తానా ఆధ్వర్యంలో 75ఏళ్ల స్వాతంత్ర్య భారతావనికి గానామృతాభిషేకం

ABN , First Publish Date - 2021-05-07T07:03:39+05:30 IST

భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ వినూత్న కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో దేశభక్తిపూర్వక సా

తానా ఆధ్వర్యంలో 75ఏళ్ల స్వాతంత్ర్య భారతావనికి గానామృతాభిషేకం

న్యూయార్క్: భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ వినూత్న కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో దేశభక్తిపూర్వక సాహిత్యంతో 75 మంది రచయితలు రాసిన 75 లలిత గీతాలను 75 మంది గాయనీ గాయకులతో ఆలపించేలా సన్నాహాలు చేస్తోంది. ఈ గీతాలను ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాలం ద్వారా ఆవిష్కరించి భారత 75వ స్వాతంత్య్ర వేడుకలను వైవిధ్యంగా, సంగీతభరితంగా ఘనంగా జరుపుకోనున్నట్టు తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఓ ప్రకటనలో తెలిపారు. 


డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఈ 75 లలిత గీతాలలో గతంలో అద్భుతమైన దేశభక్తి పూర్వక లలితగీతాలు రచించిన దేవులపల్లి, సినారె, దాశరధి, గిడుగు, బాలాంత్రపు, రాయప్రోలు, మల్లవరపు, కందుకూరి, ఇంద్రగంటి, వింజమూరి, శశాంక, కోపల్లె లాంటి ఎందరో మహానుభావుల గీతాలు, ఈ తరం రచయితలైన వోలేటి, వడ్డేపల్లి, కలగా, రసమయి రాము, వారణాశి, బాపురెడ్డి, బలభద్రపాత్రుని మధు, సుధామ గార్లు రాసిన గీతాలను, ప్రముఖ సినీ గేయ రచయితలు సుద్దాల, జొన్నవిత్తుల, అనంత శ్రీరామ్, భువనచంద్ర, భారవి, సిరాశ్రీ, కాసర్ల మొదలైన వారి లలిత గీతాలతో పాటు నవతరం రచయితల గీతాలు కూడా ఉంటాయన్నారు.




లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ అధినేత కొమండూరి రామాచారి నిర్వహణలో ఈ లలిత గీతాలకు స్వరకల్పన చేసి, వివిధ దేశాలలో ఉన్న 75 మంది ఉత్తమ గాయనీగాయకులచే గానం చేయిస్తారని, మధురా ఆడియో కంపెనీ అధినేత శ్రీధర్ రెడ్డి సారథ్యంలో ఈ గీతాలకు కావలిసిన అన్ని హంగులను సమకూర్చి వీడియో రూపంలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఆగస్ట్ 15న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అంతర్జాలంలో అంతర్జాతీయ స్థాయిలో అందరికి ఉచితంగా అందుబాటులో ఉండేటట్లుగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా యూట్యూబ్‌లో ఈ 75 లలిత గీతాలను విడుదల చేస్తామని వెల్లడించారు. 


సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘ఆసక్తి ఉన్న రచయితలు 1.భారతీయ సంస్కృతి 2. దేశభక్తి స్ఫూర్తి 3.జాతీయోద్యమ సంఘటనలు 4. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం అనే ఏ ఇతివృత్తంతో అయినా ఒక పల్లవి, రెండు చరణాలకు మించని లలిత గీతాలను ఎ4 సైజులో వచ్చేటట్లుగా వ్రాసి, ఈ రచన మీ సొంతమని రాతపూర్వకంగా ధృవీకరిస్తూ, మీ చిరునామా, ఫోన్ నెంబర్ తెలియపరుస్తూ మే 20, 2021 గడువు తేదీ లోగా +91-91210 81595కు వాట్సప్ ద్వారా పంపాలి’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా నిర్ణాయక సంఘం మీ రచనను పరిశీలించి, ఎంపిక చేసినట్లయితే ఆ విషయాన్ని మీకు జూలై 15వ తేదీలోపు తెలియజేస్తామని, తుది నిర్ణయం నిర్ణాయక సంఘానిదే అన్నారు.


Updated Date - 2021-05-07T07:03:39+05:30 IST