Abn logo
Oct 19 2021 @ 23:37PM

తండా బడి.. విజయాల ఒడి

దొర్రి తండా పాఠశాల

మూతపడే స్థితి నుంచి జిల్లా స్థాయిలో పేరు వరకు..

ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుతో రూపు రేఖలు మార్చిన ఉపాధ్యాయుడు

నలుగురి నుంచి 67కు పెరిగిన విద్యార్థుల సంఖ్య

ఇక్కడ చదివిన వారిలో 42 మందికి గురుకులాల్లో సీట్లు

ఫలితంగా ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్తున్న వారంతా ఇక్కడే చేరిక

తమ పిల్లలనూ ఇక్కడే చదివిస్తున్న టీచర్లు

దొర్రి తండా పాఠశాల సక్సెస్‌ స్టోరీ


ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల హవాతో ఒకనాడు ఆ స్కూల్‌ మూతబడే పరిస్థితి ఉండేది. ఆ తండాలో చదువుకునే పిల్లల్లో నలుగురైదుగురు మినహా మిగిలిన వారంతా అటు పాలమూరులోని కాన్వెంట్‌కో, లేక ఇటు హన్వాడలోని ప్రైవేట్‌ స్కూల్‌కో ఆటోల్లో వెళ్లి చదువుకునే వారు. ఆ సందర్భంలో ప్రభుత్వం సైతం ఈ స్కూల్‌ను రద్దు చేయాలని ఆలోచించింది. ఈ క్రమంలో ఆ స్కూల్‌కు వచ్చిన ఓ ఉపాధ్యాయుడు మూతపడే ఆ స్కూల్‌కు జవసత్వాలను అందించాడు. అక్కడ ఇంగ్లిష్‌ మీడియంను ప్రారంభింపజేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎన్నో విజయాలకు వేదికైన మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం దొర్రితండా ప్రాథమిక పాఠశాల గురించి ‘ఆంధ్రజ్యోతి’ కథనం..

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


విద్యార్థులు లేక మూతపడే స్థితికి చేరుకున్న హన్వాడ మండలం దొర్రి తండా ప్రాథమిక పాఠశాల రూపు రేఖలను అక్కడ పని చేయడానికి వచ్చిన ఉపాధ్యాయుడు మల్లేశ్‌ మార్చాడు. పాఠశాలకు జిల్లా స్థాయి లో మంచి పేరు తెచ్చారు. మల్లేశ్‌ పాఠశాలకు 2015లో వచ్చారు. పాఠశాలలో ఆ సమయంలో కేవలం నలుగురు మాత్రమే విద్యార్ధులుం డేవారు. తండా  విద్యార్థులు ఆటోలలో ఇటు హన్వాడకో, అటు మహబూబ్‌ నగర్‌కో వెళ్లి ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదివేవారు. ఇక్కడున్న స్కూల్‌కు ముగ్గురు నలుగురు విద్యార్ధులు మాత్రమే వచ్చేవారు.  ఈ దశలో పాఠశాలను మూసివేసే పరిస్థితి నెలకొంది. ఇంగ్లిష్‌ మీడియం కోసమే తల్లిదండ్రులు పిల్లలను స్థానిక పాఠశాలకు కాకుండా బయట స్కూళ్లకు పంపుతునన్నారన్న వాస్తవాన్ని గుర్తించిన మల్లేశ్‌ అధికారులకు ఆవిషయం తెలియజేశారు. ఈ స్కూల్‌లో కూడా ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేయాలని కోరారు. ఈయన ప్రయత్నం ఫలించి, 2016-17 నుంచి స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభమైంది. ఆ సంవత్సరం తండాలో మల్లేశ్‌ ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి, 15 మంది విద్యార్థులను స్కూల్‌కు రప్పించారు. ఆ సంవత్సరం విద్యార్థుల ప్రతిభ కళ్లకు కొట్టిచ్చినట్లు కనిపించడంతో మరుసటి ఏడాది 35 మంది విద్యార్థులు స్కూల్‌లో చేరారు. 2017లో సమీపంలోని పలుగుతండా స్కూల్‌ను రద్దు చేసి, ఈ స్కూల్‌లోనే విలీనం చేశారు. దీంతో అక్కడి ఉపాధ్యాయుడు పుల్లయ్య కూడా ఈ స్కూల్‌కే వచ్చారు. వీరిద్దరూ కలిసి ముందుగా రెండు తండాల్లోని పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లకుండా కట్టడి చేయాలని నిర్ణయించుకొని ముందుకు సాగారు. ప్రైవేట్‌కు దీటుగా బోధన అందించేందుకు కృషి చేశారు. పాఠశాల వేళల అనంతరం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. గురుకుల సీట్ల కోసం పిల్లలకు వీరే స్వచ్ఛందంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీంతో తండావాసులు తమ పిల్లలను ఈ స్కూల్‌కే పంపుతున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ యేడాది 67కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 42 మందికి రెసిడెన్షియల్‌ స్కూళ్లలో సీట్లు దక్కడం పాఠశాల సాధించిన విజయానికి నిదర్శనం.


గురుకులాల్లో సీట్లు

ఈ పాఠశశాలలో చదివిన విద్యార్థుల్లో 2018లో ఆరుగురికి గురుకుల విద్యా సంస్థల్లో సీట్లు వచ్చాయి. 2019లో ముగ్గురికి, 2020లో 12 మందికి, 2021లో 21 మందికి సీట్లు దక్కాయి. ఇక్కడ చదివిన విద్యార్థులకు గురుకులాల్లో సీట్లు వస్తుండడంతో ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు అక్కడ మానుకొని, ఈ స్కూల్‌లో చేరుతున్న పరిస్థితి నెలకొంది.


ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం 

 ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృ ష్టిసారించడం వల్లే ఈ ఫలి తం వస్తోంది. రోజూ గంట ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తు న్నాం. కృత్యాధార పద్ధతిలో, గ ణితంలో కర్ర పుల్లలతో చదువు నేర్పిస్తున్నాం. ప్రభుత్వ కార్యా లయాలకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. వార్తా పత్రికల్లో వచ్చే అంశాలపై అవగాహన  కల్పిస్తున్నాం. మా పిల్లలను సైతం ఇదే స్కూళ్లో చదివిస్తున్నాం. గురుకులాల్లో ఎక్కువ సీట్లు రావడంతో మా పాఠశాలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది.

- మల్లేశ్‌, ఉపాధ్యాయుడు, దొర్రి తండా 


ప్రైవేట్‌ స్కూళ్లు మానుకుంటున్నారు..

మా పాఠశాలలో వస్తున్న ఫలితాలపై నమ్మకంతో తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకు మాన్పించి, ఇక్కడ చేర్పిస్తున్నారు. మల్లేశ్‌, నేను కలిసి ప్రతీ విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధన చేస్తున్నాం. ఈ స్కూల్లో పిల్లలంతా  గిరిజన పిల్లలు కావడంతో తెలుగు బాష చదవడం, రాయడం కొంత ఇబ్బంది ఉన్నా, దాన్ని అధిగమించాం. 

- పుల్లయ్య, టీచర్‌, దొర్రి తండా 

తరగతి గదిలో చదువుకుంటున్న విద్యార్థులు