నేటినుంచి అసెంబ్లీ

ABN , First Publish Date - 2022-04-06T13:51:02+05:30 IST

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ మలిదశ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవి మే నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గత నెల 18వ తేదీన

నేటినుంచి అసెంబ్లీ

                             - మే 10 వరకు సమావేశాలు


అడయార్‌(చెన్నై): రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ మలిదశ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవి మే నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గత నెల 18వ తేదీన సమావేశమైన శాసనసభలో రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ 2022-23 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 19వ తేదీ వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం సభలో దాఖలు చేశారు. రెండు రోజుల సెలవుదినాల తర్వాత 21న సమావేశమైన సభ 24వ తేదీ వరకు జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదాపడింది ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మలిదశ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. 


ఒక్కో రోజు ఒక్కో పద్దుపై చర్చ 

ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కో రోజు ఒక్కో మంత్రిత్వ శాఖకు చెందిన పద్దులపై చర్చిస్తారు. ఆ ప్రకారంగా 6వ తేదీ జలవనరులు, 7న మున్సిపాలిటీలు, మెట్రోవాటర్‌, గ్రామీణ మంత్రిత్వ శాఖ, 8న సహకార, ఆహార మంత్రిత్వ శాఖలపై చర్చిస్తారు. 11వ తేదీ ఉన్నత, పాఠశాల విద్యాశాఖ పద్దులపై, 12వ తేదీ రాష్ట్ర రహదారులు, ప్రజా పనులు, చిన్న ఓడరేవులపై చర్చ జరుగుతుంది. 13వ తేదీ వ్యవసాయం, రైతు సంక్షేమం, పాడి, మత్స్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలు, 18న రెవెన్యూ, జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల పద్దులపై చర్చిస్తారు. 19వ తేదీ జైళ్ళశాఖ, యూనిఫామ్డ్‌ సర్వీసులు, న్యాయ శాఖ, సమాచార, ప్రచార, ముద్రణ శాఖల పద్దులపై చర్చిస్తారు. 20వ తేదీన గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, 21వ తేదీన వికలాంగ  సంక్షేమం, సాంఘిక సంక్షేమం, మహిళా హక్కులు, 22వ తేదీన బీసీ, ఎంబీసీ, మైనార్టీ సంక్షేమం, 25వ తేదీన అటవీ శాఖ, పర్యావరణం, యువజన సర్వీసులు, క్రీడాభివృద్ధి, 26వ తేదీన ఎక్సైజ్‌, కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, 27వ తేదీన పరిశ్రమలు, తమిళాభివృద్ధి శాఖలు, 29వ తేదీన వైద్యం, ప్రజా ఆరోగ్యం మంత్రిత్వ శాఖలకు చెందిన పద్దులపై చర్చిస్తారు. మే 4వ తేదీన రవాణా శాఖ, 5వ తేదీన దేవాదాయ, పర్యాటక శాఖ, 6వ తేదీన ఆది ద్రావిడ సంక్షేమం, 7వ తేదీన హోం, ఫైర్‌ సర్వీస్‌ శాఖలపై వాడీవేడిగా చర్చ జరుగనుంది. 9వ తేదీన పోలీస్‌ శాఖపై వచ్చిన, విపక్ష సభ్యులు లేవనెత్తే అంశాలకు మంత్రులు, ముఖ్యమంత్రి సమాధానమిస్తారు. ఈ సమావేశాల సమయంలో ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభకాగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. అంతేకాకుండా, ఈ సభా సమయంలో 110 నిబంధన కింద ముఖ్యమంత్రి స్టాలిన్‌ కొత్త ప్రకటనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని వివిధ సమస్యలపై నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంది. 

Updated Date - 2022-04-06T13:51:02+05:30 IST