్రకారం ఉచితంగా క్రమబద్ధీకరణ పరిధిలోకి వచ్చేవి కేవలం 4,620గా గుర్తించినట్లు తెలిసింది. అంటే, 75 గజాలు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలు ఇంతమంది ఉన్నారన్నమాట. ఈ మేరకే ఉచితంగా భూముల క్రమబద్దీకరణ జరగనుంది. మరో 15 వేల కేసుల్లో పేదలకు సంబంధించినవే 76నుంచి 100 గజాల విస్తీర్ణంలో ఇళ్లున్న దరఖాస్తులున్నాయి. ఇంటితోపాటు చుట్టూ ఉన్న కాంపౌండ్‌ను సర్వేచేసినప్పుడు ఆక్రమించుకున్న భూమి విస్తీర్ణం 76గజాల నుంచి ఆపైన ఉన్నట్లుగా తేలింది. దీంతో ఈ దరఖాస్తులు ఉచిత క్రమబద్ధీకరణ జాబితాలోకి రావడంలేదు. 150 నుంచి 300గజాల క్రమబద్ధీకరణ కోరినవి 11,700 దరఖాస్తులు ఉన్నట్లు సమాచారం. పేదలు ఆక్రమించుకున్న భూమి 76గజాలు ఉన్నా భూమి విలువలో 70 శాతం విలువ చెల్లించాలి. 160 గజాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉంటే భూమి విలువలో 100శాతం చెల్లించాల్సి ఉంది. క్రమబద్ధీకరణకు ఏ ప్రాంతంలో ఎంత ఽఫీజు వసూలు చేయాలి? అక్కడ మార్కెట్‌ రేటు ఎంత అన్నది జీవో 225లో స్పష్టత ఇవ్వలేదు. భూమి విలువ ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే చెప్పారు. దీంతో ధరను నిర్ణయించే బాధ్యతను సబ్‌డివిజనల్‌ లెవల్‌ కమిటీకి అప్పగించారు. ఆ కమిటీ నిర్ణయిం చే ధరను దరఖాస్తు దారులనుంచి వసూలు చేయాలని, ఈ మేరకు డిమాండ్‌ నోటీసులు జారీ చేయాలని సీసీఎల్‌ఏ ఉత్తర్వులు ఇచ్చారు. 


శివార్ల భూములపైనా భారీ బాదుడు

జీవో 225 ప్రకారం డిమాండ్‌ నోటీసుల మేరకు ఫీజులు వసూ లు చేస్తే ఖజానాకు 3,500 కోట్లపైనే వస్తాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నగరాల శివారు ప్రాంతాల పరిధిలోనే 1500 కోట్ల మేర డిమాండ్‌ నోటీసులు వెళ్లి ఉంటాయని తెలిసింది. నగర శివారు ప్రాంతాల్లోనూ భూమి విలువను భారీగా అంచనావేసి నోటీసులు ఇచ్చారని, వాటి ఆధారంగా ఫీజులు వసూలు చేస్తే ఖజానాకు భారీ ఆదాయం వస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. 150-300 గజాలు ఆక్రమించుకున్న భూములకు ఇచ్చే డిమాండ్‌ నోటీసుల ద్వారానే రూ.600 కోట్లు వస్తాయని అంచనా. మార్కెట్‌ విలువ, బేసిక్‌ విలువతో సంబంధం లేకుండానే భారీగా పిండాలన్న లక్ష్యంతో బేసిక్‌ విలువను ఖరారుచేసి డిమాండ్‌ నోటీసులు ఇచ్చారని, ఇది పేదలకు పెనుభారమని అధికార వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 


కట్టలేరు.. కాదనలేరు..

విజయవాడ సమీపంలో ఓ మహిళ 110 గజాల్లో ఇళ్లు నిర్మించుకొని ఉన్నారని, ఆ భూమికి 22 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్‌ నోటీసు పంపించారు. ఇదే సిటీలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మరో మహిళ 78 గజాల్లో ఇళ్లు నిర్మించుకొన్నందుకు 14.98 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ నోటీసు పంపించారు. విశాఖపట్టణం సమీపంలో ఓ పేద మహిళ 116 గజాల్లో ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నందుకు 16.50 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ నోటీసు పంపించారు...ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. పట్టణ, నగర శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న పేదలకు లక్షలు చెల్లించాలని, అది కూడా ఒకే దఫా చెల్లింపు జరపాలని నోటీసులు ఇచ్చారు. నిజానికి పేదల వద్ద లక్షలాది రూపాయలే ఉంటే ప్రభుత్వ భూములను ఎందుకు ఆక్రమించుకుంటారు? సొంతగా భూమి కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుంటారు కదా! ఇప్పుడు వారిని ఒక్కసారిగా లక్షలు చెల్లించమంటే అంత సొమ్ము ఎక్కడి నుంచి తీసుకురాగలరు? ఇది అయ్యేపనేనా? సర్కారు చేసిన పనితో పేదలు ముందుకు, వెనక్కు వెళ్లలేని పరిస్థితి ఉంది. భూములు ఆక్రమించుకున్నామని ప్రభుత్వం ముందు దరఖాస్తులు పెట్టుకున్నారు. అలాగని సొమ్ములు కట్టమంటే అయ్యేపనికాదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


అసలు మర్మమిదేనా...!

ప్రభుత్వం పేదలకు మేలు చేయాలనుకుంటే 100 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లలో సర్కారు అమలు చేసిన స్కీమలు ఇదే నియమాన్ని పాటించాయి. జగన్‌ కూడా జీవో 463 ద్వారా అదే చేశారు. కానీ అనూహ్యంగా జీవో 225 జారీ చేయడంలోనే ఫీజుల రూపేణా పిండుకోవాలన్న ఉద్దేశం ఉందంటున్నారు. ‘‘రెగ్యులైజేషన్‌లో 100గజాల వరకు ఉచితంగా మేలు చేయవచ్చు. అప్పుడు సర్కారుకు తగినంత ఆదాయం రాదు. కాబట్టి ఈ పరిమితిని 75గజాలకు కుదించారు. ఎలాగూ 75 గజాల్లో ఇళ్లు ఉండదు కాబట్టి సాధ్యమైనంత మేరకు ఫీజులను పిండుకోవచ్చని అంచనావేసి ఉంటారు’’ అని రిటైర్డ్‌ అధికారి ఒకరు చెప్పారు. ఈ అంశంపై రెవెన్యూశాఖను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, జీవో 225 కింద క్రమబద్ధీకరణకు ఆన్‌లైన్‌లో 23 దరఖాస్తులే వచ్చాయని, జిల్లాలవారీగా ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల సమాచారం తమవద్ద లేదని పేర్కొంది. కాగా, జిల్లాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణలు గుర్తించి జారీచేసిన డిమాండ్‌ నోటీసులు, వాటి ఆధారంగా వచ్చిన దరఖాస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచకపోవడం గమనార్హం.

Updated Date - 2022-01-21T07:46:02+05:30 IST