TNCC రేసులో జ్యోతిమణి, కార్తీ

ABN , First Publish Date - 2022-01-19T15:54:54+05:30 IST

రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవిపై ఏఐసీసీ అధిష్టానవర్గం దృష్టి సారిస్తోంది. ఫిబ్రవరిలో కొత్త నేతను ఎంపిక చేయడానికి సంసిద్ధమవుతోంది. టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్‌ ఎంపీలు జ్యోతిమణి, కార్తీ చిదంబరం తదితరులు తీవ్ర ప్రయత్నాలు సాగి

TNCC రేసులో జ్యోతిమణి, కార్తీ

                          - వచ్చే నెలలో కొత్తనేత ఎంపిక


చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవిపై ఏఐసీసీ అధిష్టానవర్గం దృష్టి సారిస్తోంది. ఫిబ్రవరిలో కొత్త నేతను ఎంపిక చేయడానికి సంసిద్ధమవుతోంది. టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్‌ ఎంపీలు జ్యోతిమణి, కార్తీ చిదంబరం తదితరులు తీవ్ర ప్రయత్నాలు సాగి స్తున్నారు. ప్రతి మూడేళ్ల కొకమారు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొత్తవారిని ఎంపిక చేయడం ఆనవాయితీ. ప్రస్తుత టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తన మూడేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా, ఎలాంటి వివాదాలు, పార్టీలో ముఠా కక్షలకు తావులేని విధంగా అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ అభివృద్ధికి విరివిగా పాటుపడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా యేడాదిలోపే అధ్యక్షుడిని మార్చాలంటూ అసమ్మతి నాయకులు అధిష్టానంపై ఒత్తిడి చేయడం పరిపాటి. అయితే కేఎస్‌ అళగిరి విషయంలో పార్టీ అధిష్టానంపై ఎవరూ ఎలాంటి ఫిర్యాదులుచేయలేదు. అళగిరి హయాంలోనే అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. డీఎంకే కూటమిలో ఈ మూడు ఎన్నికల్లోనూ అవసరమైన సీట్లను సంపాదించటంలో అళగిరి కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకించి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సన్నిహిత సంబంధాలను పెంచుకుని అడిగినంత సీట్లను సంపాదించుకోగలిగారు. డీఎంకే కూటమిలోని మిత్రపక్షాలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. డీఎంకే అధికారంలోకి రాక ముందు అన్ని పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై జరిగిన ఆందోళనల్లో పార్టీ శ్రేణులను తరలించి తాను కూడా పాల్గొని పార్టీకి మంచిపేరు సంపాదించిపెట్టారు. ఈ మూడేళ్లు అధిష్టాన వర్గం కూడా అళగిరిపై ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయకపోవడం గమనార్హం. పార్టీ జాతీయ నేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలతోనూ అళగిరి సన్నిహితంగా మెలగుతూ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఈ ఫిబ్రవరిలో అళగిరి పదవీ కాలం ముగి యనుంది. అధిష్టానవర్గం అళగిరిని టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేదని పార్టీ స్థానిక నాయకులు చెబుతున్నారు. పార్టీలో అళగిరి మంచిపేరు సంపాదించుకున్నా అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉందని, ఆ మేరకు త్వరలో కొత్త నేతను కాంగ్రెస్‌ పీఠంపై కూర్చోపెడుతుందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధిష్టానం ఐదు రాష్ట్రాలకు జరుగనున్న శాసనసభ ఎన్నికలపై దృష్టిసారిస్తోంది. అదే సమయంలో ఈ ఫిబ్రవరిలోగా కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఆ ఎన్నికల వరకూ అళగిరిని పార్టీ అధ్యక్షపదవి నుంచి తప్పించ కుండా కొనసాగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, రాష్ట్రం తరఫున జాతీయ కమిటీ సభ్యులైన నేతలు, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రముఖులు, మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయాలను సేకరించిన మీదటే అధిష్టానవర్గం అనువైన వ్యక్తిని టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా నియమించనుంది.


ఎంపీల తీవ్ర ప్రయత్నాలు...  

టీఎన్‌సీసీ అధ్యక్షపదవి కోసం కాంగ్రెస్‌ ఎంపీలు కొందరు అప్పడే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు సన్నిహితులైన పార్టీ జాతీ య నాయకులతో రహస్య చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు జ్యోతిమణి, కార్తీ చిదంబరం, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఎస్‌.తిరునావుక్కరసు టీఎన్‌సీసీ అధ్యక్ష పదవి తమకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరితో పార్టీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ చెల్లకుమార్‌, నాసే రామచంద్రన్‌ సహా పలువురు ఈ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరా నికి పార్టీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి టీఎన్‌సీసీ అధ్యక్షపదవిని ఎలాగైనా సాధించాలని భావిస్తున్నారు.. ఎంపీ జ్యోతిమణి కూడా జాతీయ కమిటీలో సభ్యులుగా ఉన్న మహిళా నాయకుల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2022-01-19T15:54:54+05:30 IST