Firecrackers: 2 వేల కేసులు పెట్టిన తమిళనాడు పోలీసులు

ABN , First Publish Date - 2021-11-06T16:42:21+05:30 IST

దీపావళి సందర్భంగా తమిళనాడులో ఆ ఒక్కరోజే 2000 కేసులు నమోదయ్యాయి. టపాసులు కాల్చేందుకు రెండు గంటల టైమ్‌‌ స్లాబ్‌ను సుప్రీంకోర్టు కోర్టు ఫిక్స్ చేసింది.

Firecrackers: 2 వేల కేసులు పెట్టిన తమిళనాడు పోలీసులు

చెన్నై: దీపావళి సందర్భంగా తమిళనాడులో ఆ ఒక్కరోజే 2000 కేసులు నమోదయ్యాయి. టపాసులు కాల్చేందుకు రెండు గంటల టైమ్‌‌ స్లాబ్‌ను సుప్రీంకోర్టు కోర్టు ఫిక్స్ చేసింది. కాగా.. దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారితో పాటు రెండు గంటల టైమ్ స్లాబ్‌కు మించి టపాసులు కాల్చిన వారిపై తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాష్ట్రం మొత్తమ్మీద ఈ రెండు ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 2000 కేసులు నమోదు చేయడం గమనార్హం.  


కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఉత్పత్తులను విక్రయించిన లేదా నిల్వ చేసిన బాణాసంచా దుకాణాలు లేదా యూనిట్లపై కూడా తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. నవంబర్ 4, దీపావళి సందర్భంగా టపాసులు కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు రెండు గంటలు మాత్రమే అనుమతిచ్చింది. అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య మాత్రమే కాల్చుకునేందుకు సమయం ఇచ్చింది. 


అక్టోబర్ 29న ఇతరుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి వేడుకలు జరపకూడదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే బాణసంచా వాడకంపై పూర్తి నిషేధం లేనప్పటికీ, బేరియం లవణాలు కలిగిన బాణసంచాపై సుప్రీం నిషేధం విధించింది. తాము జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి, వేడుకల ముసుగులో నిషేధిత బాణసంచా కాల్చడాన్ని ఏ అధికారి అనుమతించరాదని న్యాయమూర్తులు ఎం.ఆర్ షా, ఏఎస్ బోపన్నాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.  


Updated Date - 2021-11-06T16:42:21+05:30 IST