తమిళనాడు కొత్త గవర్నర్‌‌గా కేంద్ర మంత్రి!?

ABN , First Publish Date - 2021-06-22T14:54:22+05:30 IST

ప్రస్తుత గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో..

తమిళనాడు కొత్త గవర్నర్‌‌గా కేంద్ర మంత్రి!?

  - 2 నెలల్లో ముగియనున్న పురోహిత్‌ పదవీకాలం  

  - పరిశీలనలో ఇద్దరి పేర్లు ?


అడయార్‌(చెన్నై): ప్రస్తుత గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఇక్కడకు కొత్త గవర్నర్‌ను పంపాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పురోహిత్‌ పదవీ కాలం పొడిగించడం పట్ల కేంద్రం పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో కొత్త గవర్నర్‌ రావడం దాదాపు ఖాయమైనట్టేన ని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర న్యాయశాఖా మంత్రిగా ఉన్న రవిశంకర్‌ ప్రసాద్‌తో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత ఒ.రాజగోపాలన్‌ పేర్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశీలిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో రవిశంకర్‌ ప్రసాద్‌ గతంలో దివంగత ముఖ్య మంత్రి జయలలితకు న్యాయ సలహాదారుడిగా వ్యవహరించారు.


పైగా ఆమె బాగా నమ్మిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అలాగే, ఒ.రాజగోపాలన్‌ పేరు కూడా గట్టిగానే వినవస్తోంది. అయితే ఆయన వయస్సు 90 యేళ్ళు దాటిందని, అందువల్ల ఆయనకు ఆ అవకాశం లేనట్టేనని బీజేపీలోని మరో వర్గం వ్యాఖ్యానించింది. ప్రస్తుత గవర్నర్‌ పురోహిత్‌ రాష్ట్ర గవర్నరుగా 2017 అక్టోబరు నెల 6వ తేదీన నియమితులయ్యారు. అంతకుముందు ఆయన 2016 ఆగస్టు 22న అసోం గవర్నరుగా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌కు చెందిన పురోహిత్‌.. ఓ పత్రికాధిపతి. ఈయన అటు కాంగ్రెస్‌, ఇటు భారతీయ జనతా పార్టీల్లో అనేక కీలకమైన పదవుల్లో ఉన్నారు.


ఈయన రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి సోమవారం తన చివరి ప్రసంగం చేశారు. దీంతో కొత్త గవర్నర్‌ ఎవరన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా త్వరలో ఏడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. కొత్తగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలో సర్వానంద్‌ సోనోవాల్‌, సుశీల్‌ మోదీ, వరుణ్‌ గాంధీ, అనుప్రియా పటేల్‌, జ్యోతిరాదిత్య సింథియా వంటివారికి స్థానం కల్పించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అలాగే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొంద రిని తొలగించి పార్టీ బాధ్యతలను అప్పగించాలన్న కోణంలో ఆలోచన చేస్తున్నారు.


ఆ కోవలో రాష్ట్ర గవర్నరుగా రవిశంకర్‌ ప్రసాద్‌తో పాటు రాజగోపాలన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో రవిశంకర్‌ ప్రసాద్‌కు రాష్ట్ర రాజకీయాలు కొత్తకాదు. ఈయన రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకకు చెందిన నేతలతో సత్సంబంధాలున్నాయి. ఇదిలా వుండగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు నేతలు రాష్ట్ర గవర్నర్‌గా వచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే వారు అమిత్‌షాతోనూ భేటీ కానున్నారని, ఆ తరువాతే వారి పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశ ముందని సమాచారం.



Updated Date - 2021-06-22T14:54:22+05:30 IST