Jul 28 2021 @ 18:02PM

సుందర్‌ సి చిత్రంలో మూడో హీరోయిన్‌గా ఆమెకు ఛాన్స్

కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌ సి ఒక వైపు కొత్త చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే, మరోవైపు ఇతర దర్శకుల చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే తాను దర్శకత్వం వహించిన ‘అరణ్‌మనై-3’ చిత్రం రిలీజ్‌ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు ‘కట్టప్పావై కాణోమ్‌’ అనే కొత్త ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. అదేసమయంలో మణి చెయ్యోన్‌ దర్శకత్వం వహించే క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలోనూ సుందర్‌ సి నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం హెబ్బా పటేల్‌, శాంతిని తమిళరసన్‌లను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ‘తడమ్‌’, ‘దారాళ ప్రభు’ అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన తాన్య హోప్‌ను ఈ క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలో మరో హీరోయిన్‌గా ఎంపికచేశారు. ఈమె ఇప్పటికే కులస్వామి అనే చిత్రంలో హీరో విమల్‌ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.