తమిళనాడు విద్యార్థిని ఆత్మహత్య కేసు... NCPCR దర్యాప్తులో దిగ్భ్రాంతికర నిజాల వెల్లడి...

ABN , First Publish Date - 2022-03-06T21:31:49+05:30 IST

తమిళనాడులోని తంజావూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్య

తమిళనాడు విద్యార్థిని ఆత్మహత్య కేసు... NCPCR దర్యాప్తులో దిగ్భ్రాంతికర నిజాల వెల్లడి...

న్యూఢిల్లీ : తమిళనాడులోని తంజావూరులో ఓ విద్యార్థిని ఆత్మహత్య కేసుపై దర్యాప్తు చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) దిగ్భ్రాంతికర వాస్తవాలను వెల్లడించింది. బాధితురాలిని క్రైస్తవ మతంలోకి మారాలని ఆమె చదువుతున్న పాఠశాల అధికారులు నిర్బంధించిన విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని తెలిపింది. పాఠశాల అధికారులతోపాటు, పోలీసుల ప్రవర్తనను కూడా తప్పుబట్టింది. ఈ వివరాలను జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, తంజావూరుకు చెందిన పదిహేడేళ్ళ బాలిక లావణ్య సేక్రెడ్ హార్ట్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌‌లో పన్నెండో తరగతి చదివేవారు.  సెయింట్ మైఖేల్ హాస్టల్‌లో ఉండేవారు. ఆ హాస్టల్ వార్డెన్ సగయమేరీ ఆమెను క్రైస్తవ మతంలో చేరాలని నిర్బంధించేవారని ఆమె ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనంతరం ఆమె జనవరిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తండ్రి మురుగనాథం విజ్ఞప్తి మేరకు మద్రాస్ హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)కు  జనవరి 31న అప్పగించింది. సీబీఐ ఫిబ్రవరి 15న ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక)ను నమోదు చేసింది. వార్డెన్ సగయమేరీపై ఆరోపణలు నమోదు చేసింది. 


ఈ నేపథ్యంలో లావణ్య ఆత్మహత్య కేసుపై దర్యాప్తు జరపాలని కోరుతూ NCPCR కు 3,545 ఫిర్యాదులు అందాయి. దీంతో NCPCR చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో, విద్యా విభాగం సలహాదారు మధులిక శర్మ, లీగల్ కన్సల్టెంట్ కాత్యాయని ఆనంద్‌లతో ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. జనవరి చివరి వారంలో ఈ కమిటీ తంజావూరులో పర్యటించింది. అధికారులు, లావణ్య తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలాలను సేకరించింది. సంబంధిత పత్రాలను కూడా సేకరించింది. 


యథార్థాలను దాచే ప్రయత్నాలు

లావణ్యను క్రైస్తవ మతంలోకి మారాలని హాస్టల్ వార్డెన్, ఇతరులు నిర్బంధించిన విషయాన్ని దాచిపెట్టడానికి స్కూలు అధికారులు, పోలీసులు ప్రయత్నించారని ఈ కమిటీ దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడు పోలీసుల ఉద్దేశాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్లు పేర్కొంది. సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి స్కూల్ అథారిటీస్ ప్రయత్నించినట్లు గుర్తించింది. స్థానిక పోలీసులు దర్యాప్తు జరపడానికి వీలుగా నేరం జరిగిన ప్రదేశాన్ని మూసివేసి, కాపాడలేదని తెలిపింది. క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేయడం కోసం ఈ కేసులో నిందితురాలైన హాస్టల్ వార్డెన్‌ను అక్కడికి తీసుకెళ్ళలేదని గుర్తించింది. ఇది పోలీసుల వైపున జరిగిన అతి పెద్ద లోపమని తెలిపింది. చట్టం నిర్దేశించిన విధానాన్ని పట్టించుకోలేదని పేర్కొంది. ఆమెకు కెమికల్ పదార్థాన్ని అమ్మినవారెవరో పోలీసులు గుర్తించలేకపోయారని పేర్కొంది. 


మరుగుదొడ్లు కడిగించారు 

ఈ స్కూల్‌లో ప్రత్యేకంగా గదులు లేవని, విద్యార్థులు ఉండటం కోసం హాలునే ఉపయోగిస్తున్నారని, అయితే ఈ హాలును సంఘటన జరిగిన తర్వాత శుభ్రం చేశారని, అవసరమైన వస్తువులన్నిటినీ వేరొక చోటుకు తరలించారని తెలిపింది. ఫర్నిచర్, పుస్తకాలు, బట్టలు వంటివేవీ అక్కడ లేవని పేర్కొంది. స్థానిక పోలీసులు న్యాయమైన రీతిలో దర్యాప్తు జరపలేదని, సముచిత విధానాన్ని అనుసరించలేదని తెలిపింది. 


ఆసుపత్రికి పంపే ముందు ఫీజు వసూలు

బాలిక ఆత్మహత్యకు పాల్పడినపుడు హాస్టల్ అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించలేదని, బాధితురాలి తల్లిదండ్రులు వచ్చే వరకు వేచి చూశారని పేర్కొంది. బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అనుమతించడానికి ముందు ఆమె చెల్లించవలసిన ఫీజును ఆమె తల్లి వద్ద స్కూలు అధికారులు వసూలు చేశారని తెలిపింది. 


స్కూలు యాజమాన్యం కట్టుకథలు

బాధితురాలు లావణ్యకు సవతి తల్లి ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ఆ సవతి తల్లి ప్రేరేపించిందని స్కూలు యాజమాన్యం కట్టుకథలు అల్లుతోందని తెలిపింది. స్కూల్ కమిటీ అధికారిక పనులను వార్డెన్ చేయవలసి ఉండగా, ఆ పనులను లావణ్య చేత చేయించేవారని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. బుక్ కీపింగ్, అకౌంటింగ్, స్టోర్ మేనేజ్‌మెంట్ వంటి పనులను లావణ్య చేత చేయించేవారని, అంతేకాకుండా మరుగుదొడ్లు శుభ్రపరచడం, హాలును శుభ్రపరచడం, తలుపులు తెరవడం వంటి పనులను కూడా ఆమె చేత చేయించేవారని తెలిపింది. హాస్టల్‌లో ఉండగా ఆమెకు లభించిన సంరక్షణకు సంబంధించిన యథార్థాలను దాచిపెట్టే ప్రయత్నాలకు దర్యాప్తు అధికారులు పాల్పడినట్లు కూడా వెల్లడైందని తెలిపింది. ఆమెను క్రైస్తవంలోకి మారాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఆమె తల్లిదండ్రులు చేసిన  ఫిర్యాదులపై దర్యాప్తు చేయడానికి అధికారులు ముందుకు రాలేదని తెలిసిందని పేర్కొంది. 


NCPCR  జనవరి 20న తమిళనాడు డీజీపీకి ఓ లేఖ రాసింది. లావణ్య ఆత్మహత్య కేసుపై దర్యాప్తు చేయాలని కోరింది. నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరింది. కానీ పోలీసులు స్పందించలేదు.


Updated Date - 2022-03-06T21:31:49+05:30 IST