రాష్ట్రంలో 6.36 కోట్ల మంది ఓటర్లు

ABN , First Publish Date - 2022-01-06T14:23:09+05:30 IST

రాష్ట్రంలో 6.36 కోట్ల మంది ఓటర్లున్నట్లు ఎన్నికల కమిషన్‌ తేల్చింది. గతంలోలాగే ఈసారి కూడా మహిళా ఓటర్లే అధికంగా వుండడం విశేషం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు బుధవారం విడుదల చేసిన

రాష్ట్రంలో 6.36 కోట్ల మంది ఓటర్లు

- పురుషులు 3,12,26,759, మహిళలు 3,23,91,250, ఇతరులు 7,804

- చెన్నైలో 40,80,578 మంది ఓటర్లు


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో 6.36 కోట్ల మంది ఓటర్లున్నట్లు ఎన్నికల కమిషన్‌ తేల్చింది. గతంలోలాగే ఈసారి కూడా మహిళా ఓటర్లే అధికంగా వుండడం విశేషం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు బుధవారం విడుదల చేసిన సవరించిన తుది ఓటర్ల జాబితాలో ఈ వివరాలను వెల్లడించారు. 1.1.2022 తేదీ అర్హతగా చేపట్టిన ఫొటోతో కూడిన ఓటరు జాబితా ప్రత్యేక విధానంలో రూపొందింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో మొత్తం 10,36, 917 దరఖాస్తులు రాగా, వాటిలో 10,17,456 మంది దరఖాస్తులను ఎన్నికల కమిషన్‌ ఆమోదించింది. ఈ సవరించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 6,36,25,813 మంది ఓటు హక్కు కలిగి వున్నట్లు తేలింది. వీరిలో పురుషులు 3,12,26,759 మంది, మహిళలు 3,23,91,250, ఇతరులు 7,804 మంది వున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన అసెంబ్లీ నియోజకవర్గంగా చెంగల్పట్టు జిల్లాలోని షోళింగనల్లూరు రికార్డులకెక్కింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 7,11,755 మందికి ఓటు హక్కు వుండగా, వీరిలో పురుషులు 3,56,239 మంది, మహిళలు 3,55,394 మంది, ఇతరులు 122 మంది వున్నారు. అత్యల్ప ఓటర్లు నాగపట్నం జిల్లాలోని కీల్‌వేలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వున్నారు. ఇందులో మొత్తం 1, 78,517 మంది ఓటర్లుండగా, పురుషు లు, 86,893 మంది, మహిళలు 91,613 మంది, ఇతరులు 11 మంది వున్నారు. ఆ తరువాతి స్థానంలో చెన్నై జిల్లాలోని హార్బర్‌ నియోజకవర్గం వుంది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 4,88,888 మందిని ప్రత్యేక ప్రతిభా వంతులుగా గుర్తించి, ఓటరు జాబితాలో చేర్చారు. 18-19 ఏళ్లలోపున్న 4,32,600 మందిని కొత్తగా జాబితాలో చేర్చారు. ఓటర్లు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ పేర్లను పరిశీలించుకోవచ్చు. 1.1.2022 నాటికి 18 ఏళ్లు పూర్తయిన వారి పేర్లు ఓటరు జాబితాలో లేకపోతే, కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్రంలో వున్న అన్ని జిల్లాల్లో విచారణ కేంద్రాలు కూడా అందుబాటులో వున్నాయి. అంతేకాకుండా 1950 అనే టోల్‌ఫ్రీ నెంబరులో సంప్రదించి, ఎన్నికల ఓటరు జాబితాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో 1800-4252-1950 అనే టోల్‌ఫ్రీ నెంబరు 24 గంటలు పనిచేస్తుందని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.


చెన్నైలో 40,80,578 మంది ఓటర్లు

రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలోని 16 నియోజవకవర్గాలకు సంబంధించి సవరించిన తుది ఓటరు జాబితాను అఖిలపక్ష నేతల సమక్షంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ (జీసీసీ) గగన్‌దీప్‌సింగ్‌ బేదీ బుధవారం విడుదల చేశారు. జీసీసీ ప్రధాన కార్యాలయమైన రిప్పన్‌ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంకే, అన్నాడీ ఎంకే, కాంగ్రెస్‌, బీజేపీ తదితర అఖిలపక్ష నేతలంతా హాజరయ్యారు. 

ఈ జాబితాలోని వివరాల ప్రకారం నగరంలో మొత్తం 40,80,578 మంది ఓటర్లుండగా, ఇందులో పురుషులు  20,04,860 మంది, మహిళలు 20,74,616 మంది, ఇతరులు 1002 మంది ఓటు హక్కు కలిగివున్నారు. గత ముసాయిదా ఓటరు జాబితాలోని ఓటర్ల సంఖ్య కంటే ప్రసుత్తం విడుదల చేసిన తుది ఓటరు జాబితాలో అదనంగా 26,540 మంది ఓటు హక్కు కలిగి వున్నారు. ఇది 0.65 శాతం అధికమని అధికారులు తెలిపారు. నగరంలో తక్కువమంది ఓటర్లున్న నియోజకవర్గంగా హార్బర్‌, అత్యధిక ఓటర్లున్న నియోజక వర్గంగా వేళచ్చేరి నిలిచాయి. 

Updated Date - 2022-01-06T14:23:09+05:30 IST