రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ Lockdown

ABN , First Publish Date - 2022-01-17T15:49:14+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా ఆదివారం కానుం పొంగల్‌ సందడి లేకుండా సాగింది. రెండో ఆదివారం విధించిన ఈ లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కేసులు 20 వేలు దాటటంతో వైరస్‌

రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ Lockdown

- రహదారులు నిర్మానుష్యం

- అన్ని చోట్లా బంద్‌ దృశ్యాలు

- స్వీయ గృహ నిర్బంధంలో ప్రజలు

 

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా ఆదివారం కానుం పొంగల్‌ సందడి లేకుండా సాగింది. రెండో ఆదివారం విధించిన ఈ లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కేసులు 20 వేలు దాటటంతో వైరస్‌ సోకుతుందన్న భయంతో ప్రజలు ఇంటినుంచి బయటకు కదిలేందుకు తటపటాయించారు. చెన్నై, తిరుచ్చి, కోయం బత్తూరు, మదురై, తంజావూరు, తిరునల్వేలి, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం తదితర నగరాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. జనసంచారాన్ని నిరోధించేందుకు పోలీసులు ఈసారి కూడా గట్టి చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వాహన చోధకులను కట్టడి చేసేలా ప్రధాన రహదారుల్లోని ఫ్లైఓవర్లకు ఇరు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. టీషాపులు, కిరాణా, జౌళి, నగల దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ సహా వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌కు తోడు ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు అధికమవుతుండటంతో ఈ నెల ఆరు నుంచి రాత్రిపూట కర్ఫ్యూ, ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను విజయవంతం చేసేదిశగా డీజీపీ శైలేంద్ర బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మంది పోలీసులకు నిఘా డ్యూటీ చేశారు. వాహనాల సంచారంతోపాటు జనసంచారాన్ని కూడా మునుపెన్నడూలేనంతగా కట్టడి చేశారు. రాజధాని నగరం చెన్నైలో సుమారు13 వేల మంది పోలీసులు కరోనా కట్టడి చర్యలు చేపట్టారు. డ్రోన్‌ల సాయంతో జన, వాహనాల సంచారంపై నిఘా పెట్టారు. గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ స్వీయపర్యవేక్షణలో నగరంలోని 312 చోట్ల ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసుల చర్యల కారణంగా అన్నాసాలై, కామరాజర్‌సాలై, పూందమల్లి హైవే, రాయపేట హైరోర్డు నిర్మానుష్యమయ్యాయి. కానుం పొంగల్‌లో ఇసుకవేస్తే రాలనంత జనంతో ఉండే మెరీనా బీచ్‌ ఆదివారం నిర్మానుష్యమై ఎడారి ప్రాంతాన్ని తలపించింది. రహదారుల్లోని ఫ్లైవోర్లలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.


సెంట్రల్‌జోన్‌లో 82 వేలు దాటిన కేసులు

తిరుచ్చి నగరంతో కూడిన సెంట్రల్‌ జోన్‌లో కరోనా బాధితుల సంఖ్య 82వేలకు పెరిగింది. తిరుచ్చి, తంజావూరు, నాగపట్టినం, తిరువారూరు జిల్లాలతో కూడిన సెంట్రల్‌జోన్‌లో శనివారం 1344 మంది పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. గత రెండు వారాలుగా తిరుచ్చి జిల్లాల్లో రోజుకు సుమారు 400 మందికిపైగా కరోనాకు గురవుతున్నారు. శనివారం నాగపట్టినంలో 47 మందికి, పుదుకోట జిల్లాలో 71 మందికి, కరూరులో 75 మందికి, అరియలూరు జిల్లాల్లో 72 మందికి, పెరంబలూరులో 68 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తిరుచ్చిలో మాస్కులు ధరించని 597 మందికి 2.98 లక్షల వరకూ జరిమాన విధించారు. 


రూ. 20 కోట్ల జౌళి ఉత్పత్తులకు ఆటంకం...

సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా సేలం, నామక్కల్‌ జిల్లాల్లో రూ.2కోట్లకు పైగా జౌళి ఉత్పత్తులు స్తంభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అమలు చేసిన సం పూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా మరమగ్గాలు మూతపడ్డాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా సేలం, నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూరు, కరూరు, కోయంబత్తూరు దిండుగల్‌, కాంచీపురం, విరుదునగర్‌ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. నూలు ధరల పెంపుతో పాటు కరోనా సంపూర్ణ లాక్‌ డౌన్‌ తోడవటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ర్రాతిపూట కర్ఫ్యూ ఆదివారం ప్రకటించిన సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా పర్రిశమ మరింత ఒడిదుడుకులను చవిచూస్తోంది. ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా సేలం, నామక్కల్‌ జిల్లాల్లోనే రూ.2కోట్లకు పైగా ఉత్పత్తి స్తంభించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.20కోట్లకు పైగా ఉత్పత్తి నిలిచిపోయిందని చేనేత పవర్‌లూమ్‌ తయారీ దారులు చెబుతున్నారు.  

Updated Date - 2022-01-17T15:49:14+05:30 IST