ప్రభుత్వోద్యోగాలకు తమిళ పరీక్ష తప్పనిసరి : తమిళనాడు ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-04T21:15:28+05:30 IST

తమిళనాడులోని అన్ని ప్రభుత్వోద్యోగాలకు అర్హత పరీక్షగా తమిళంను

ప్రభుత్వోద్యోగాలకు తమిళ పరీక్ష తప్పనిసరి : తమిళనాడు ప్రభుత్వం

చెన్నై : తమిళనాడులోని అన్ని ప్రభుత్వోద్యోగాలకు అర్హత పరీక్షగా తమిళంను తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షల్లోనూ తమిళ భాషలో అర్హత పరీక్షను తప్పనిసరిగా అభ్యర్థులు ఉత్తీర్ణులవాలని తెలిపింది. తమిళ భాష పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు వస్తేనే, మిగిలిన సబ్జెక్టుల పేపర్లను పరిశీలించనున్నట్లు వివరించింది. ఈ ఆదేశాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 


తమిళనాడు మానవ వనరుల నిర్వహణ శాఖ కార్యదర్శి మైథిలి కే రాజేంద్రన్ జారీ చేసిన ఈ ఆదేశాల్లో, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ పరీక్షలకు తమిళ భాష పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ అర్హత పరీక్ష  10వ తరగతి స్థాయిలో ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు పొందడం తప్పనిసరి అని తెలిపారు. ఈ తమిళ పరీక్షలో ఉత్తీర్ణులు కానటువంటి అభ్యర్థులు రాసిన ఇతర సబ్జెక్టుల జవాబు పత్రాలను పరిశీలించబోమని వివరించారు. 


టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, తమిళనాడు యూనిఫార్మ్‌డ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, తమిళనాడు ఫారెస్ట్ యూనిఫార్మ్‌డ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కమిటీ కూడా ఇటువంటి ఆదేశాలను వేర్వేరుగా ఇవ్వబోతున్నాయి. 


Updated Date - 2021-12-04T21:15:28+05:30 IST