‘నా తల్లిని కించపరిచేలా మాట్లాడటం న్యాయమేనా’

ABN , First Publish Date - 2021-03-29T13:20:52+05:30 IST

డీఎంకేకు మాతృమూర్తులపై మమకారం లేదని, తన తల్లిని కించపరిచేలా విమర్శలు చేయడం భావ్యమేనా అంటూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

‘నా తల్లిని కించపరిచేలా మాట్లాడటం న్యాయమేనా’


  - ప్రచారపర్యటనలో ఎడప్పాడి ఆవేదన


చెన్నై: డీఎంకేకు మాతృమూర్తులపై మమకారం లేదని, తన తల్లిని కించపరిచేలా విమర్శలు చేయడం భావ్యమేనా అంటూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే ఎంపీ రాజా ముఖ్యమంత్రి మాతృమూర్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నగరంలోని కొళత్తూరు, తిరువొత్తియూరు, రాయపురం తదితర ప్రాంతాల్లో ప్రచారం సాగించారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ డీఎంకే నాయకులు ఓ పథకం ప్రకారం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారికి తల్లులంటే ఏ మాత్రం గౌరవం లేదని తన తల్లిని కూడా విమర్శించారంటూ కాసేపు కంటతడిపెట్టుకున్నారు. మాటలను కొనసాగించలేక ఆయన కంఠస్వరం కాసేపు మూగపోయింది. ఆ తర్వాత తేరుకుని ఎడప్పాడి మాట్లాడుతూ తన తల్లి గ్రామంలో జన్మించిందని, తన కోసం తన కుటుంబ సభ్యుల కోసం రాత్రనక పగలనగా కష్టపడి పెంచి పోషిందని, ఆమె ఇటీవలే కన్నుమూసిందని, ఈ పరిస్థితుల్లో ఆమెను కించపరిచేలా డీఎంకే నాయకులు విమర్శించడం తగునా? అని ప్రశ్నించారు. 

రాయపురంలో మంత్రి జయకుమార్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రచారం చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయకుమార్‌ తన నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రమంతటా అభివృద్ధి పనులు అమలు చేసేందుకు పాటుపడ్డారని ప్రశంసించారు. రాయపురంలో అధికంగా నివసించే జాలర్ల సంక్షేమం కోసం జయకుమార్‌ పలు సంక్షేమ పథకాలను అమలు చేశారని, స్థానిక ప్రజలతో ఎల్లప్పుడూ సన్నిహితంగా మెలిగే ఆయన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమని చెప్పారు.

Updated Date - 2021-03-29T13:20:52+05:30 IST