Abn logo
Sep 20 2021 @ 00:45AM

తరమెళ్లిపోతున్నది!

ముందుతరాలు పోగుచేసిన జ్ఞానసంచయం తరు వాతితరానికి అందాలి. ముఖ్యంగా శాసనాలు, తాళపత్రాలు, ప్రాచీనకావ్యాలు మొదలైన జ్ఞాన సంచయాల్లో ప్రస్తావితమైన సమాచారం ఈ తరానికి అర్థమయ్యే రీతిలో అందించాల్సి కృషి జరగాలి. ‘ప్రాచీన జ్ఞాన సంచయం’ ఈ తరానికి పనికొస్తుందా?’ అనే ప్రశ్న అర్థరహితం. చరిత్ర నిర్మాణానికి సాహిత్యాన్నీ ఒక ఆకరంగా గుర్తించిన ప్రసిద్ధ చరిత్రకారుడు డి. డి. కోశాంబిని ఆదర్శంగా తీసుకోవాలి. ‘చరిత్ర తెలుసుకోలేనివారు చరిత్ర నిర్మించలేరు’ అన్న అంబేడ్కర్‌ సూత్రీకరణను గమనంలో ఉంచుకోవాలి. సురవరం ప్రతాపరెడ్డి మాటలు గుర్తు చేసుకోవడమూ అవసరమే: ‘‘మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవత లను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగి యుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాలకే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశా లతో వ్యాపారాలు చేసిరో అవన్నీ తెలుసు కొనవలెనని మనకు కుతూహలముండును’’ అని ఆయన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో రాసారు.


తెలుగువారి జీవనతాత్త్వికతకు నిలువుటద్దాలైన జ్ఞానసంచయాలపట్ల ఆసక్తి ప్రతీతరంలో సహజం గానే ఉంటుంది. ఇటువంటి తృష్ణ కలిగిన తరానికి ప్రాచ్యజ్ఞానాన్ని అందుబాటులో ఉంచితే అందులోని మంచి చెడులను బేరీజు వేసుకునే అవకాశాన్ని వారికే ఇచ్చినట్టవుతుంది. వారి ఆలోచనలకు రెక్కలు తొడిగినట్లవు తుంది. ఈ కాలానికి ఏది ఆచరణాత్మక జ్ఞానమో వారే నిర్ణయించుకుంటారు. 


ప్రాచీన జ్ఞానాన్ని ‘అందుబాటులోకి’ తెచ్చే తరం క్రమంగా తరలిపోతోంది. వయసు మీద పడటంవల్లా, కరోనా వంటి అనుకోని విపత్తులవల్లా చాలామంది పండితులు, శాస్త్ర కారులు, సామాజికవేత్తలు ఇప్పటికే కాలం చేసారు. వారి పరిశోధనలను, పరిష్కరణలను, వ్యాఖ్యానాలను, లిపి అధ్య యన జ్ఞానాన్ని, భాషా సంబంధ అనేక వ్యుత్పత్తులను, వాటి లోతులను అర్థంచేసుకొనే చివరితరం ఇప్పటికీ ఉండటం కొంత ఆశను చిగురింప చేస్తోంది. పోయినవారి శిక్షణలో పొందిన జ్ఞానంతో పునరుత్తేజితమైన ఆ తరమంతా ఇప్పుడు డెబ్భైలు, ఎనభైలు దాటింది. ముఖ్యంగా సంస్కృత భాషా ధ్యయన మూలాలుండి ప్రాచీన కావ్యాలను పరిష్కరించ గలిగే, వ్యాఖ్యానించగలిగే తరం మన కళ్ళ ముందు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత సంఖ్యలోనే ఉన్నారు. వీరితో పోల్చితే నాణేలు, శాసనాలు, కైఫీ యత్తుల్లోని లిపి చదివి అర్థంచేసుకోగ లిగేవారు మరీ తక్కువ. ఆయా చారిత్రక కట్టడ విశేషాలను, అందులోని శైలీ వైవిధ్యాలను విడమర్చి, శాస్త్రీయంగా చెప్పేవారు రోజురోజుకూ కరువ వుతున్నారు. వ్యాకరణం, భాషా శాస్త్రరంగాల్లో ముఖ్యంగా సంస్కృతం ఇతర ద్రావిడ భాషలు తెలిసినతరం కూడా తగ్గి పోతున్నారు. ప్రాచ్య జ్ఞాన రంగాలుగా చెప్పుకునే ఈ అధ్య యనాలు లాభసాటిరంగాలు కాకపోవడంతో వాటికిగల నిరాదరణ బహిరంగ రహస్యమే. అంతేకాకుండా వీటిని చదివితే ఉద్యోగాలొ స్తాయనే భరోసా యువతకు ప్రభుత్వాలు కల్పించడంలేదు. సామాజికరంగంలోనూ, విద్యారంగంలోనూ వెల్లువలా వచ్చిన ఆధునిక పరిణామాల మాట ఎలా ఉన్నా ప్రాచీన జ్ఞానసంచయం తర్వాతి తరాలకు అందాలి.


‘‘గ్రంథమును శోధించి, లేఖక ప్రమా దములను తొలగించి, లోపములను పూరించి గ్రంథమును నిర్దుష్టముగ సవరించి ముద్రించుట సామాన్యుల కలవిగాని పని. అట్టి పని నిర్వహించుటకు తగినవారు విద్వర్యులై, చరిత్ర కోవిదులై యుండవలయును.’’ అని మాడపాటి హనుమంతరావు శ్రీ సిద్ధేశ్వర చరిత్రకు రాసిన పీఠికలో పేర్కొన్న మాటలు ఇక్కడ ప్రస్తావనార్హాలు. ఈ నిష్ణాతుల తరాన్నైనా సమన్వయంచేసి వారి సేవల్ని ఉపయోగించు కోవాలి. వీరంతా ముందుతరాల జ్ఞానాన్ని తమ భుజ స్కంధాలపై మోస్తున్న వారసులు. తెలుగు ప్రభుత్వాలతో పాటు ఔత్సాహిక భాషాభిమానులు చొరవ తీసుకొని నేటి తరాన్ని వీరితో అనుసంధానం చేయగలిగితే, సాంస్కృతిక ప్రసరణకు మరో తరం వరకు ఢోకా ఉండదు.

చంద్రయ్య ఎస్‌

99637 09032