టాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసి హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులే పడింది సొట్టబుగ్గల సొగసరి తాప్సీ. అయితే బాలీవుడ్‌లోకి వెళ్లి సక్సెస్ కావడంతో అక్కడే ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటోంది. అప్పుడప్పుడే తెలుగులో సినిమాలు చేస్తూ వస్తోంది. 'ఆనందో బ్రహ్మ' తర్వాత తాప్సీ తెలుగులో సినిమా చేయనేలేదంటే బాలీవుడ్లో ఆమె ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలా గ్యాప్ తర్వాత తెలుగులో 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా చేయబోతుంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' చిత్రాన్ని తెరకెక్కించిన స్వరూప్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు తాప్సీ. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది చిత్ర యూనిట్. అలాగే చేతికి కట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియస్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా తాప్సీ పన్ను మాట్లాడుతూ "గత 7 సంవత్సరాలుగా ఒక ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. 'మిషన్ ఇంపాజిబుల్' అలాంటి చిత్రాల్లో ఒకటి. ఆకట్టుకునే కథాంశం మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ లాంటి మంచి టీమ్ కావడంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. క్వాలిటీ చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాలలో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిలబెట్టుకోగలను అని నమ్ముతున్నాను" అన్నారు.