TANTEX నెలనెలా తెలుగు వెన్నెల 178వ సాహితీ సదస్సు

ABN , First Publish Date - 2022-05-14T14:18:22+05:30 IST

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈనెల 8న జరిగిన 178వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.

TANTEX నెలనెలా తెలుగు వెన్నెల 178వ సాహితీ సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈనెల 8న జరిగిన 178వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. చిన్నారులు సింధు, సాహితీ ''పలుకే బంగారమాయెనా కోదండపాణీ పలుకే గారమాయెనా'' అంటూ తమ మధుర గాత్రంతో వీనులవిందుగా పాడి సాహితీ ప్రియులను పరవశింప చేశారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న ప్రతి సాహితీ సదస్సుకూ వారి నోట పాట విన్పించేలా సహకరిస్తున్నకిరణ్మయి,లెనిన్ దంపతులు అభినందనీయులు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు లెనిన్ వేముల తమ గురువు గారయిన వాణీ కుమారి ఎంచుకున్న మయూర సూర్యశతకంలోని మనసును రంజింప చేసే కొన్నిపద్యాలు వాటి విశిష్టతను సోదాహరణముగా వివరించి తమ పాండిత్య ప్రతిభను చాటుకొన్నారు. 


విశ్వనాధ సత్యనారాయణ వద్ద శిష్యరికం చేసి ప్రతిభావంతులైన హరనాద్ ముఖ్యఅతిధి వాణీకుమారి ప్రతిభను కొనియాడారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 177వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ముఖ్యఅతిథి డాక్టర్తు మ్మలపల్లి వాణీ కుమారి ''సూర్యశతకంలో రమణీయ వర్ణనలు'' అనే శీర్షికన అద్భుతమైన ప్రసంగము చేశారు. హర్షవర్ధనుని ఆస్థాన కవి బాణ భట్టుకి బంధువు సమకాలీకుడైన మయూరుడు తనకు వచ్చిన కుష్ఠువ్యాధిని నయము చేసుకొనడానికి భాస్కరుణ్ణి ఆరాధించడం తప్ప వేరేమార్గములేదని నమ్మి సూర్యుని పైభక్తితో రచించిన మయూర సూర్యశతకములోని కొన్ని ఆణిముత్యములవంటి పద్యములను చదివి భావార్థసహితముగా వ్యాఖ్యానము చేసి తన అద్భుతమైన ప్రసంగముతో సభికులను ఆకట్టుకున్నారు.


ప్రతి నెలనెలా తెలుగువెన్నెల కార్యక్రమంలో సత్యం ఉపద్రష్ట, రాధ కాశీనాధుని కలిసి పద్యసౌగంధం శీర్షిక నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. డాక్టర్ ఉపద్రష్ట సత్యం కమనీయమైన పద్యాల్ని చదివి సందర్భసహితవ్యాఖ్యతో సహా భావార్ధాలను సులభరీతిలో వివరించి పద్య కుసుమ సౌరభాలను వెదజల్లినారు. ఆధునిక సహజ పండితులు డా. ఊరు మిండి నరసింహారెడ్డి తాము 2018 నుండి నేటి వరకు సభకు హాజరవుతున్న వారినందరినీ భాగస్వాములను చేయాలన్నసత్సంకల్పముతో నెలనెలా నిర్వహిస్తున్న "మన తెలుగు సిరి సంపదలు" కార్యక్రమములో పొడుపు కథల మిళితమైన పద్యాలు చమత్కారగర్భితమైన శ్లోకాలు. పదభ్రమకాలు సోదాహరణముగా చెప్తూ సాహితీ ప్రియులకు రెండక్షరాల పదభ్రమకాలు, మూడక్షరాల పదభ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులను తీవ్రముగా ఆలోచింప చేసి వారి నుండి సరియైన పదభ్రమక సమాధానాలను రాబట్టే ప్రయోగం కొనసాగించారు. హాజరైన వారందరి మెదడుకు మేత వేసి సాహితీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపి అందరి ప్రశంసలనందుకొన్నారు. 


నేటి ''మాసానికో మహనీయుడు'' శీర్షిక క్రింద మే నెలలో జయంతి, వర్ధంతి జరుపుకొంటున్న ప్రముఖ కవుల వివరాల్నిఅధిక శ్రమకోర్చి సేకరించి ఆయా రచయితలను గుర్తుచేయడమేగాక ప్రముఖ కవులు బూదరాజు రాధాకృష్ణ, చలంగారి జీవిత విశేషాల్ని వారు వ్రాసిన రచనల్ని సవివరముగా వివరించిన డా. అరుణ జ్యోతి కోలా కృషి ప్రసంశనీయం. అంతర్జాతీయ మాతృదినోత్సం సందర్భంగా డా. అరుణ జ్యోతి కోలా, శ్రీగోవర్ధనరావు నిడిగంటి నేటి సమాజంలో ప్రతిఒక్కరూ తమ తల్లికి రుణపడి వున్న విషయాన్ని గుర్తుచే సుకున్నారు. గోవర్ధనరావు మాతృదినోత్సవం సందర్భంగా చిన్నికృష్ణుడి తల్లి యశోద ప్రేమను వివరిస్తూ చక్కగా పాడి వినిపించారు.


సంస్థ ప్రస్తుత అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి మాట్లాడుతూ మే 15న నిర్వహించనున్న మణిశర్మ లైవ్మ్యూజికల్కాన్సర్ట్: టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు గురించి తెలిపి పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతము చెయ్యాలని విన్నపము చేశారు. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ సభలోని సన్నివేశాలను ఎప్పటిలాగే తన కెమెరాలో బంధించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన ముఖ్యఅతిథి డాక్టర్ తమ్మల పల్లి వాణీ కుమారి జ్ఞాపికను బహుకరించారు. ప్రార్థనా గీతం పాడిన సాహితీ, సింధూతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలకమండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read more