తానా ఆధ్వర్యంలో ‘తనికెళ్ల భరణితో ముఖాముఖి’ కార్యక్రమం

ABN , First Publish Date - 2022-07-15T01:23:24+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్థానిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) సహకారంతో ఆదివారం ‘తనికెళ్ల భరణితో ముఖాముఖి’ కార్యక్రమం జరిగింది. అర్వింగ్‌లోని మైత్రీస్ బాంక్వెట్ హాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనం

తానా ఆధ్వర్యంలో ‘తనికెళ్ల భరణితో ముఖాముఖి’ కార్యక్రమం

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్థానిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) సహకారంతో ఆదివారం ‘తనికెళ్ల భరణితో ముఖాముఖి’ కార్యక్రమం జరిగింది. అర్వింగ్‌లోని మైత్రీస్ బాంక్వెట్ హాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో ప్రేక్షకులు హాజరయ్యారు. తానా డాలస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సభకు విచ్చేసిన భాషాభిమానులకు, ముఖ్యఅతిథి తనికెళ్ల భరణికి స్వాగతం పలికారు. డా. నల్లూరి ప్రసాద్ పుష్పగుచ్చం అందించి ఆహ్వానం పలికారు.


తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించి ముఖ్యఅతిథిని సభకు పరిచయం చేశారు. భరణి తన వృత్తి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు, ఒడిదుడుకులు, కష్ట సుఖాలు చవిచూశారన్నారు. వాటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు గనుకనే ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగారని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండి, తన మూలాలను మర్చిపోకుండా, తాను నడిచి వచ్చిన దారులను తరచూ తడిమి చూసుకునే గొప్ప మనస్తత్వం కల్గిన వ్యక్తి అని ప్రశంసించారు. దాదాపు 800 కి పైగా చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో, వైవిద్యభరితమైన నటనతో మూడు సార్లు నంది పురస్కారాలతోపాటు అనేక గౌరవాలు పొందారన్నారు. నాటక రచయిత, రంగస్థల నటుడు, సినీ సంభాషణా రచయిత, కవి, కథా రచయిత, సినీ నటుడు, సినీ నిర్మాత, సినీ దర్శకుడు తనికెళ్ళ భరణి‌కి స్వాగతం అంటూ వేదిక మీదకి ఆహ్వానించగానే  కరతాళధ్వనులు మిన్నంటాయి.

 


దాదాపు 2:30 గంటలకు పైగా ఉత్సాహంగా సాగిన కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు భరణి ఓర్పుగా, నేర్పుగా, వినోదాత్మకంగా సమాధానాలిచ్చారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు తెలుగు భాష నేర్పే క్రమం, తెలుగు భాష, సాహిత్యాలకిచ్చే ప్రాముఖ్యం ప్రసంశనీయం అన్నారు. అమెరికా నుంచి భారతదేశం వచ్చి తెలుగు నేర్చుకుని, అవలీలగా అవధానాలు చేయగల్గే స్థాయికి చేరుకున్న యువకుడు, ఆస్టిన్ నగరవాసి అవధాని గన్నవరం లలిత్ ఆదిత్య భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. ప్రవాసంలో నివసిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ఛందస్సు, వ్యాకరణం లాంటి సంక్లిష్టమైన అంశాలపై దృష్టిపెట్టకుండా సరళమైన తెలుగును పెద్దబాలశిక్ష నుంచి బోధిస్తే సరిపోతుందన్నారు. తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తి కోసం సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ తాను సంసిద్ధంగా ఉన్నానన్నారు. ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సన్నిహిత మిత్రులు, తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్‌కు, తానా, టాన్ టెక్స్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 



భరణి ఇటీవలే స్వయంగా రచించిన “శ్రీకాళహస్తి మహత్యం”, “కన్నప్ప కథ”, తాను వెలువరించిన బి.వి.ఎస్ శాస్త్రి రచించన ‘భోగలింగ శతకం’ నుండి కొన్ని పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందరినీ అలరించారు. కార్యక్రమం చివర్లో తానా, టాన్ టెక్స్ సంస్థల నాయకులు తనికెళ్ల భరణిని “బహుముఖ కళావల్లభ” అనే బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అన్ని విధాల సహకారం అందించిన లోకేష్ నాయుడు కొణిదల, డా. ప్రసాద్ నల్లూరి, గిరి గోరంట్ల, వెంకట్ బొమ్మా, సతీష్ మండువ, కుమార్ నందిగం, కృష్ణమోహన్ దాసరి, రవీంద్ర చిట్టూరి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, చలపతి కొండ్రగుంట లకు, మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి, ప్రసారమాధ్యమాలకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘానికి, ఆహ్వానాన్ని మన్నించి సభకు విచ్చేసిన  తనికెళ్ల భరణికి, భాషాభిమానులకు తానా డాలస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.



ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్య వికాసానికి తానాతో కలసి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధమేనంటూ, సభకు విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం ఇర్వింగ్ పట్టణంలోని అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారక స్థలాన్ని తనికెళ్ల భరణి సందర్శించారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించి, ఇంతటి బృహత్తర నిర్మాణానికి కారణమైన మహాత్మా గాంధీ మెమోరియల్ స్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్, ఆయన కార్యవర్గానికి శతకోటి వందనాలు తెలిపారు.


Updated Date - 2022-07-15T01:23:24+05:30 IST