Advertisement
Advertisement
Abn logo
Advertisement

100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి

లక్ష్యం చేరుకునేందుకు ‘వాక్సినేషన్‌ వీక్‌’

మూడోవేవ్‌ వస్తే ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు


సిద్దిపేట టౌన్‌, నవంబరు 30: జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకునేలా చూడాలని కలెక్టర్‌ యం. హన్మంతరావు వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. సిద్దిపేటలోని కలెక్టరేట్‌లో వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొవిడ్‌ స్థితిగతులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, ఉపవైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో 92 శాతం మంది మొదటి డోసు వాక్సిన్‌ తీసుకున్నారని, రెండో డోసు ఇంకా 74వేల మందికి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా మూడోవ్యాప్తి, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రజలకు వివరించి వ్యాక్సిన్‌ తీసుకునేలా చూడాలని సూచించారు. 100 శాతం వాక్సినేషన్‌ లక్ష్యాన్ని సాధించేందుకు నేటి నుంచి వారం రోజులను వాక్సినేషన్‌ వీక్‌గా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కరోనా మూడోవేవ్‌ వస్తే ఎదుర్కునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మానసికంగా, శారీరకంగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో అంగన్‌వాడీ విద్యార్థుల నుంచి కళాశాల విద్యార్థుల వరకు నేత్ర సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎల్వీప్రసాద్‌ ఐ–ఇన్‌స్టిట్యూట్‌ ముందుకు వచ్చిందన్నారు. ఈమేరకు వచ్చే సోమవారం నుంచి ప్రాథమిక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, డీఎంఆండ్‌హెచ్‌వో డా.మనోహర్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.విజయరాణి తదితరులు పాల్గొన్నారు.


డిసెంబరు 14 నుంచి డబుల్‌బెడ్రూం ఇళ్ల ప్రవేశాలు

సిద్దిపేట జిల్లాలో పూర్తయిన డబుల్‌బెడ్రూం ఇళ్ల గృహప్రవేశాలు డిసెంబరు 14 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు అధికారులను ఆదేశించారు. డబుల్‌బెడ్రూం ఇళ్లపై సంబంధిత శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో ఆయన సమీక్షించారు. గజ్వేల్‌ పట్టణంలో 1,250, దుబ్బాక పట్టణంలో 852, దుబ్బాక రూరల్‌లో 400, దౌల్తాబాద్‌ మండలంలో 170, రాయపోల్‌ మండలంలో 145, మిరుదొడ్డి మండలంలో 185, తోగుట మండలంలో 80, బెజ్జంకి మండలంలో 98, హుస్నాబాద్‌లో 160 డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని ఇంజనీరింగ్‌ అధికారులు ఈ సందర్భంగా ఆయనకు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గ్రామాలు, పట్టణాలవారీగా నిర్మాణం పూర్తయిన ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్గతరోడ్లు, ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికను త్వరలోనే పూర్తిచేస్తామని వెల్లడించారు. సమావేశంలో డీఆర్‌వో చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్‌ఎంట్రీ, చెల్లింపులపై పౌరసరఫరాల అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 శాతం ధాన్యంను సేకరించామని, డిసెంబర్‌ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు పూర్తిచేస్తామని పౌర సరఫరాల అధికారులు వివరించారు. 


గౌరవెల్లి ప్రాజెక్ట్‌ భూ సేకరణలో వేగం పెంచాలి

గౌరవెల్లి రిజర్వాయర్‌ భూసేకరణ పూర్తిచేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ హన్మంతరావు అధికారులను ఆదేశించారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిపై రెవెన్యూ, ఇంజనీరింగ్‌ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భూసేకరణ వివరాలను అక్కన్నపేట తహసీల్దార్‌ వేణుగోపాల్‌ కలెక్టర్‌కు వివరించారు. ప్రాజెక్ట్‌ కోసం 3,870 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా 272 ఎకరాల సేకరణ పెండింగ్‌లో ఉందని వివరించారు. ఇందులో 19 ఎకరాలను ఇటీవల సేకరించామని, మిగతా భూసేకరణకు సంబంధించి పరిహారం చెక్కులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్వాసితులకు చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి అన్ని ప్రయోజనాలను అందించి ముంపు ప్రాంతాలను ఖాళీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఉప్పరపల్లిలో భూసేకరణకు అవార్డు పాసైనా చెక్కుల పంపిణీ పూర్తికాకపోవడమేమిటని దౌల్తాబాద్‌ తహసీల్దార్‌ను ప్రశ్నించారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఈఎన్‌సీ శంకర్‌, ప్రాజెక్ట్‌ కార్యనిర్వాహక ఇంజనీరు రాములు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు కరుణశ్రీ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement