పావులు కదుపుతున్న చిన్నమ్మ

ABN , First Publish Date - 2021-10-28T15:54:15+05:30 IST

అన్నాడీఎంకేలో తన పలుకుబడిని పెంచుకునే దిశగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల రోజున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తానేనంటూ శిలా

పావులు కదుపుతున్న చిన్నమ్మ

-  1న మద్దతుదార్లతో శశికళ మంతనాలు

- మూడురోజులు తంజావూరులో మకాం

- అన్నాడీఎంకే నేతలకు గాలం?

- ఆమెను కలిస్తే వేటు తప్పదు: అధిష్ఠానం హెచ్చరిక


చెన్నై(Tamilnadu): అన్నాడీఎంకేలో తన పలుకుబడిని పెంచుకునే దిశగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల రోజున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తానేనంటూ శిలాఫలకం సాక్షిగా ప్రకటించుకున్న శశికళ.. ప్రస్తుతం పార్టీ శ్రేణులను కలుసుకునే నిమిత్తం దక్షిణాది జిల్లాల వైపు పర్యటన సాగిస్తున్నారు. శశికళ రాష్ట్ర పర్యటనను ప్రారంభించే సమ యంలో అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం ఆమెను మళ్ళీ పార్టీ లో చేర్చుకునే విషయాన్ని ప్రస్తావించి తీవ్ర కలకలం సృష్టించారు. పన్నీర్‌ సెల్వం వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చెన్నై నుంచి అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో శశికళ రాష్ట్ర పర్యటన ప్రారంభించారు. శశికళతోపాటు 20 కార్లలో ఆమె అనుచరులు కూడా బయల్దేరారు. బుధవారం ఉదయం అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్‌ కుమార్తె వివాహ రిసెప్షన్‌ వేడుకలకు శశికళ హాజరయ్యారు. ఆ సందర్భంగా అన్నా డీఎంకే స్థానిక నేతలు కొందరు ఆమెకు పుష్పగుచ్ఛాలందించి స్వాగతం పలికారు. బుధవారం రాత్రి తంజావూరులోనే ఆమె బసచేశారు. ఆ సందర్భంగా అన్నాడీఎంకే స్థానిక నేతలు కొందరు ఆమెను కలుసుకున్నారు. గురువారం ఆమె మదురై  వెళ్ళి అక్కడి స్టార్‌హోటల్‌లో బసచేయనున్నారు. ఆ సందర్భంగా మదురైకి చెందిన అన్నాడీఎంకే సీనియర్‌ నేతలతో ఆమె చర్చించనున్నట్టు సమాచారం. ఈ విషయమై శశికళ మద్దతుదారులు మదురైలోని అన్నాడీఎంకే అసంతృప్త నేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు.


మాజీ మంత్రులకు ఆహ్వానం: తంజావూరులో మూడు రోజులపాటు బసచేయనున్న శశికళ అన్నాడీ ఎంకేకు చెందిన సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులను తన వర్గంలోకి లాగేందుకు మద్దతుదారుల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యం గా మాజీ మంత్రులు రాజేంద్ర బాలాజీ, ఉదయకుమార్‌, దిండు గల్‌ శ్రీనివాసన్‌, రాజన్‌ చెల్లప్ప సహా 50 మంది నేతలను ఇప్పటి కే తన అనుచరుల ద్వారా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. శుక్రవా రం ఉదయం శశికళ మదురైలో పసుంపొన్‌ ముత్తురామలింగ దేవర్‌ నివాళి తదితర కార్యక్రమాల్లో పాల్గొంటా రు. శనివారం ఉదయం మళ్ళీ ఆమె తంజా వూరుకు తిరిగి వస్తారు. మూడు రోజులపాటు అక్కడే బసచేసి తన మద్దతుదారులతో చర్చలు జరిపి, అన్నాడీఎంకే నేతలను తన వర్గం వైపు లాగేందుకు ప్రయత్నించనున్నారు. నవంబర్‌ ఒక టిన తంజావూరులో నాలుగు జిల్లాలకు చెందిన తన మద్దతుదారులు, అన్నాడీఎంకే అసంతృప్త నాయకులతో శశికళ సమావేశం కానున్నారు. అన్నాడీఎంకేపై పట్టు బిగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాయకులతో మంతనాలు జరుపుతారు. మూడు రోజుల పాటు ఆమె స్థానికనాయకులతో విడివిడిగా చర్చలు జరుపుతారు.


ఓపీఎస్‌ మనసులోని మాటే చెప్పారు - దినకరన్‌: శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునే విషయమై మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం తన మనసులోనే మాటే చెప్పారని అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్‌ తెలిపారు. తంజావూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పన్నీర్‌సెల్వం ఎల్లప్పుడూ న్యాయం వైపే ఉంటారని, ఆ దిశగానే శశికళను పార్టీలో చేర్చుకునే విషయం గురించి వ్యాఖ్యానించారని చెప్పారు. అన్నాడీఎంకేకు దుష్టశక్తుల నుంచి విముక్తి కలిగించేందుకే తాను పార్టీ పెట్టానని, శశికళ ప్రస్తుతం ఆ లక్ష్య సాధనవైపే పయనిస్తున్నారని చెప్పారు. 


నో ఛాన్స్‌ - ఆది రాజారాం: శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునే అవకాశమే లేదని ఆ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి ఆది రాజారాం స్పష్టం చేశారు. టి.నగర్‌లో బుధవారం ఉదయం పార్టీ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ... శశికళ వ్యవహారం ముగి సిన అధ్యాయమని చెప్పారు. అట్టడుగు కార్యకర్త కూడా ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడని చెప్పారు. పన్నీర్‌సెల్వం కూడా శశికళను పార్టీలో చేర్చుకునేందుకు ఇష్టపడరని చెప్పారు.

వేటు తప్పదు - జయకుమార్‌ హెచ్చరిక: తమ పార్టీ కార్యకర్తలెవరైనా శశికళ వైపు వెళ్తే కఠిన చర్యలు తప్పవమని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్‌ హెచ్చరించారు. గతంలో శశికళతో ఫోన్‌లో మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహి ష్కరించామని, ప్రస్తుతం అదే రీతిలోనే ఆమెతో సన్నిహిత సంబందాలు పెట్టుకునే నాయ కులపై వేటు పడకతప్పదని అన్నారు. అన్నాడీఎంకే ఎల్లప్పుడూ పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. శశికళతో ఫోన్‌లో మాట్లాడినా, ఆమె పర్యటనలో, సభల్లో పాల్గొన్నా పార్టీ నుంచి తొలగించడం ఖాయమని జయకుమార్‌ చెప్పారు.


న్యాయనిపుణులతో చర్చలు: శశికళపై అన్నాడీఎంకే నేతలు చేసిన ఫిర్యాదుపై మాంబళం పోలీసులు న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఏయే సెక్షన్ల ప్రకారం శశికళ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న విషయంగా వారు గత కొద్ది రోజులుగా న్యాయనిపుణులతో మంతనాలు జరుపుతున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని తానేనంటూ శిలాఫలకం ఆవిష్కరించిన శశికళపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి జయకుమార్‌ మాంబళం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుపై మాంబళం పోలీసులు ఇప్పటికిప్పుడు శశికళపై చర్యలు తీసు కునే అవకాశం లేదని తెలుస్తోంది. బెంగళూరు జైలు నుంచి విడుదలైన తర్వాత చెన్నైకి అన్నాడీఎంకే జెండా వున్న కారులో శశికళ ప్రయాణిం చడం పై కూడా ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎవరనే విషయంపై తలెత్తిన వివాదం ప్రస్తుతం చెన్నై సిటీ సివిల్‌ కోర్టులో విచారణ జరుగు తోంది. ఈ కారణంగానే పోలీసులు శశికళపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడు తున్నారని తెలుస్తోంది.

Updated Date - 2021-10-28T15:54:15+05:30 IST