ఘనంగా తమిళ ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2022-04-15T13:13:30+05:30 IST

తమిళ నూతన సంవత్సరాదికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా తమిళులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టి.నగర్‌లోని టీటీడీ ఆలయంలో చెన్నై

ఘనంగా తమిళ ఉగాది వేడుకలు

                      - ఆలయాల్లో ప్రత్యేక పూజలు


ప్యారీస్‌(చెన్నై): తమిళ నూతన సంవత్సరాదికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా తమిళులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టి.నగర్‌లోని టీటీడీ ఆలయంలో చెన్నై సమాచార కేంద్ర సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ పర్యవేక్షణలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అరటి, మామిడి తోరణాలతో అలంకరించారు. దేవేరుల సహా శ్రీవారికి విశేషాలంకరణ చేసిన ఈ ఆస్థానం పూజలో సలహా మండలి ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సభ్యులు వి.మోహన్‌రావు, పీవీఆర్‌ కృష్ణారావు, చరణ్‌రెడ్డి, సందీ్‌పరెడ్డి, నరేష్‌, ఆనంద్‌కుమార్‌రెడ్డి, మాజీ సభ్యుడు అనీల్‌కుమార్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు నూతలపాటి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తమిళ సంవత్సరాది రద్దీని పురస్కరించుకొని ఆలయం ముందు ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే, తిరుప్పూర్‌లో ప్రసిద్థిచెందిన  కోట మారియమ్మన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని లక్షల విలువ చేసే కరెన్సీ నోట్లతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కాంచీపురం జిల్లా మేల్‌మరువత్తూర్‌ ఆదిపరాశక్తి పీఠంలో గురువారం వేకువజామున 3 గంటలకు మంగళవాయిద్యాల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేక, అలంకరణ పూజలను పీఠాధిపతి బంగారు అడిగళార్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైష్ణవ, శైవ, అమ్మవారి ఆలయాలు, తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌, దిండుగల్‌ జిల్లా పళని సుబ్రమణ్యస్వామి, స్థానిక వడపళని క్షేత్రాలు తమిళ ఉగాది ప్రత్యేక పూజలతో భక్తులతో కిటకిటలాడాయి. 


సమృద్ధిగా వర్షాలు

- ఆర్కాడు పంచాంగంలో వెల్లడి

సుందరరాజన్‌ అయ్యంగార్‌ ముద్రించిన ఆర్కాడు పంచాంగంలో ఈ నూతన సంవత్సరంలో కలిగే కష్టసుఖాలు వివరించారు. సూర్యభగవానుడు గురువారం ఉదయం 7.36 గంటలకు మేష రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో బుధుడు, గురుడు కొలువై ఉన్నందున ఈ నూతన సంవత్సరంలో వ్యాఽధుల తీవ్రత తగ్గుతోందని, వర్షాలు సమృద్ధిగా కురిసి భూమి చల్లబడుతుందని ఆ పంచాంగంలో పేర్కొన్నారు.



Updated Date - 2022-04-15T13:13:30+05:30 IST