తానా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-07-07T01:41:24+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారైలను

తానా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్‌ ఏర్పాటు

కర్నూలు: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారైలను సమన్వయపరచడానికి కర్నూలు ఎన్. ఆర్.ఐ. ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేసినట్లు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో స్థిరపడిన కర్నూలు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు, తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు. కర్నూలు ఎన్. ఆర్.ఐ. ఫౌండేషన్ సంస్థను లాభాపేక్ష లేని సంస్థగా రిజిస్టర్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురష్కారాలు అందజేస్తామని పొట్లూరి రవి తెలిపారు. మరోపక్క దాదాపు పదివేల మంది పేద మహిళలతో బాల భారతి పాఠశాల ద్వారా ప్రతి సంవత్సరం వంద(100) మంది అనాథ విద్యార్థులకు విద్యనందించే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. బాల భారతి పాఠశాల దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఓర్వకల్ మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘానికి చెందినదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం పది లక్షల రూపాయలు అందించనున్నామని, మరిన్ని వివరాలకు kurnoolnrifoundation@gmail.comను సంప్రదించాల్సిందిగా కోరారు. 


కరోనా సమయంలో సేవలందించిన కర్నూలు ఎన్. ఆర్.ఐ. ఫౌండేషన్ 

కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులకు గురైన పేదలను ఆదుకునేందుకు తొలుత కరోనా వైరస్‍ నుంచి రక్షణకోసం అందరికీ మాస్కులు, శానిటైజర్లను ఫౌండేషన్ సభ్యులు పంచి పెట్టారు. ఏప్రిల్‍ 11వ తేదీన తొలుత కర్నూలులో మాస్కులు పంపిణీ చేశారు. కర్నూలు పట్టణ కమిషనర్‍ రవీంద్ర బాబు చేతుల మీదుగా కర్నూల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍‌లో ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేయించారు. కర్నూలు జిల్లాలో పదివేలకు పైగా మాస్కులు అందించారు. కర్నూలులో శ్రీ బాలాజీ క్యాంటీన్‍ సహకారంతో లాక్‍ డౌన్‍ విధించిన నాటి నుంచి కర్నూలు నగరంలోని పారిశుధ్య కార్మికులకు, నిరాశ్రయులకు, జాతీయ రహదారి మీద వెళ్తున్నవలస కార్మికులు.. ఇలా దాదాపు 30,000 మందికి భోజనాలు అందజేశారు. తానా ఫౌండేషన్‍ సహకారంతో జిల్లాలో పెద్దఎత్తున నిత్యావసర వస్తువుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మే 18వ తేదీన కర్నూలు ఓల్డ్ సిటీలో ఉన్న దాదాపు నాలుగు వేల కుటుంబాలకు కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‍ఖాన్‍ ఈ వస్తువులను పంపిణీ చేశారు. మే 21న పాణ్యం మండలంలోని సుగాలి మిట్ట, రాంభూపాల్‍ తండా తదితర గ్రామాల్లోని దాదాపు రెండువేల కుటుంబాలకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి ద్వారా నిత్యావసర సరుకులను అందజేశారు.

Updated Date - 2020-07-07T01:41:24+05:30 IST