రూ.2వేల కోట్లతో తాండూరును అభివృద్ధి చేశా

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

రూ.2వేల కోట్లతో తాండూరును అభివృద్ధి చేశా

రూ.2వేల కోట్లతో తాండూరును అభివృద్ధి చేశా
మైల్వార్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

  • ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

బషీరాబాద్‌, జూలై 3: తాను ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2వేల కోట్ల వరకు నిధులు తీసుకువచ్చి తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేసినట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పల్లె పల్లెకు పట్నం కార్యక్రమంలో భాగంగా బషీరాబాద్‌ మండలం మైల్వార్‌, కంసాన్‌పల్లి(బి) గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాను 1994 నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి పనిచేసినట్లు గుర్తుచేశారు. తన హయాంలోనే ఊరూరా మెటల్‌, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, బ్రిడ్జిలు తదితర అభివృద్ధి పనులు, నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మరిన్ని నిధులు తీసుకువచ్చి చేపట్టిన పనులకు ప్రస్తుతం కొందరు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, ఎవరెన్ని కథలు చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తాను ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే వ్యక్తిని కాదని, ప్రజల కోసం పనిచేసుకుంటూ వెళ్లడమే తనకు తెలిసిన సేవ అని అన్నారు.కొందరు తనపై ఏవేవో విమర్శలు చేస్తున్నారని, అవేమీ పట్టించుకోనని, ప్రజా సేవకుడిగా పనిచేస్తానన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్సీ, జెడ్పీ కోటాల కింద ఎన్ని నిధులైనా కేటాయించి దశలవారీగా మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సీమాసుల్తానా, వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కరుణం పురుషోత్తంరావు, జెడ్పీటీసీ మిర్యాణం శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎ.వెంకట్‌రాంరెడ్డి, వైస్‌చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, మాజీ వైస్‌ఎంపీపీ ఖాలెద్‌, పార్టీ సీనియర్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, గొట్టిగ శ్రీనివాస్‌రెడ్డి, పి.శంకర్‌రెడ్డి, పి.మాణిక్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌, చందర్‌నాయక్‌, రజాక్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST