చెన్నై : తమిళనాడు పోలీసులు 3,325 మంది హిస్టరీ షీటర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 1,117 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఏడు దేశవాళీ పిస్తోళ్లు ఉన్నాయి. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీ శైలేందర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.
రాష్ట్రంలో ఇటీవల వరుసగా హత్యలు జరుగుతుండటంతో డీజీపీ ఈ ఆదేశాలు ఇచ్చారు. గురువారం నుంచి నిర్వహించిన కార్యకలాపాల్లో 3,325 మంది హిస్టరీ షీటర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 1,117 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. 21,592 మందికి నేర నేపథ్యం ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. పూచీకత్తులు సమర్పించిన మీదట 2,526 మందిని కస్టడీ నుంచి విడుదల చేసినట్లు వివరించారు.
గ్రేటర్ చెన్నై పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ముగ్గురు హై ప్రొఫైల్ క్రిమినల్స్‌ను అరెస్టు చేశారు. వీరిలో వెల్లూరుకు చెందిన ఆర్కాట్ సురేశ్ కూడా ఉన్నారు. ఆయనపై 5 హత్య కేసులు, 15 ఇతర కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.