తప్పించండి

ABN , First Publish Date - 2021-12-17T07:08:52+05:30 IST

తప్పించండిద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రాని నేరస్థుడిగా అభివర్ణిస్తూ, ఆయనను వెంటనే మంత్రి పదవినుంచి తొలగించాలని విపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లోనూ గట్టిగా పట్టుబడుతున్నాయి...

తప్పించండి

కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రాని నేరస్థుడిగా అభివర్ణిస్తూ, ఆయనను వెంటనే మంత్రి పదవినుంచి తొలగించాలని విపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లోనూ గట్టిగా పట్టుబడుతున్నాయి. లఖింపూర్ ఖేరీ ఘటన నిర్లక్ష్యం కాదు, కుట్ర అని సిట్ తన నివేదికలో తేల్చిన తరువాత కూడా కేంద్రప్రభుత్వం మిశ్రాని కాపాడటమేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యమిస్తున్న రైతులమీదకు మంత్రిగారి కుమారుడు వాహనాన్ని పోనిచ్చి నలుగురిని తొక్కిచంపిన ఆ అమానవీయమైన ఘటనమీద చర్చ జరగాలంటూ ఉభయసభల్లోనూ విపక్షాలు తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ అధికారపక్షం పడనీయలేదు. అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటనలో మరో నలుగురు మరణించిన విషయం తెలిసిందే.


ఈ ఘటనకు సంబంధించి చట్టప్రకారం తాను చేయవలసినదంతా చేశాననీ, ఇంకా ఏం కావాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అడుగుతోంది. ఆశిష్ మిశ్రామీద ఎఫ్ ఐఆర్ నమోదుచేశాం, అరెస్టయి ఇంకా జైల్లోనే ఉన్నాడు, బాధిత కుటుంబాల వారికి నష్టపరిహారం ఇచ్చాం, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సాగుతోంది.. ఇవన్నీ చేశాం చాలదా అన్నది యూపీ ప్రభుత్వం ప్రశ్న. కానీ, సుప్రీంకోర్టు జోక్యం లేనిదే వ్యవహారం కనీసం ఇంతవరకూ కూడా వచ్చేది కాదని అందరికీ తెలుసు. ఆశిష్ వాహనంలో ఉన్నాడనీ, అతని ఆదేశాల మేరకే అన్నదాతలను తొక్కిచంపిన ఘటన జరిగిందని రైతు ఉద్యమకారులు అప్పట్లోనే ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటనకు ఒకరోజు ముందు ఉద్యమిస్తున్న అన్నదాతలను తీవ్రంగా హెచ్చరిస్తూ కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా కుమారుడికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. తన కుమారుడు ఆ వాహనంలో లేడనీ తన పక్కనే ఉన్నాడని తండ్రి మొదట్లో సమర్థించుకొచ్చారు. ఆ తరువాత పోలీసుల సమన్లకు కూడా కొడుకు స్పందించలేదు. ఇటువంటి హత్యకేసుల్లో అందరినీ కూడా మీరు ప్రశ్నిస్తాం రమ్మంటూ ఇలాగే బతిమాలుకుంటారా అని సుప్రీంకోర్టు అవహేళన చేస్తూ, ఇప్పటికైనా ఎవరినైనా అరెస్టు చేస్తారా లేదా అని గద్దించిన తరువాతే కదలిక ఆరంభమైంది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ లో కూడా సర్వోన్నత న్యాయస్థానం కొన్ని మార్పుచేర్పులు చేయవలసి వచ్చింది. ఇప్పుడు హత్యాయత్నం, లైసెన్సులేని తుపాకులున్నాయనడం సహా సిట్ కొత్త నిజాలతో కొత్త అభియోగాలు అశిష్ మీద నమోదు చేసిన నేపథ్యంలో తండ్రికి చేతులూ కాళ్ళూ ఆడడం లేదు. సిట్ వెలుగులోకి తెచ్చిన అంశాలపై తనను ప్రశ్నించినందుకు బుధవారం ఆయన ఓ పాత్రికేయుడితో దురుసుగా ప్రవర్తించాడు. కాలర్ పట్టుకున్నాడు, ఫోన్ లాక్కున్నాడు, జర్నలిస్టులందరిమీదా నోరుపారేసుకున్నాడు.


గోవాలో పట్టణాభివృద్ధి మంత్రి మిలింద్ నాయక్ మీద విపక్ష కాంగ్రెస్ ‘సెక్స్ కుంభకోణం’ ఆరోపణలు చేయడంతో ప్రమోద్సావంత్ నాయకత్వంలోని బీజేపి ప్రభుత్వం బుధవారం సదరు మంత్రిని పదవి నుంచి తప్పించింది. తనపై దర్యాప్తు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరిగేందుకు వీలుగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారట. ఇదే సూత్రం అజయ్ మిశ్రాకు ఎందుకు వర్తించదో అర్థంకాదు. తన వాహనం చక్రాలకింద నలుగురిని ఉద్దేశపూర్వకంగా తొక్కిచంపాడన్న ఆరోపణలు కొడుకుమీద ఉండగా, కేంద్రంలో కీలకమైన హోంశాఖ సహాయమంత్రి స్థానంలో తండ్రి కొనసాగడం నైతికంగా సరైనదేనా అని బీజేపీ పెద్దలు ప్రశ్నించుకోవాలి. గోవాలో మరో రెండునెలల్లో ఎన్నికలు పెట్టుకొని మిలింద్ నాయక్‌ను మంత్రిగా కొనసాగిస్తే తీవ్ర నష్టం తప్పదనే కదా బీజేపీ పెద్దలు ఆయనను తప్పించింది. దర్యాప్తు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరగాలన్న సదుద్దేశంతోనే ఈ పనిచేశామని అంటున్నవారు అదే పని అజయ్ మిశ్రా విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారు? రేపు అశిష్ నిర్దోషిగా బయటపడినా, లేదా నేరం రుజువై శిక్షపడినా అప్పటివరకూ ప్రతీ దశ ప్రక్రియలోనూ ఎవరి జోక్యం లేదనీ, తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం జరగలేదని ప్రజలకు నమ్మకం కలగాలంటే తండ్రి తన పదవిని వదులుకోక తప్పదు. మరో పదిరోజుల్లోగా చార్జిషీటు మోదుచేయబోతున్న నేపథ్యంలో, అజయ్ మిశ్రా నిష్క్రమణ ఎంత త్వరగా జరిగితే బీజేపీకి అంతమంచిది. నేడు యూపీలో యోగి, రేపు ఢిల్లీలో మోదీ అని అనుకుంటున్నవారు మిశ్రాకూ ఆయన ఓటుబ్యాంకుకూ భయపడితే చివరకు నష్టపోతారు. సాగుచట్టాలను ఉపసంహరించుకొని, అన్నదాతలను ప్రసన్నం 

చేసుకున్నది ఎన్నికల్లో ఉపకరించాలంటే అన్నదాతలు ఎంతోకాలంగా అడుగుతున్న మిశ్రా నిష్క్రమణ జరగాల్సిందే.

Updated Date - 2021-12-17T07:08:52+05:30 IST