‘తమ్మినేని’ స్వార్థంతోనే కళాశాల మార్పు

ABN , First Publish Date - 2022-06-27T06:09:45+05:30 IST

దశాబ్దాల చరిత్ర కలిగిన ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మహిళా కళాశాలగా ప్రభుత్వం మార్పు చేస్తూ జీవో 85ను జారీ చేయడంపై టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘తమ్మినేని’ స్వార్థంతోనే కళాశాల మార్పు
మాట్లాడుతున్న రవికుమార్‌:


  మాట తప్పడం జగన్‌రెడ్డికే సాధ్యం


  టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు రవికుమార్‌


ఆమదాలవలస, జూన్‌ 26: దశాబ్దాల చరిత్ర కలిగిన ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మహిళా కళాశాలగా ప్రభుత్వం మార్పు చేస్తూ జీవో 85ను జారీ చేయడంపై టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యుడు తమ్మినేని సీతారాం స్వార్థంతోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మహిళా కళాశాలగా ప్రభుత్వం మార్పు చేసిందని ఆరోపించారు.  ఆదివారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమదాలవలస జూనియర్‌ కళాశాలను పాత పద్ధతిలోనే కొనసాగించేందుకు కలెక్టర్‌ చొరవ చూపాలని  కోరారు.  తమ్మినేని అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఒక్క ప్రయోజనం చేకూరలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బూర్జ మండలంలోని పెద్దపేట విత్తనాభివృద్ధిక్షేత్రం వద్ద వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు ఆలోచిస్తే, నేడు పాలిటెక్నిక్‌ కళాశాలను తొగరాం ఇసుక దిబ్బలపై ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వ్యవసాయ విద్యార్థులు ఇసుకు దిబ్బలపై ప్రాక్టికల్స్‌ చేస్తారా అని రవికుమార్‌ ప్రశ్నించారు. మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్‌రెడ్డికే సాధ్యమన్నారు. సమావేశంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, పార్టీ మండలాధ్యక్షుడు నూకరాజు, నాయకులు తమ్మినేని అమర్‌నాఽథ్‌, జి.రామ శంకర్‌ పాల్గొన్నారు.


 



Updated Date - 2022-06-27T06:09:45+05:30 IST