తమిళనాడులో నిర్మానుష్యం..

ABN , First Publish Date - 2021-05-11T13:37:04+05:30 IST

రాష్ట్రంలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. దీంతో రాజధాని నగరం చెన్నై సహా అన్ని జిల్లాల్లో మధ్యాహ్నం 12 గంటల అనంతరం వాహన, జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా కని

తమిళనాడులో నిర్మానుష్యం..



చెన్నై: రాష్ట్రంలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. దీంతో రాజధాని నగరం చెన్నై సహా అన్ని జిల్లాల్లో మధ్యాహ్నం 12 గంటల అనంతరం వాహన, జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, ప్రైవేటు బార్లు, ఆడిటోరియంలు, మీటింగ్‌ హాల్స్‌ మూతపడ్డాయి. అలాగే, షాపింగ్‌ కాంప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌, ఆలయాలు, చర్చీలు, మసీదులు మూతపడ్డాయి. కరోనా రెండవదశ కట్టడికి రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. గత నెల 26వ తేదీ నుంచి 19 రకాల నిబంధనలు అమలుకు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం, కరోనా మహమ్మారి ప్రభావాన్ని కట్టడి చేసేందుకు సోమవారం నుంచి ఈనెల 24వ తేది వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ అనుమతించిన మార్గాల్లో మినహాయించి విదేశాలకు విమానసేవలను రద్దు చేసింది. మరోవైపు 3 వేల చదరపు అడుగులకు పైగా ఉన్న దుకాణాలు, వాణిజ్య కాంప్లెక్స్‌, మాల్స్‌పై నిషేధం విధించింది. అయితే, సంపూర్ణ లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు కొత్త సమస్యలు ఎదుర్కోకుండా చిల్లర పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల విక్రయ దుకాణాలు మాత్రం ఏసీ వసతి లేకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేసేందుకు అనుమతించింది. హోటల్స్‌, రెస్టారెంట్లలో పార్శిల్‌ సేవలకు మాత్రమే అనుమతి జారీ చేసింది. రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన ఊటీ, కొడైకెనాల్‌, ఏర్కాడు తదితర పర్యాటక ప్రాంతాల సందర్శనకు నిషేధం విధించింది. అలాగే, బీచ్‌లు, పార్కులు, మ్యూజియం, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలకు వెళ్లరాదని నిషేధం విధించింది. కరోనా బాధితులకు సేవలందించే వైద్యులు, నర్సులు, ఇతర సేవాసంస్థలు, మీడియా, పాత్రికేయులు యథావిధిగా పనిచేసేందుకు అనుమతించింది. వీరి కోసం చెన్నై మెట్రోపాలిటన్‌ రవాణా సంస్థ సోమవారం నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలు కలిపేలా 200 సిటీ బస్సులు నడిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే విధులు నిర్వహించారు. అందువల్ల చెన్నై సహా అన్ని నగరాల్లో ఐటీ సంస్థలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని హెచ్చరించేలా నగర పోలీసులు 200 ప్రాంతాల్లో వాహనతనిఖీలు నిర్వహించారు. కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌, కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌, మెరీనా బీచ్‌, బీసెంట్‌నగర్‌ ఎలియట్స్‌ బీచ్‌, పట్టినంబాక్కం బీచ్‌ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే, నగరంలో 30 పెద్ద ఫ్లైఓవర్లు మూసివేశారు. అలాగే, మిగిలిన జిల్లాల్లో కూడా అన్నిరకాల ఫ్లై ఓవర్లు మూసివేసిన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. చెన్నైలో సుమారు 10 వేల మంది, రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష మంది పోలీసులు భద్రతా విధులు చేపట్టారు. అదే విధంగా, మెట్రోరైలు సేవలు పూర్తిగా రద్దు చేయగా, తక్కువ సంఖ్యలో సబర్బన్‌ రైళ్లు నడిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా టాస్మాక్‌ మద్యం దుకాణాలు మూతపడ్డాయి.

Updated Date - 2021-05-11T13:37:04+05:30 IST