రామేశ్వరం : తమిళనాడులో అష్ట దిగ్బంధనం నిబంధనల అమలులో సడలింపులు ఇచ్చినప్పటికీ, ప్రజలు ప్రయాణాలు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఆటో రిక్షా డ్రైవర్లు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు.
రామేశ్వరంలో ఆటో రిక్షా డ్రైవర్లు మాట్లాడుతూ, నాలుగో విడత అష్ట దిగ్బంధనం సమయంలో కొన్ని నిబంధనలకు సడలింపులు ఇచ్చినప్పటికీ, కనీసం ఒక ప్రయాణికుడి కోసం ఒక రోజు మొత్తం ఎదురు చూడవలసి వస్తోందని వాపోయారు.
ప్రయాణికులు ప్రయాణాలు చేయడానికి ముందుకు రావడం లేదని ఆటో రిక్షా డ్రైవర్లు తెలిపారు. అష్ట దిగ్బంధనం వల్ల యాత్రికులు రావడం లేదని, స్థానికులు కూడా ప్రయాణాలు చేయడం లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తమకు ఆదాయం లభించడం లేదని చెప్పారు.
తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన కోవిడ్-19 మార్గదర్శకాల్లో ఆటో రిక్షాలు, ఈ-రిక్షాలు, సైకిల్ రిక్షాలు నడవవచ్చునని పేర్కొంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వీటిని నడుపుకోవచ్చునని తెలిపింది. అయితే ఒక ఆటో రిక్షాలో ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రయాణించాలని తెలిపింది. చెన్నై, కంటైన్‌మెంట్ జోన్లలో ఆటో రిక్షాలు నడిపేందుకు అనుమతించలేదు. మూడు రోజులకు ఒకసారి వాహనాలను శానిటైజ్ చేయించాలని తెలిపింది. మాస్క్‌లను అందరూ తప్పనిసరిగా ధరించాలని తెలిపింది.