Abn logo
Jan 27 2021 @ 01:29AM

ట్యాంకులు – ట్రాక్టర్లు

ఈఏడాది గణతంత్రదినోత్సవ వేడుకలు భిన్నంగా ఉంటాయని అనుకున్నదే. కరోనా కమ్మేసిన ఈ రోజుల్లో రాజ్‌పథ్‌లో గతకాలపు ఆర్భాటాలకు సందోహాలకు ఏ మాత్రం అవకాశం ఉండదనీ, నియంత్రణలూ పరిమితుల మధ్య కార్యక్రమం జరుగుతుందని అనుకున్నదే. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వీలుకాదని చివరినిముషంలో తేల్చేయడంతో అనేక దశాబ్దాల తరువాత విదేశీ అతిథి లేకుండానే వేడుక జరిగింది. బ్రిటన్‌లోకి కొత్తరకం కరోనా ప్రవేశంతో తాను అనుకున్నట్టుగా ఇండియా రాలేకపోయానంటూ ఆయన ప్రత్యేక అభినందన సందేశంలో వివరణ ఇచ్చారు. కొన్ని పరిమితుల మధ్య జరిగినా 2021 గణతంత్రవేడుకలు చక్కగా ముగిసినట్టే. ఇక ఇదేరోజున రైతులు సంకల్పించిన కిసాన్‌ పరేడ్‌ హద్దులుదాటి ఎర్రకోటవైపు పోకుండా ఉంటే బాగుండేది.


కరోనా నియంత్రణల నేపథ్యంలో ఈసారి ఆయా కంటింజెంట్లలో సైనికుల సంఖ్య తగ్గినా, త్రివిధ బలాల సైనిక కవాతులు చక్కగా సాగాయి. 1971నాటి బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధానికి యాభైయేళ్ళయిన సందర్భంగా ఆ దేశ సైనిక బృందం పరేడ్‌లో పాల్గొనడం విశేషం. త్రివిధ దళాల సైనికపాటవాల ప్రదర్శన, ఆయా రాష్ట్రాల చారిత్రక సంస్కృతీ వారసత్వాలను ప్రతిబింబించే శకటాల నడక ముచ్చటగొలిపాయి. భారత అమ్ములపొదిలో కొత్తగా చేరివచ్చిన రాఫెల్‌ విన్యాసాలు, రామమందిర శకటం ప్రత్యేక ఆకర్షణలు. ఎప్పటిలాగానే యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్‌ క్షిపణులు, రాకెట్‌ లాంచర్లు తదితర అస్త్రశస్త్ర ప్రదర్శనలూ జరిగాయి. దేశ సాంస్కృతిక సమున్నతనూ, సైనిక పాటవాన్ని ఈ వేడుకలు యావత్‌ ప్రపంచానికి చాటిచెప్పాయి. ఇక, ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఒక విశిష్ఠత ఉన్నదనీ, దేశరాజధానిలో ఒకపక్క ట్యాంకులు, మరోపక్క ట్రాక్టర్ల ప్రదర్శన జై జవాన్‌, జై కిసాన్‌ నినాదానికి ప్రతీకగా నిలవబోతున్నదంటూ కిసాన్‌ పరేడ్‌కు అనుమతిరాగానే విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ట్రాక్టర్‌ ర్యాలీ అనుకున్నట్టుగా సాగితే బాగుండేది. మార్గమధ్యంలో కొందరు రైతులు మనసునీ, మార్గాన్నీ మార్చుకొని ట్రాక్టర్లను ఎర్రకోటవైపు ఉరికించారు. అన్నదాతలను అదుపుచేయడానికి పోలీసులు లాఠీలూ బాష్పవాయువు గోళాలూ ప్రయోగించారు. అడుగడుగునా అడ్డుకొనే ప్రయత్నం చేసినా, అంతిమంగా రైతులు ఎర్రకోటను చుట్టుముట్టి దీర్ఘకాలంగా పేరుకుపోయి ఉన్న ఆగ్రహాన్నీ, నిరసనను ఇలా వెలిబుచ్చారు. 


ట్రాక్టర్ల ర్యాలీ అదుపుతప్పడానికి కారణం సంఘవిద్రోహశక్తులు తమ ఉద్యమంలోకి ప్రవేశించడమేనని రైతు నాయకులు అంటున్నారు. ర్యాలీ పక్కదోవపట్టడానికి కారకులు వీరేనంటూ ఒకరిద్దరిపేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వారు బింద్రేన్‌వాలా అనుచరులనీ, కాదు భారతీయ జనతాపార్టీ భక్తులనీ సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీ వాదనలు సాగుతున్నాయి. ఏది ఏమైనా, ఇంతటి భారీస్థాయిలో ఆందోళనలూ, ఉద్యమాలూ నెత్తికెత్తుకున్నవారిపై అవి పక్కదోవపట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. వేలాదిమంది ట్రాక్టర్లమీద తిరుగుతూ నిరసన తెలిపే కార్యక్రమాన్ని అదుపుతప్పకుండా నియంత్రించగలిగే శక్తిలేనివారు సంకల్పించకపోవడం మంచిది. రైతు ఆందోళన ప్రశాంతంగా సాగుతున్నప్పుడే పాలకులు హింసజరగవచ్చునంటూ ప్రచారం చేశారు. కేంద్రప్రభుత్వం న్యాయస్థానంలోనూ ఇదే వాదించింది. అయినా, ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి దక్కడంతో నిర్వాహకుల బాధ్యత మరింత పెరిగింది. పోలీసులతో ఒప్పందానికి వచ్చిన రూటు మార్చి, భద్రతావలయాలను ఛేదించుకుంటూ, అడ్డువచ్చిన వాహనాలను నెట్టుకుంటూ, నిలువరించబోతున్న పోలీసులపై వీరంగం వేస్తూ కొందరు రైతులు చేసిన ఈ ఘనకార్యం మొత్తం ఆందోళనకే అప్రదిష్ట తెచ్చిపెట్టే అవకాశాన్ని ఇచ్చింది. అనేక నెలలుగా, గడ్డకట్టిన చలిలో, పోలీసు దాడులకు సైతం వెరవకుండా వారు సమష్టిగా సాగించిన శాంతియుత పోరాటం వెనక్కుపోయి, ఇంతలోనే అందరినీ ద్రోహులుగా ముద్రవేసేందుకు ప్రత్యేక కృషి జరుగుతోంది. ఎర్రకోట ఎక్కినవారు రైతులు కాదు, ఉగ్రవాదులని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎర్రకోటమీద అసలు జెండాకు అవమానం జరిగినట్టుగా, అక్కడ ఖలిస్థాన్‌ జెండా పాతినట్టుగా దుష్ప్రచారం సాగింది. మువ్వన్నెల జెండా మాత్రమే ఎగరాల్సిన ఎర్రకోటమీద సిక్కుమత సూచికలను ఎగరవేయడం కచ్చితంగా తప్పే. ఎర్రకోటమీద మరేజెండాకూ స్థానం లేదు. ఈ ఘటనతో రైతు ఆందోళన కాస్త తప్పుదోవపట్టినట్టు కనిపించినా, నాయకత్వం ఈ ఉదంతాన్ని తీవ్రంగా నిరసించి, సాధ్యమైనంత వేగంగా ర్యాలీని ఉపసంహరించుకొని, ఇకపై ఉద్యమం శాంతియుతంగా నడుస్తుందని ప్రకటించినందుకు సంతోషించాలి.

Advertisement
Advertisement
Advertisement